
- పదవీ విరమణ చేసే వారికి అవకాశం
న్యూఢిల్లీ : ఉద్యోగస్తుల పదవీ విరమణ సమయంలో వచ్చే మొత్తంపై కేంద్రం పన్ను మినహాయింపు పరిమితిని పెంచింది. పదవీ విరమణ సమయంలో ఉద్యోగులు పొందే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ ప్రయోజనాల కోసం పన్ను మినహాయింపు పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి సంజరు మల్హోత్రా గురువారం వెల్లడించారు. ఇంతక్రితం ఈ పరిమితి రూ.3 లక్షల వరకు మాత్రమే ఉంది. పన్ను మినహాయింపు పెంపు పరిమితి నిర్ణయం 2023 ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వచ్చిందని రెవెన్యూ శాఖ తెలిపింది. రిటైర్‌మెంట్ సమయంలో వేతన జీవులు పొందే మొత్తంలో రూ.25 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇస్తామని 2023ా24 కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. తాజా నిర్ణయంతో 33 ఏళ్ల పాటు పని చేసే ఉద్యోగులకు ప్రతీ ఏడాది సగటున రూ.20వేలు చొప్పున పన్ను ఆదా కానుందని మల్హోత్రా పేర్కొన్నారు.