Mar 14,2023 14:54

ఇంటర్నెట్‌డెస్క్‌ : గర్భిణీల కాళ్లకు నీరు చేరడం చాలా సాధారణమైన విషయమేనని వైద్యులు అంటున్నారు. గర్భం దాల్చినప్పుడు.. మహిళల్లో హార్మోన్లలో మార్పులు సంభవించి నీరు చేరే అవకాశముంటుందని వైద్యులు చెబుతున్నారు. గర్భాశయంలో శిశువు పెరుగుతున్నప్పుడు ఆ బరువు మొత్తం కాళ్లమీద పడి నీరు చేరుతుంది. అలాగే గుండె నుంచి కాళ్లకు చేరే రక్తప్రవాహం కూడా నెమ్మదిగా ఉంటుంది. దీంతో రక్తనాళాల్లో ఒత్తిడి పెరిగి సిరల నుండి నీరు బయటకు వచ్చి పాదాల వాపుకు దారితీస్తుంది అని వైద్యులు అంటున్నారు.

- గర్భిణీ మహిళల్లో కాళ్లకు మాత్రమే నీరు చేరుతుంది. కొంతమందిలో ఈ వాపు ఉదయంపూట ఉండదు. రాత్రిపూట పడుకోవడం వల్ల ఈ కాళ్లవాపు ఉదయానికి తగ్గి.. మరలా సాయంత్రానికి వాపు కనిపించే అవకాశముంటుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఒక కాలిలోనే వాపు ఉండడం, గుండె కింద నొప్పిగా ఉండడం, వాంతులు అవ్వడం వంటివి జరిగితే కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి. తగిన చికిత్స తీసుకోవాలి.
- గర్భిణీ మహిళలు ఉప్పు ఎక్కువ తీసుకోకూడదు. ఆహార పదార్థాల్లో ఉప్పు తగ్గించి తీసుకుంటేనే మంచిదని వైద్యులు చెబుతున్నారు.
- బంగాళదుంపలు, అరటిపండ్లు, బీన్స్‌, ఆరింజ, దానిమ్మ, ఆకుకూరలు గర్భిణీలు క్రమం తప్పకుండా తీసుకోవాలి.
- భోజనం చేసిన తర్వాత కనీసం 10 నిమిషాలపాటు నడిస్తే మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు.