
ముంబయి : మహారాష్ట్ర అసెంబ్లీలో సోమవారం మెజార్టీని నిరూపించుకోవడానికి సిద్ధమౌతున్న ఏక్నాథ్ షిండే శిబిరం.. అసెంబ్లీ స్పీకర్ ఎన్నికల్లో విజయం సాధించింది. మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ను ఎన్నుకునేందుకు ఓటింగ్ ప్రక్రియ నిర్వహించగా.. అధికార కూటమిలోని బిజెపి శాసన సభ్యుడు రాహుల్ నర్వేకర్ మెజార్టీ మార్కును సులభంగా సాధించారు. ఉద్ధవ్ బృందంలోని శివసేన ఎమ్మెల్యేపై రాజన్ సాల్వీపై సునాయాసంగా గెలిచారు. దీంతో సోమవారం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏక్నాథ్ విజయం నల్లేరుపై నడకలా కనిపిస్తోంది. అంతకుముందు స్పీకర్ అభ్యర్థులకు ఓటు వేయాలని ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన వర్గం, ఏక్నాధ్ నేతృత్వంలోని వర్గం విప్లు జారీ చేశాయి. ఫిబ్రవరి 2021లో కాంగ్రెస్కు చెందిన నానా పటోల్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా రాజీనామా చేసిన నాటి నుండి స్పీకర్ పదవి ఖాళీగా ఉంది. డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ తాత్కాలిక స్పీకర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభానికి తెర దించేందుకు అసెంబ్లీ స్పీకర్ పాత్ర కీలకం అయినందున ఈ ఎన్నిక అనివార్యమైంది.