
కవి, పాత్రికేయులు, చరిత్ర పరిశోధకులు, కథా రచయితగా ఈతకోట సుబ్బారావు అందరికీ సుపరిచితులు. ఆయన వచన కవిత్వానికి గుర్తింపుగా అనేక అవార్డులు కూడా అందుకున్నారు. సుబ్బారావు గారి సంపాదకత్వంలో విశాలాక్షి అనే మాసపత్రిక గత 13 సంవత్సరాలుగా వెలుగుతున్న సంగతి మనకు తెలుసు. ఆ మాస పత్రికలో ఆయన సంపాదకీయాన్ని వచన కవితగా రాయడాన్ని చాలాకాలంగా మనం చూస్తూనే ఉన్నాం. ఆ సంపాదకీయం ఆలోచించే విధంగా ఉంటుంది. సరికొత్త ఆలోచన రేకెత్తించేదిగా ఉంటుంది. భిన్నంగా ఉంటుంది. దినపత్రికలో వచ్చే సంపాదకీయానికి మాసపత్రికలో వచ్చే సంపాదకీయానికి తేడాలుంటాయి. సంపాదకీయాన్ని పత్రిక ఆత్మగా పేర్కొంటారు. .ప్రముఖ పాత్రికేయులు నార్ల వెంకటేశ్వరరావు గారు 'అప్పుడే వండి, వార్చి వడ్డించిన అన్నం'గా సంపాదకీయాన్ని పేర్కొంటారు. అయితే ఇక్కడ సుబ్బారావు విశాలాక్షి పత్రికలో ఆ మాసంలో తనను కదిలించిన సంఘటన, సమకాలీన సమాజంలో చెలరేగిన ఆక్రందన, మరణించిన కవి గురించి, కురవని వాన గురించి, పండగ గురించి, రైతు గురించో, స్త్రీ గురించో కవితా రూపంలో సంపాదకీయం రాశారు. 13 సంవత్సరాలకు 160 వరకు సంపాదకీయాలు ఉంటాయి. వాటిలో ఎంపిక చేసిన వాటిని ఇటీవల 'విశాల నయనం' పేరుతో సంకలనంగా తీసుకొచ్చారు.
ఈ సంపాదకీయ కవిత్వంలో మనిషిలో పేర్కొన్న చెత్తని తొలగించడానికి ఈతకోట అక్షరాల చీపురుని కట్టాడు. మనసులో ఉన్న మురికి కాలవను శుభ్రం చేయడానికి పాటల బెత్తాల్ని సిద్ధం చేశాడు. తరతరానికి తుప్పు పడుతున్న మెదడు గదిలో దీపం పెట్టాలని మాటలని వత్తులుగా తయారు చేశాడు. సమూహానికి, సమూహానికి మనిషికి మనిషికి మధ్య ఏర్పడుతున్న అగాధాలను కలిపే వారధి కట్టే ప్రయత్నం చేశారు. ఇంకిపోయిన చిరునవ్వుల నదిలో నిలబడి కలంపారతో జలను తవ్వే ప్రయత్నం చేశాడు. గలీజ్ వాతావరణాన్ని శుభ్రపరిచే ప్రక్రియని భుజానికి ఎత్తుకున్నాడు. మమతల రహదారుల్లో అనురాగాల విత్తులు నాటాలని పిలుపునిస్తున్నాడు. ప్రపంచాన్ని ప్రేమభాషతో పలకరించాలని అక్షర హస్తాలతో మూసుకుపోయిన గుండె తలుపుల్ని తెరుచు కోవా లని ఆరాటపడుతున్నారు. ఈ సంపాదకీయాలు నిండా రేపటి వెలుతురు కలలు నింపాలనే ప్రయత్నం కనిపిస్తుంది.
ఇందులో అనుభూతి ప్రధానమైన వాక్యాలతో కూడిన సంపాదకీయాలు కూడా కొన్ని ఉన్నాయి. వర్షం నేపథ్యంలో ఓ మూడు నాలుగు సంపాదకీయాలను పరిశీలించినప్పుడు 'ఒక వర్షం అనేక దశ్యాలు' లో ఇలా అంటారు
''చినుకులు పడుతుంటే
ఆకాశం అన్నదానం చేస్తున్నట్లుంది
వాన కళ్లాపి చెందిన చెలక
తడిసిన రైతు దేహంలా మెరుస్తోంది
వానలో తలారా స్నానం చేసిన వృక్షాలు
తలలో చిరునవ్వు పూలు ముడుస్తాయి
నది దేహం పైన పులకరింత అయిన జల్లు
క్షణిక ముత్యాలను వెదజల్లుతుంది
ఒళ్లంతా నీటి చురకైన వాన
నరాల్లో విద్యుత్ ప్రవహిస్తుంది
కనతల్లిలా పూవ్వుకు లాల పోస్తే వాన
చలిగాలి ఒళ్లంతా తుడుస్తుంది.
