Aug 08,2022 07:28

న దేశానికి వ్యాపార నెపంతో వచ్చి, దేశ పాలనను చేజిక్కించుకున్న కుతంత్ర రాజకీయానికి ప్రత్యక్ష వారసులు ఆంగ్లేయులు. వారి హయాంలో భారతీయులు స్వేచ్ఛను కోల్పోయి, బానిసలుగా జీవనం గడిపారు. అటువంటి తెల్లదొరల దోపిడీని, దౌర్జన్యాలను దుయ్యబడుతూ ఎందరో తెలుగు కవులు అక్షరాలను అస్త్రాలుగా ప్రయోగించారు. పాటలతో, గేయాలతో కదనరంగం సృష్టించారు.
     1885వ సంవత్సరంలో జాతీయ కాంగ్రెస్‌ స్థాపించబడింది. అదే సంవత్సరం ప్రథమ గోదావరి మండల సభ కాకినాడలో ఏర్పాటు చేశారు. ఆ సభకి న్యాపతి సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఆంధ్ర బీష్ముడుగా ఆయన ఖ్యాతిగాంచారు. అంతర్జాతీయ ఖ్యాతినొందిన 'హిందు' పత్రికను ఆనాడు స్థాపించారు. వారి అధ్యక్షతన జరిగిన తొలి సభకు చిలకమర్తి లక్ష్మీనరసింహం కూడా హాజరయ్యారు. ఆనాటి ఆంగ్లేయుల పాలనా విధానాన్ని దయ్యబడుతూ చక్కని పద్యాలు ఆ వేదికపై చదివారాయన. మచ్చుకి ఒకటి..

నేల దున్నుదుమన్న జాల తరము పన్ను
నీరు గావలెనన్న నీటి పన్ను
వాణిజ్య మొనరింపవచ్చు రాబడికి పన్ను
సరకులమ్ముదమన్న సంత పన్ను
కర్రలమ్ముదమన్న గలపకింకొక పన్ను
పట్టణంబుల మున్సిపాలు పన్ను
పారిపోవుదమన్న బండి హాసీల్‌ పన్ను
కొంపమ్ము కొన్నచో స్టాంపు పన్ను
ఉన్నమట్టుకు తినకుండ నుప్పు పన్ను
ననెడి పన్నులె దిగదీసి జనులనెల్ల
కటకటా! ఎట్టులున్నదో కాపుల దశ
సుగుణ ధనులార! జనులార చూడరయ్యా!

ఆంగ్లేయుల పాలనలో పన్నుల పేర జరుగుతున్న దోపిడీని నిష్కర్షగా ఆనాడు వేదిక మీద చెప్పారు చిలకమర్తి వారు. కాని, ఇప్పటి దేశ పరిస్థితి అప్పటి కంటె దారుణంగా ఉంది. ఇప్పుడు పన్ను బారినుంచి తప్పించుకున్న వస్తువు లేదేమో! పన్నుల పేర ప్రభుత్వాలు ప్రజలను ఎంతగా, ఎన్ని రకాలుగా దోపిడీ చేస్తున్నాయో మనమెరుగుదుం. చిలకమర్తి వారి పద్యాన్ని న్యాపతి సుబ్బారావు గారు గురజాడ అప్పారావు గారికి పంపి, ఇంగ్లీషులోకి తర్జుమా చేయించారు.
     1906, 1907 ప్రాంతంలో బిపిన్‌ చంద్రపాల్‌ దేశమంతటా పర్యటించి, వారి ఉపన్యాసాలతో ప్రజలను స్వాతంత్య్రోద్యమం పట్ల ఉత్తేజితులను చేశారు. అందులో భాగంగా 1906లో బిపిన్‌ చంద్రపాల్‌ కాకినాడ, రాజమండ్రిలో పర్యటించారు. రాజమండ్రికి వచ్చిన సందర్భంలో వారి ఆంగ్ల ఉపన్యాసాన్ని ఆంధ్రీకరించే బాధ్యతను చిలకమర్తి వారు స్వీకరించారు. కిక్కిరిసిన ప్రేక్షకులున్న సభలో బిపిన్‌ చంద్రపాల్‌ గారి ఉపన్యాసమంతా జాగ్రత్తగా విని, మనసులో ధారణ చేసుకుని, తెలుగులో తర్జుమా చేసి చెప్పారు. అనంతరం బ్రిటిషు వారి పాలనా వైఖరిని విమర్శిస్తూ సూటిగా ప్రజల హృదయాల్లోకి చొచ్చుకుపోయే విధంగా చక్కని పద్యమొకటి చిలకమర్తి వారు చెప్పారు.

''భరత ఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై యేడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియగట్టి''

ఆ పద్యం విని ఆనందోత్తేజంతో ప్రజలు చప్పట్ల వర్షం కురిపించారు. ఊరూరా పాడుకొని చర్చించుకొని పరాయి పాలకుల దౌర్జన్యాలపై కోపం పెంచుకున్నారు.
చిలకమర్తి పద్యం కూడా నేటి పరిస్థితికి అద్దం పడుతుంది. హిందువులు అంటే దేశ ప్రజలు; తెల్లవారంటే పాలకులు; పితకడం అంటే దోపిడీయే కదా! నేటి పరిపాలనకి కూడా ఈ పద్యం చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది.
గౌతమీ కోకిలగా పిలవబడే జాతీయ తెలుగు కవి వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు కూడా వారి కవిత్వం ద్వారా దేశభక్తిని ప్రకటించారు. వీరి రచనల్లో దేశభక్తిని ప్రేరేపించే కవితా ఖండికలెన్నో కనిపిస్తాయి. 'రాణా ప్రతాప్‌ సింగ్‌' నాటకం దేశభక్తికి మారుపేరు. అందులోని ఒక అంశాన్ని తీసుకుని, 'జయగీతి' కవితా ఖండికగా 'దీపావళి' కావ్యంలో ప్రకటించారు. చూడండి..

