
లండన్ : చిన్నారుల్లో దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలు కనీసం రెండు నెలలపాటు కనిపించే అవకాశముందని విశ్వవిద్యాలయం ఆసుపత్రి పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది.
అలసట, దద్దుర్లు, కడుపు నొప్పి వంటివి వారిని వేధిస్తున్నాయి
డెన్మార్క్‌లో 2020 జనవరి నుంచి 2021 జులై మధ్య కరోనా సోకిన 11 వేల మంది పిల్లల ఆరోగ్య పరిస్థితిని.. మరోవైపు.. ఎన్నడూ కోవిడ్ సోకని 33 వేల మంది చిన్నారులతో పోల్చిచూడటం ద్వారా కోపెన్‌హాగెన్ విశ్వవిద్యాలయం ఆసుపత్రి పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఆ పిల్లలందరూ 14 ఏళ్లలోపువారే. అలసట, దద్దుర్లు, కడుపు నొప్పి వంటివి వారిని ఎక్కువగా వేధిస్తున్నట్లు అధ్యయనం నిర్థారించింది.
రెండు నెలలపాటు ఏదైనా అనారోగ్య లక్షణం..
దీర్ఘకాలిక కోవిడ్ నిర్వచనంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఒ) పేర్కొన్న 23 అనారోగ్య లక్షణాలు వారిలో ఎంతమేరకు ఉన్నాయో పరిశీలించారు. 0-3 ఏళ్ల వయసువారిలో 40 శాతం మంది, 4-11 ఏళ్ల వారిలో 38 శాతం మంది, 12-14 ఏళ్లవారిలో 41 శాతం మంది దీర్ఘకాలిక కోవిడ్‌తో ఇబ్బందిపడినట్లు నిర్థారించారు. వారిలో కనీసం ఏదైనా ఒక అనారోగ్య లక్షణం రెండు నెలల పాటు కొనసాగినట్లు పరిశోధకులు తెలిపారు.