
సెప్టెంబరు 15, 16 తేదీలలో దుబారులో జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) - 2023లో తెలుగు సినిమాలు మరోసారి విజయకేతనం ఎగురవేశాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయనటి తదితర విభాగాల్లో గతేడాది విడుదలైన తెలుగు చిత్రాలు దక్కించుకున్నాయి.
నేను కిందపడ్డ ప్రతిసారీ పైకి లేపారు

'నా ఒడుదొడుకుల్లో అభిమానులు తోడున్నారు. నేను కిందపడ్డ ప్రతిసారీ నన్ను పైకి లేపారు. నా ప్రతి కన్నీటి చుక్కకు వాళ్లు కూడా బాధపడ్డారు. నేను నవ్వినప్పుడల్లా సంతోషపడ్డారు. నన్ను అభిమానించే అందరికీ తలవంచి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే నాపై నమ్మకంతో కొమురం భీమ్ లాంటి గొప్ప పాత్రను ఇచ్చినందుకు రాజమౌళికి ధన్యవాదాలు. ఇక నా సహనటుడు నా సోదరుడు, స్నేహితుడు చరణ్‌కు కూడా ఈ సందర్భంగా థ్యాంక్యూ చెబుతున్నాను' అంటూ ఈ వేడుకల్లో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న ఎన్‌టిఆర్ భావోద్వేగభరితంగా మాట్లాడారు.

సీతారామం : ఉత్తమ చిత్రం'గా ఎంపికైన 'సీతారామం' చిత్రం ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై ఫ్యామిలీ ఆడియెన్స్ విశేషంగా ఆదరించింది. విడుదలైనప్పటి నుండి ఇప్పటివరకు ఈ సినిమా సినీరంగంలో అత్యున్నత పురస్కారాలను సొంతం చేసుకుంది. 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డుతో పాటు ఇటీవలె 'ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్' అవార్డును కూడా అందుకుంది. హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ చిత్రం రూ. 90 కోట్ల టర్నోవర్‌ను సాధించి వరుస అపజయాలతో కుదేలైన తెలుగు ఇండిస్టీని గొప్ప ఊరటనిచ్చిందని అప్పట్లో వార్తా కథనాలు కూడా వచ్చాయి.
మృణాల్ ఠాకూర్ : సీతారామంలో నటించిన మృణాల్‌కి క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటి అవార్డు దక్కింది. అలాగే ఉత్తమ నూతన నటిగా కూడా ఆమెను ఎంపికచేశారు.

శ్రీలీల : ఉత్తమ నటిగా 'ధమాకా' చిత్రానికి శ్రీలీలకు సైమా అవార్డు దక్కింది. 'పెళ్లిసందడి-2' చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమైన శ్రీలీల రెండో చిత్రమే రవితేజ లాంటి సీనియర్ హీరోతో చేసింది. కన్నడ చిత్రసీమలో తొలి అడుగులు వేసిన ఆమె ప్రస్తుతం వరుస తెలుగు సినిమాలలో నటిస్తున్నారు. వైద్యవిద్య అభ్యసించిన శ్రీలీల, గతేడాది ఇద్దరు వికలాంగ పిల్లలను దత్తత తీసుకుని తన ఔదార్యం చాటుకున్నారు. విద్యావంతురాలైన శ్రీలీల సేవాగుణంలో, నటనలో తనకంటూ ప్రత్యేకముద్ర వేసుకుంటున్నారు.
ఆర్‌ఆర్‌ఆర్ : ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ వేడుకల్లో ఆస్కార్‌తో సహా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న ఈ చిత్రం సైమాలో కూడా రికార్డులు బ్రేక్ చేసింది. 11 నామినేషన్లలో చోటు దక్కించుకుని 5 అవార్డులు సొంతం చేసుకుంది.
ఈ చిత్రంలో కొమురం భీం పాత్రలో నటించిన ఎన్‌టిఆర్‌కు సైమా ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గేయ రచయిత, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ అవార్డులు ఈ చిత్రానికి లభించాయి.

సైమా విజేతలు
ఉత్తమ చిత్రం : సీతా రామం
ఉత్తమ దర్శకుడు : ఎస్‌ఎస్ రాజమౌళి (ఆర్‌ఆర్‌ఆర్)
ఉత్తమ నటుడు : జూనియర్ ఎన్టీఆర్ (ఆర్‌ఆర్‌ఆర్)
ఉత్తమ నటి : శ్రీలీల (ధమాకా)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) : అడివి శేష్ (మేజర్)
ఉత్తమ నటి (క్రిటిక్స్) : మృణాల్ ఠాకూర్ (సీతా రామం)
ఉత్తమ సహాయ నటుడు : రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్)
ఉత్తమ సహాయ నటి : సంగీత(మసూద)
ఉత్తమ నూతన నటి : మృణాల్ ఠాకూర్ (సీతా రామం)
ఉత్తమ సంగీత దర్శకుడు: ఎంఎం కీరవాణి(ఆర్‌ఆర్‌ఆర్)
ఉత్తమ గేయ రచయిత : 'నాటు నాటు' పాట కోసం: చంద్రబోస్ (ఆర్‌ఆర్‌ఆర్)
ఉత్తమ గాయకుడు : మిర్యాల రామ్ (డిజె టిల్లు) టైటిల్ సాంగ్
ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్: సింగర్ మంగ్లీ (ధమాకా) 'జింతక్' పాట
ఉత్తమ విలన్ : సుహాస్ (హిట్ - 2)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : సెంథిల్ కుమార్ (ఆర్‌ఆర్‌ఆర్)
ఉత్తమ నూతన దర్శకుడు : మల్లిడి వశిష్ట (బింబిసార)
సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్ : నిఖిల్ సిద్ధార్థ (కార్తికేయ 2)
ఉత్తమ హాస్యనటుడు : శ్రీనివాస రెడ్డి (కార్తికేయ 2)
ఉత్తమ నూతన నిర్మాతలు : శరత్, అనురాగ్ (మేజర్)
ఫ్లిప్‌కార్ట్ ఫ్యాషన్ యూత్ ఐకాన్ :శృతి హాసన్ తదితరులు ఉత్తమ క్యాటగిరిలో అవార్డులను అందుకున్నారు.