.... ఇలా అక్షరాలను పేర్చుకుంటూ సరాసరి మన గుండెల్లో వాన కురిపిస్తారు సుబ్బారావు. మానవత్వం మనిషి తత్వం నేపథ్యంలో ఇందులో అనేక సంపాదకీయ కవితలను మనం చూడవచ్చు. మనిషి వెలుతురు స్నానం చేయాల్సిన అవసరం గురించి సుబ్బారావు ఆక్రోశించారు. కోల్పోయిన మనిషి కోసం కౌగిలి సాచాల్సిన అవసరం గురించి ఆలోచించమంటారు. మన కపాలాలపై పూసుకున్న చీకటి మైలని తొలగించుకోవడానికి వెళుతున్నాను అని తీర్మానం చేస్తారు. ముక్కలై పోతున్న మనుషులందరూ కలవాలని కోరుకుంటారు.
''చీకట్లోంచి వెలుతురుకు ప్రస్తావించే చోట
కన్నీటి నుంచి చిరునవ్వుకు పయనించే చోట
తలవాకిట ఆహ్వాన గీతం రచించే చోట
మనిషిని మనిషి ఆత్మలింగనం చేసుకుంటూ
మనిషి చిరునామా వెతుక్కుందాం.''
కరోనాకాలంలో వలస కార్మికుల బాధల గురించి, దుఃఖం గురించి మనమంతా కవితలు రాశాము. సుబ్బారావు సజీవ పాదాలు అనే పేరుతో రాసిన కవిత కాస్త విభిన్నంగా ఉంటుంది.
''బ్రహ్మ కడిగిన పాదం చూళ్ళేదు
బలి మోపిన వామన పాదం చూళ్ళేదు
కైలాసంలో తాండవ పాదం చూళ్ళేదు'' మరి కవి ఏ పాదాలు చూసాడు? ఎలాంటి పాదాలు చూసాడు? కొండల్లో కోనల్లో, అడవుల్లో ఎడారుల్లో రస్తాలు పరిచిన పాదాలను చూశాడు. చీరుకు పోయి పుండ్లు పడి రసి కారుతున్న పాదాలను చూశాడు. ఆకలికి నకనకలాడే పాదాలను చూశాడు. నీళ్ళు లేక పెదవులు చీరుకుపోయిన పాదాలను చూశాడు. కమిలిపోయిన కన్న తల్లిపాదాలను చూశాడు. పల్లేరు మీద నడక సాగిస్తున్న నిరుపేద పాదాలను చూశాడు. ''నేలతల్లి మలాము పెదవులతో ముద్దాడుతున్న / మొరటు వలస పాదాలను చూశాను'' అంటాడు.
మనకు బాగా దగ్గరైన వాళ్ళు మనల్ని ప్రభావితం చేసినవాళ్లు శాశ్వతంగా వెళ్లిపోయినప్పుడు కన్నీరు కారుస్తాం. బాధపడతాం. వేదన చెందుతాం. సుబ్బారావు గారు కూడా కన్నీరు కార్చారు కాకుంటే కలంతో. ఈ సంపాదకీయాల్లో చాలా భాగం వరకు నివాళి కవితలు ఉన్నాయి. ఆ నివాళి కవితల్లో మరణించిన వారి ఆత్మ మనకు కనిపిస్తుంది, హృదయం మనకు వినిపిస్తుంది. ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి స్మ ృతిలో రాసిన కవిత 'పాటకు వేళయింది'. బాలు పాటకు ఎలా ప్రాణం పోసేవాడో, అతని సరాగ సంతకం ఆత్మలు తనివితీరా ఎలా ఆస్వాదించేవో, శ్రోతల దాహాన్ని ఆ స్వర జలపాతం ఎలా తీర్చేదో, అతని నాదం కోటి కోటి హృదయాల దేవాలయాల్లో సరిగమల దేవిగా ఎలా కొలువైందో ఆ కవితలో గొప్పగా ఆవిష్కరించారు.
