
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అధికారంలో వున్నపుడు దళితులను, గిరిజనులను పూర్తిగా విస్మరించిన టిడిపి ఇప్పుడు కపట ప్రేమను చూపుతోందని వైసిపి ఎంపి నందిగం సురేష్ విమర్శించారు. చిత్తశుద్ధి వుంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో దళితులకు ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం తాడేపల్లిలోని వైసిపి కేంద్రకార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సిఎస్టి సబ్‌ప్లాన్‌ను జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మరో పదేళ్ల పాటు పొడిగిస్తే స్వాగతించాల్సిందిపోయి విమర్శలకు దిగడం తగదన్నారు. టిడిపి హయాంలో సబ్‌ప్లాన్ నిధులను పొలం బడి, చంద్రన్న రైతు క్షేత్రాలు, మహిళలకు శానిటరి ప్యాడ్స్, సామాజిక పించన్లకు దారి మల్లించిందన్నారు. ఎన్టిఆర్ సుజల స్రవంతి, చంద్రన్న పెళ్లి కానుకలకు కూడా సబ్‌ప్లాన్ నిధులను వాడారని విమర్శించారు. దళితుల నిధులను దారి మళ్లించిన టిడిపికి తమ ప్రభుత్వంపై మాట్లాడే అర్హత లేదన్నారు.