
అంకారా : టర్కీలో సోమవారం సంభవించిన భూకంప తీవ్రతకి వేలాది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. భూకంప తీవ్రతకి 10 ప్రావిన్సులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ నేపథ్యంలో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ప్రభావితమైన 10 ప్రావిన్స్‌లలో మూడు నెలలపాటు ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'రాజ్యాంగంలోని ఆర్టికల్ 119 ప్రకారం పది ప్రావిన్స్‌లలో మూడునెలలపాటు అత్యవసర పరిస్థితిని విధించాలని మేము నిర్ణయించుకున్నాం. భూకంపం వల్ల శిథిలాల కింద ఉన్న మృతదేహాలను వెలికితీయడానికి రెస్క్యూ సిబ్బంది మరింత వేగంతో పనిచేస్తున్నారు' అని ఆయన అన్నారు. ఇప్పటివరకున్న తాజా సమాచారం ప్రకారం.. 5,895 మంది మృతి చెందారని, 34,810 మందికి గాయాలయ్యాయని.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని రెసెప్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
కాగా, టర్కీలో కహ్రమన్మరాస్, అదానా, అడియామాన్, ఉస్మానియే, హటే, కిలిస్, మలత్య, సాన్లియుర్ఫా, దియార్‌బాకిర్, గజియాంటెప్‌లు భూకంప ధాటికి అత్యంత ప్రభావితమైన ప్రావిన్స్‌లుగా ఉన్నాయి.