Aug 07,2022 12:05

నల్లగా నిగనిగలాడే తాటిపండుని చూడగానే నోరూరకుండా ఉండదు. ఆ తాటిపండు గింజను చీకిన అనుభూతి ఓ బాల్యపు మధురజ్ఞాపకం. తాటిపండు గురించిగానీ, దాని పరిమళంగానీ, ఆ రుచిగానీ నేటి బాల్యానికి పెద్దగా తెలియకపోవచ్చు. పిజ్ఞాలు, బర్గర్‌లు తినే పిల్లలకు తాటిపండు ఫ్లేవర్‌ ఇష్టపడకపోవచ్చు.. కానీ తాటిపండు రిచ్‌ ఐరన్‌. దీనిలో క్యాల్షియం, విటమిన్స్‌, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి చెట్టు నుండి రాలిపడీ పడగానే తెచ్చుకోవాలి. ఒక్కరోజు ఆలస్యమైనా అవి పాడైపోతాయి. వీలైతే చెట్టు నుండి కోసుకుంటే ఇంకా మంచిది. ఈ తాటిపండుతో వెరైటీగా ఏమేం తయారుచేసుకోవచ్చో తెలుసుకుందాం.
గుజ్జు తీయడం ఇలా..
తాటిపండును నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత దానిని నేలపై కొంచెం గట్టిగా కొట్టాలి. అప్పుడు తాటిపండు మెత్తపడి, గుజ్జు తీయడం సులభమవుతుంది. నెమ్మదిగా తాటిపండు పైనున్న నలుపురంగులోని పీచు తీసేయాలి. అప్పుడు లోపల బంగారపు వర్ణంలో పీచుతో కూడిన తాటి టెంకలు ఉంటాయి. కొన్నింటిలో రెండుంటే, మరికొన్నింటిలో మూడు ఉంటాయి. వాటిని విడివిడిగా తీసి, ఒక్కో టెంకను తీసుకొని, కొబ్బరి తురిమే ప్లేటుపై రుద్ది, గుజ్జును తీయాలి.

ఇడ్లీ

tati


కావాల్సిన పదార్థాలు : తాటిపండు గుజ్జు- కప్పు, ఇడ్లీ రవ్వ - 2 కప్పులు, బెల్లం - కప్పు, ఉప్పు- రుచికి సరిపడా.
తయారీ విధానం : తాటిపండు గుజ్జులో ఇడ్లీ రవ్వ, బెల్లం, ఉప్పు వేసి బాగా కలిపి, గంటసేపు నానబెట్టాలి. ఈ మిశ్రమాన్ని ఇడ్లీప్లేట్లలో ఇడ్లీలు మాదిరిగా పెట్టి, ఉడికిన తర్వాత స్టౌపై నుంచి దించాలి. ఇవి చూడటానికి పసుపు వర్ణంలో కనువిందు చేస్తాయి. విభిన్న రుచిలో చాలా బాగుంటాయి.
గారెలు

gare


కావాల్సిన పదార్థాలు : తాటిపండు గుజ్జు- కప్పు, తురిమిన బెల్లం- అర కప్పు, మినపప్పు- కప్పు, బియ్యంపిండి- కొద్దిగా, ఉప్పు - కొద్దిగా.
తయారీ విధానం : మినపప్పును నాలుగు గంటలు నానబెట్టుకుని రుబ్బుకోవాలి. తాటిపండు గుజ్జును ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. అందులో బెల్లం వేసి కరిగే వరకూ తిప్పాలి. ఆ తర్వాత రుబ్బుకున్న మినపప్పుని, బియ్యంపిండిని, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఆ పిండిని గారెల్లాగా ఒత్తుకుని, నూనెలో తక్కువమంటలో వేయించాలి. అంతే తాటిపండు గారెలు రెడీ. ఇవీ రెండు రోజులు నిల్వ ఉంటాయి.
కేక్‌

cake


కావాల్సిన పదార్థాలు : తాటిపండు గుజ్జు - కప్పు, గోధుమపిండి- కప్పు (నిండుగా), కొబ్బరితురుము- ముప్పావు కప్పు, బెల్లం తురుము- ముప్పావు కప్పు, నెయ్యి- కప్పు.
తయారీ విధానం : ముందుగా ఒక బౌల్‌ తీసుకోవాలి. అందులో తాటిపండు గుజ్జు, గోధుమ పిండి, కొబ్బరి తురుము, బెల్లం తురుము వేసి, బాగా కలిసేలా కలపాలి. చివరిలో నెయ్యి పోయాలి. తర్వాత గంట నానబెట్టాలి. కేక్‌ గిన్నెకు కొద్దిగా నెయ్యి రాసి, ఈ మిశ్రమం పోసుకోవాలి. దీనిని కేక్‌ ఓవెన్‌లో పెట్టి, సన్నని సెగపై గంటసేపు స్టౌ మీద ఉంచాలి. కేక్‌ రెడీ అయ్యిందీ లేనిదీ తెలుసుకోవాలంటే టూత్‌పిక్‌తో గుచ్చి చూడాలి. దానికి పిండి అంటుకోకపోతే కేక్‌ రెడీ అయినట్లు. ఒక ప్లేట్‌లోకి కేక్‌ బౌల్‌ను తిప్పిపెడితే తయారైన కేక్‌ ప్లేట్‌లోకి వస్తుంది. కొద్దిగా చల్లారాక ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఈ కేక్‌ వారం రోజుల వరకూ నిల్వ ఉంటుంది.
బూరెలు

bure


కావాల్సిన పదార్థాలు : తాటిపండు గుజ్జు- కప్పు, తురిమిన బెల్లం- అరకప్పు, ఎండు కొబ్బరిపొడి- 2 స్పూన్లు, బియ్యం పిండి- ముప్పావు కప్పు.
తయారీ విధానం : తాటిపండు గుజ్జును ఒక బౌల్‌లోకి తీసుకొని, అందులో బెల్లం వేయాలి. అది బాగా కరిగాక ఎండుకొబ్బరి తురుము, బియ్యంపిండి కొద్దికొద్దిగా వేస్తూ బాగా కలిసేలా కలపాలి. పిండి మరీ పలుచగా, గట్టిగా ఉండకుండా చూసుకోవాలి. ఆ పిండిని బూరెల్లాగే చేసుకుని, నూనెలో తక్కువ మంటమీద ఎక్కువసేపు వేయించాలి. ఇవి వారం వరకూ పాడవకుండా ఉంటాయి.