
మధిర పట్టణం : అమెరికాలో ఎంఎస్ చదవడానికి వెళ్లిన ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన మహంకాళి అఖిల్‌సాయి (23) అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటనలో రవితేజ గోలి (23) అనే యువకుడిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు.
అఖిల్‌సాయి 13 నెలల కిందట అమెరికాలోని అలబామ పట్టణంలోని ఆబన్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చదువుకునేందుకు వెళ్లారు. అక్కడి కాలమానం ప్రకారం ... ఆదివారం రాత్రి 9.30 సమయంలో తలకు బుల్లెట్ గాయాలతో చావుబతుకుల్లో ఉన్న అఖిల్‌సాయిని పోలీసులు ఆసుపత్రికి తరలించగా.. మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. హత్య ఆరోపణలతో అదే ప్రాంతానికి చెందిన రవితేజ గోలిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రవితేజ అలబామా రాజధాని మోంటెగోమరి జైలులో ఉన్నాడు. దీనికి సంబంధించి ఇతర వివరాలను అక్కడి అధికారులు వెల్లడించలేదు.
మృతదేహం తరలింపునకు ప్రభుత్వ సాయం కోరిన తల్లిదండ్రులు
అఖిల్‌సాయి తల్లిదండ్రులు ఉమాశంకర్, మాధవి దంపతులు కొద్ది సంవత్సరాలుగా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం మధిర వచ్చిన ఈ దంపతులు.. కుమారుడి మృతి వార్తతో హృదయ విదారకంగా రోదిస్తున్నారు. ఉన్నత చదువులకు అమెరికా వెళ్లిన తమ కుమారుడు ఈ స్థితిలో దేశానికి తిరిగి వస్తాడని ఊహించలేదని కన్నీటిపర్యంతమయ్యారు. అఖిల్‌సాయి మృతదేహాన్ని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అమెరికా ప్రభుత్వం సహాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.