
హైదరాబాద్ : తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. నిజానికి ఫలితాలు ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇంటర్, టెన్త్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో అధికారులు టెట్ ఫలితాలను కూడా విడుదల చేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ tstet.cgg.gov.in లో చెక్ చేసుకోవచ్చు.
రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పేపర్-1కు 3,18,506 (90.62 శాతం), పేపర్-2 కు 2,51,070 (90.35 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. టెట్ పేపర్-1లో 32.68 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, పేపర్-2 లో 49.64 శాతం మంది ఉత్తీర్ణత పొందారు. టెట్ పేపర్ -1లో 1,04,078 మంది అభ్యర్థులు, పేపర్-2లో 1,24,535 అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు.