Aug 04,2022 22:30

హైజంప్‌లో భారత్‌కు తొలి పతకం
బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు మరో పతకం దక్కింది. హైజంప్‌లో తేజశ్విన్‌ శంకర్‌ కాంస్య పతకం సాధించాడు. దీంతో హైజంప్‌ విభాగంలో దేశానికి పతకం అందించిన తొలి అథ్లెట్‌గా తేజశ్విన్‌ రికార్డుల్లో నిలిచాడు. బుధవారం రాత్రి జరిగిన హైజంప్‌ ఫైనల్లో శంకర్‌ 2.22మీటర్ల ఎత్తు ఎగిరి మూడో స్థానంలో నిలిచాడు. హమీష్‌ కెర్‌(న్యూజిలాండ్‌) 2.25మీటర్ల జంప్‌చేసి తొలిస్థానంలో నిలవగా.. బ్రండన్‌ స్టార్క్‌(ఆస్ట్రేలియా) 2.23మీటర్లు రజత పతకం సాధించారు. తేజశ్విన్‌ కెరీర్‌బెస్ట్‌ 2.27మీటర్ల దూరం జంప్‌ చేస్తే స్వర్ణ పతకం దక్కేది. అయినా హైజంప్‌లో దేశానికి తొలిపతకం అందించిన ప్లేయర్‌గా నిలిచాడు. కాంస్య పతకం సాధించిన శంకర్‌ను కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అభినందించాడు. కామన్వెల్త్‌ క్రీడల్లో హైజంప్‌ విభాగంలో పతకం సాధించిన మొదటి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడని ప్రశంసించారు.
బాక్సింగ్‌ విభాగంలో భారత్‌కు మూడు పతకాలు ఖాయమయ్యాయి. గురువారం జరిగిన క్వార్టర్‌ఫైనల్‌ పోటీల్లో అమిత్‌ పంగల్‌, జాస్మినే లంబోరి, సాగర్‌ అహల్వాత్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. 92కిలోల సూపర్‌ హెవీవెయిట్‌ విభాగంలో సాగర్‌ అహల్వాత్‌ 5-0తో కెండీ ఇవాన్స్‌ను ఓడించాడు.

మహిళల క్రికెట్‌ సెమీస్‌కు హర్మన్‌ప్రీత్‌ సేన

మహిళా క్రికెట్‌ సెమీఫైనల్లోని భారత్‌ ప్రవేశించింది. బుధవారం రాత్రి బార్డొడాస్‌తో జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 100పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన హర్మన్‌ప్రీత్‌ సేనకు ఆదిలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ స్మృతి మంధాన(5), కెప్టెన్‌ కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌(0), తానియా(6) నిరాశపరిచినా.. మరో ఓపెనర్‌ షషాలీ వర్మ(43), రోడ్రిగ్స్‌(56 నాటౌట్‌)తో కలిసి జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లింది. చివర్లో దీప్తి శర్మ(31నాటౌట్‌) కూడా రాణించడంతో భారత్‌ నిర్ణీత 20ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అనంతరం రేణుకా సింగ్‌(4/10) విజృంభణతో బార్బడోస్‌ జట్టు నిర్ణీత 20ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 62 పరుగులే చేయగల్గింది. ఈ విజయంతో భారత్‌ గ్రూప్‌-ఏలో రెండోస్థానంలో నిలవగా సెమీస్‌కు అర్హత సాధించగా.. ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలిచి ఇప్పటికే సెమీఫైనల్లోకి ప్రవేశించింది.

​
సింధు, శ్రీకాంత్‌

ప్రి క్వార్టర్స్‌కు సింధు, శ్రీకాంత్‌
బ్యాడ్మింట్‌ సింగిల్స్‌ విభాగంలో పివి సింధు, కిదాంబి శ్రీకాంత్‌ ప్రి క్వార్టర్స్‌కు చేరుకున్నారు. గురువారం జరిగిన మహిళల రెండోరౌండ్‌ పోటీలో సింధు 21-4, 21-11 తేడాతో ఫాతిమా(మాల్దీవ్స్‌)పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ కేవలం 21 నిమిషాల్లోనే ముగిసింది. ఇక పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ 21-9, 21-9 తేడాతో డేనియల్‌ వానాగలియా(ఉగాండా)ను ఓడించాడు.

​       హర్మన్‌ప్రీత్‌ సేన  ​                                                                                    
           హర్మన్‌ప్రీత్‌ సేన  ​

హర్మన్‌ప్రీత్‌ హ్యాట్రిక్‌
పురుషుల హాకీజట్టు ఆఖరి లీగ్‌మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. గురువారం జరిగిన గ్రూప్‌-బి చివరి లీగ్‌ మ్యాచ్‌లో 4-1గోల్స్‌ తేడాతో వేల్స్‌ను ఓడించింది. హర్మన్‌ప్రీత్‌ హ్యాట్రిక్‌ గోల్స్‌ కొట్టాడు. ఈ గెలుపులో భారత్‌ గ్రూప్‌ాబిలో అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్లోకి చేరింది.