Aug 06,2022 21:29
  • పూణెకు గీతం మెడికో విద్యార్థి శాంపిల్స్‌

ప్రజాశక్తి-గ్రేటర్‌ విశాఖ బ్యూరో : దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే వెలుగు చూస్తూ ఆందోళన కలిస్తోన్న మంకీపాక్స్‌ తాజాగా విశాఖలోనూ కలకలం రేపింది. గీతం యూనివర్సిటీకి చెందిన 22 ఏళ్ల ఓ మెడికో విద్యార్థిలో మంకీపాక్స్‌ అనుమానిత లక్షణాలు కనిపించాయి. దీంతో, ఆ మెడికోను పరిశీలనలో ఉంచారు. సదరు విద్యార్థి పరారై శనివారం సాయంత్రం అధికారులకు చిక్కాడు. పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంతో భయపడి మెడికో వెనక్కి వచ్చేశాడని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి విజయలక్ష్మి తెలిపారు. గీతం యూనివర్సిటీలో మెడిసిన్‌ చదువుతున్న విద్యార్థి ఇటీవల హైదరాబాద్‌ వెళ్లి విశాఖ వచ్చాడు. జ్వరం, ఒంటిపై దద్దుర్లు వంటి అనారోగ్యంతో గీతంలో చూపించుకోగా మంకీపాక్స్‌ అనుమానిత లక్షణాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఆంధ్రా మెడికల్‌ కాలేజీ నుంచి నలుగురు వైద్యుల బృందం పరీక్షించడానికి వెళ్లిన నేపథ్యంలో ఆ విద్యార్థి పరారయ్యాడు. దీంతో, జిల్లా అధికారుల్లో టెన్షన్‌ మొదలైంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ మెడికో భయపడి తిరిగి వచ్చాశాడు. ఆయనకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. శాంపిల్స్‌ను సేకరించి పూణెకు పంపించామని, మూడు రోజుల్లో విషయం తేలనుందని విశాఖ డిఎం అండ్‌ హెచ్‌ఒ డాక్టర్‌ విజయలక్ష్మి 'ప్రజాశక్తి'కి తెలిపారు.