Sep 22,2022 20:14

న్యూఢిల్లీ : కర్ణాటకలో తరగతి గదుల్లో ముస్లిం విద్యార్ధినులు హిజాబ్‌ ధరించడంపై నిషేధాన్ని సవాలు చేసిన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్‌ చేసుకుంది. ఇరు పక్షాల వాదనలను పది రోజుల పాటు విన్న అనంతరం జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ సుధాంశు దౌలియాలతో కూడిన బెంచ్‌ తీర్పు చెప్పకుండా వాయిదా వేసింది. నిర్దేశించిన స్కూలు యూనిఫారాలను విద్యార్ధులు ధరించేలా నిబంధనలను పాటించాలంటూ విద్యాసంస్థలను ఆదేశించే అధికారం తమకు వుందని, ఈ ఆదేశాలు విద్యార్థుల మధ్య తేడాలు లేకుండా చూసేందుకు, సమానత్వానికి ఉపయోగపడతాయని కర్ణాటక ప్రభుత్వం కోర్టులో వాదించింది. పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా సామాజిక మాధ్యమాల ద్వారా హిజాబ్‌ వివాదాన్ని లేవనెత్తుతోందని తాజాగా ఆరోపించింది. హైకోర్టులో గతంలో ప్రస్తావించని పాపులర్‌ ఫ్రంట్‌ అంశాన్ని ఈసారి కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో లేవనెత్తిందని, ఇందుకు ఎలాంటి సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టలేదని పిటిషనర్ల తరపు న్యాయవాదులు పేర్కొన్నారు.