Nov 23,2022 21:29
  • ఐసిసి టి20 ర్యాంకింగ్స్‌ విడుదల

దుబాయ్: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తాజా టి20 ర్యాంకింగ్స్‌లోనూ టాప్‌లోనే కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసిసి) బుధవారం విడుదల చేసిన బ్యాటర్స్‌ ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ 890 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇటీవల ముగిసిన టి20 ప్రపంచకప్‌లో 239పరుగులు చేసిన సూర్య... తాజాగా న్యూజిలాండ్‌తో ముగిసిన టి20 సిరీస్‌లోనూ చెలరేగాడు. ఆ సిరీస్‌లో అతను 124 పరుగులు చేశాడు. మౌంట్‌మౌంగనీలో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్‌ సెంచరీ(111(నాటౌట్‌) రాణించడంతో అతని ర్యాంక్‌ మరింత మెరుగైంది. దీంతో సూర్యకుమార్‌ తన కెరీర్‌లోనే అత్యధికంగా 895 పాయింట్లతో టాప్‌ బ్యాటర్‌గా నిలిచాడు. ఆ తర్వాత అయితే నేపియర్‌ టి20లో 13పరుగులకే ఔట్‌ కావడంతో అతని పాయింట్ల సంఖ్య 890కి పడిపోయింది. కానీ టాప్‌ బ్యాటర్‌ లిస్టులో రెండవ స్థానంలో ఉన్న బ్యాటర్‌ కన్నా 54 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నాడు. ఆ తర్వాత స్థానాల్లో రిజ్వాన్‌(836), కాన్వే, బాబర్‌లు ఉన్నారు. ఇక టి20 బౌలర్ల జాబితాలో భువనేశ్వర్‌ కుమార్‌ 2స్థానాలు మెరుగుపరుచుకొని 11వ స్థానంలో నిలువగా.. చివరి టి20లో సత్తా చాటిన ఎడమచేతి వాటం సీమర్‌ ఆర్ష్‌దీప్‌ సింగ్‌ ఏకంగా 21వ ర్యాంక్‌కు ఎగబాకాడు. స్పిన్నర్‌ చాహల్‌ 8స్థానాలు దిగజారి 40వ ర్యాంక్‌లో నిలిచారు. ఇక వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్‌ కోహ్లి 6వ ర్యాంక్‌లో, రోహిత్‌ శర్మ 8వ ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. ఇదే క్రమంలో గాయంతో చాలాకాలంగా వన్డేలకు దూరంగా ఉన్న జస్ప్రీత్‌ బుమ్రా బౌలర్ల జాబితాలో 11వ స్థానంలో నిలువగా.. ఈ జాబితాలో భారత బౌలర్లు ఎవ్వరూ టాప్‌-10లో చోటు దక్కించుకోలేకపోయారు.