''పాట ఎగిరిపోయింది/ భువన భవన విశ్వాంతర సోపానాల్లోకి పాట ఎగిరిపోయింది/ గీతానికి సంగీతానికి జుగల్బందీ కూర్చిన పాట/ సామాన్యుడి నోట శంకరాభరణమై పలికిన పాట/ పదాలకి నవరసామృతం రంగరించిన పాట / లింగాష్టకాన్ని నింగిలో నిలిపిన పాట/ దేవి దేవతలను భూమికి దింపిన పాట / ఎన్నో పాత్రలకు ప్రాణదానం చేసి చేసి అలసి సొలసి విశ్వాంతర వినువీధుల్లో పాట నిద్రపోతుంది''
దిగంబర కవి మహా స్వప్నకి, ప్రముఖ రచయిత్రి అబ్బూరి ఛాయాదేవికి నివాళిగా రాసిన 'మరణం ఒక స్వప్నం జీవితం ఒక మెలకువ' అనే కవిత స్మృతి కవితలలో వచ్చిన గొప్ప కవిత. అందులో ఆయన చెప్పిన వాక్యాలు పరిశీలిస్తే ... ''కొందరు మరణంలో పుట్టి జీవితంలో మరణిస్తారు మరికొందరు జీవితంలో పుట్టి జీవిస్తూ మరణిస్తారు.. మరణించినా జీవిస్తుంటారు.. మరణం ఒక స్వప్నం జీవితం ఒక మెలకువ'' ఈ విధంగా సుబ్బారావు మండేలా, పెద్దిబొట్ల, సోమ సుందర్, సినారె, మల్లి మస్తాన్ బాబు, ఎండ్లూరి సుధాకర్, అక్కినేని లాంటివారు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళినప్పుడు వారిని స్మరించుకుంటూ రాసిన వాక్యాలు గుర్తించదగినవి గా ఉన్నాయి.
మొదటి వాక్యం నుండి చివరి వాక్యం వరకు చదువుతున్న కళ్ళను పెదాలను, హృదయాన్ని చివరి వాక్యం వరకు తీసుకెళ్లి చకితుల్ని చేయడం ఇతని అక్షరాలకున్న ఆకర్షణగా కనిపిస్తుంది. జాలర్లకు వేట నిషేధ సమయాన్ని నిషి ద్ధ రుతువుగా రికార్డు చేశారు. ''అలలపై వలలు నిషేధం/ శ్రమజీవుల కలల కబేళాలపై/ ఉదయకిరణాల అడుగుల నిషేధం/ సముద్ర ఉద్యాన వనమాలి జాలరి / అయినా జల పుష్పాల సేకరణ నిషేధం/ ఇది నిషిద్ధ రుతువు కాబోలు/ చిరునవ్వుల జాతరకి మూడు మాసాల నిషేధం/ ఈ మూడు మాసాలు ఉప్పునీటి కన్నీళ్ళ సంగమమే''
ఈ విధంగా సుబ్బారావు ఏ వస్తువు తీసుకున్నా ఏ సంఘటన తీసుకున్నా కవిత్వాన్ని నిర్లక్ష్యం చేయకుండా రాసుకుంటూ పోయారు. సాయి పల్లవి, సోనుసూద్ లాంటి కళాకారుల మీద జరిగిన దాడి గురించి ప్రశ్నించారు. పెగాసస్ ఉదంతాన్ని నిక్కచ్చిగా రాస్తూ ''చెట్టుకి రక్షణ లేదు/ పిట్టకు రక్షణ లేదు/ మట్టికి రక్షణ లేదు/ మనిషికి రక్షణ లేదు/ సాయిబాబాకి రక్షణ లేదు/ వరవరరావు కైనా తప్పలేదు/ రాజ్యం చేసిన పొరపాటును/ ప్రభువులే ఒప్పుకోవటం లేదు/ దేశ జనాభా గుట్టు మట్టులన్నీ/ పెగసిస్ గుప్పెట్లో బందీలయ్యాక / దేశ రక్షణకే విలువలేదు'' అంటూ రెక్కల గుర్రంతో చేసే రాజకీయ క్రీడను చూపారు.
ఇవాళ మనిషిని అనేక పాస్వర్డ్‌లతో కార్డులతో నంబర్లతో పోల్చుకుంటున్న వేళ సుబ్బారావు గారు దేవుని ఆధార్ కార్డు అడిగారు. ఈ కవిత్వంలో ఆవేశంతో పాటు వ్యంగ్యం కొత్త అందాన్ని తెచ్చిపెట్టింది. హనుమంతుడు ఎక్కడ పుట్టాడో అనే అంశంపై స్వామీజీల మధ్య చెలరేగిన వివాదాన్ని 'స్వామి ఒకటివ్వు' అనే శీర్షిక ద్వారా రాసిన సంపాదకీయ కవితతో సుబ్బారావు సమాధానం చెప్పారు. ఈ సంపాదకీయ కవిత్వాన్ని చదవడం ద్వారా మనం కొన్నిసార్లు నవ్వుకుంటాం కొందరిని తిట్టుకుంటాం. మనల్ని మెరుగుపరుచుకుంటాం. కొత్త ప్రశ్నలను కొన్ని సమాధానాలను వెతుక్కుంటాం. ఈ విశాల నయనం సంపాదకీయ కవిత్వాన్ని సాహిత్యకారులతోపాటు ప్రజలందరూ ఆదరించాలని ఆకాంక్షిస్తూ సుబ్బారావు గారికి అభినందనలు.
- డాక్టర్ సుంకర గోపాలయ్య