Jun 21,2022 10:19

గువాహటి (అస్సాం) : ఉదయం లేవగానే టీ తాగే అలవాటున్నవాళ్లు చాలామంది ఉంటారు. సాధారణంగా టీ రేటు రూ.10, లేదా రూ.20 ఉంటుంది. అదే పెద్ద రెస్టారెంట్లలోనైతే ఎక్కువ రేటే ఉంటుంది. ఇళ్లలో వాడుకునే టీ పొడి కెజి సుమారు రూ.300 ఉంటుంది కానీ ఓ టీ పొడి ఏకంగా లక్ష రూపాయలకు అమ్ముడుపోయింది..! ఈ టీ కి అంత డిమాండ్‌ ఉందిమరి..!

                                             ఏకంగా కిలో రూ.లక్షకు కొన్న ' ఎసా టీ ' సంస్థ

అస్సాంలో లభించే అరుదైన టీ రకాల్లో ఒకటైన 'పభోజన్‌ గోల్డ్‌ టీ'కి భారీ రేటు పలికింది. గత సోమవారం జోర్హాట్‌లో నిర్వహించిన వేలంలో ఏకంగా కిలో రూ.లక్షకు ఈ టీ అమ్ముడుపోయింది. పభోజన్‌ ఆర్గానిక్‌ టీ ఎస్టేట్‌ నుంచి అస్సాంకు చెందిన టీ బ్రాండ్‌ 'ఎసా టీ' దీన్ని కొనుగోలు చేసింది. ఈ ఏడాదిలో ఇదే అత్యధిక ధరగా చెబుతున్నారు. అస్సాం గోలఘాట్‌ జిల్లాలో ఈ అరుదైన సేంద్రియ టీ ఉత్పత్తి అవుతుంది. ఈ టీ ప్రత్యేక రుచి, దీని విలువను ఇష్టపడే కొనుగోలుదార్లు అంతర్జాతీయంగా ఉన్నారని సంస్థ పేర్కొంది. ఈ టీ ప్రత్యేక రుచికి రూ.లక్షనిచ్చి ఇష్టపడి కొనుగోలు చేశారంటే విశేషమేమరి..!