''తృణము తృణమున శాంతి విరిసెను
దిక్కు దిక్కుల కాంతి మెరిసెను
దేవళమ్ముల మెరిసె జయ
ఘంటాది తానమ్ము
అదే త్రివర్ణ ధ్వజ పటాంచల
ముద పవనోచ్చలితమయ్యెను
వదిలె జయశంఖారావమ్ముల
నిదురమైకమ్ము
వీరశౌర్యము, సతుల తేజము
పేదభక్తియు, సాధు దీక్షయు
వృద్ధా పౌరుష మొక్క నూత్నా
వేశమున వెలుగన్‌''

స్వాతంత్య్రోద్యమం పట్ల ప్రజలను ఆకర్షించేందుకు ఇటువంటి కవితాఖండికలు అవసరమయ్యాయి. 1919లో జలియన్‌ వాలాబాగ్‌లో జరిగిన అమానుషమైన కాల్పులు, డయ్యర్‌ దురంతానికి ప్రతీకగా 'కాగడా'యను గీత రచన చేసినట్లు డా|| పంపన సూర్యనారాయణ, వారి సిద్ధాంత గ్రంథంలో పేర్కొన్నారు.

''వెలిగించు కాగడా వెలిగించవోయి
ప్రళయ రుద్రుని పాలభాగమ్మునందు
అతని నిశాత శూలాగ్రమ్మునందు
అతని నేత్ర గోళాంతమ్ములందు
జ్వలించు శిఖశిఖ జ్వాలనమ్ము తోడు
వేడిగా, వాడిగా వెరపుగొల్పేదిగా
వెలిగించు కాగడా వెలిగించవోయి''

ప్రళయ రుద్రుడంటే మహేశ్వరుడు. ఈశ్వరుడి ఫాలభాగం వేడినీ, శూలాగ్రం వాడినీ, నేత్రాలు ఎరుపునీ కలిగి ఉంటాయి. అందువల్ల ఈ మూడు లక్షణాలను తీసుకుని ప్రజలను ఉత్తేజపరిచే విధంగా రాశారు. వేదుల వారి కావ్యాల్లో 'ముక్తఝరి' మరొకటి. ఇందులో అనేక కవితా ఖండికలు దేశభక్తిని ప్రేరేపిస్తాయి.
స్వాతంత్య్రోద్యమ సమయంలో గుర్తుకువచ్చే మరొక కవి గరిమెళ్ళ సత్యనారాయణ. 'ఎల్‌.టి.' విద్యనభ్యసించేందుకు రాజమండ్రి వచ్చి, బ్రిటిష్‌ వారి పాలనా విధానాలకు వ్యతిరేకంగా అనేక పాటలు రాసి, స్వయంగా పాడుతూ ప్రజలను ఉత్తేజితులను చేశారు. అదే క్రమంలో అరెస్టయి, కారాగార శిక్ష అనుభవించిన కవి.

''మాకొద్దీ తెల్లదొరతనము దేవ
మాకొద్దీ తెల్లదొరతనము
మా ప్రాణాలపై పొంచి
మా మానాలు హరించే

మాకొద్దీ తెల్లదొరతనము దేవ'' అని ఆయన రాసిన పాట ప్రజలను ఉర్రూతలూగించింది. ఆ పాట ఊరూరా ప్రజల నోట ప్రభంజనమై సాగింది. ఇది పాటకి పల్లవి మాత్రమే. 39 చరణాల్లో ఆంగ్లేయుల దుశ్చర్యల్ని ఎండగడుతూ రాజమండ్రి పురవీధుల్లో స్వేచ్ఛా విహారం చేసిన ధైర్యశాలి గరిమెళ్ల. వడ్డాది సీతారామాంజనేయులు కవి రచించిన దండాలు దండాలు భారత మాత గేయం ఎంతో ప్రాచుర్యం పొందింది. ఆ పాట ఆంగ్లేయుల పాలనను విశదపరుస్తుంది.

''దండాలు దండాలు భారతమాత
నీవందుకోని దీవించు భారతమాత
నీవందుకోని దీవించు భారతమాత
దండాలు దండాలు భారత మాత
మా కొంపల్ని కూల్చినారే భారతమాత''
భావ కవితావనంలో వికసించిన కృష్ణశాస్త్రి రచనల్లో కూడా దేశభక్తి ప్రవహించింది.

''జయ జయ జయ ప్రియభారతి
జనయిత్రీ దివ్యధాత్రి !
జయ జయ జయ శత సహస్ర
నరనారీ హృదయ నేత్రి!'' అంటూ ఆయన రాసిన గీతం ఎంతో ప్రసిద్ధి చెందింది..

'' స్వాతంత్య్ర రథం! స్వాతంత్య్ర రథం!
అదిగదిగో అదే అదే అదే
స్వాతంత్య్ర రథం ! స్వాతంత్య్ర రథం !
శీత ధరాధర నేత్వంతర నర
నారులతో స్వాతంత్య్ర రథం
.. .. .. ..
గతహత సాక్షులు గళవిగళద్రుధి
ఠాంకముతో స్వాతంత్య్ర రథం
శత శత మానవ మాంసల భుజ ధృత
పాశముతో స్వాతంత్య్ర రథం'' గేయం కూడా

ఆయన కలం నుంచే జాలువారింది.
ఇటువంటి నేపథ్యంలోనే డా|| పి. తిరుమలరావు 'నేను స్వాతంత్య్ర సమరయోధుడను' అని గర్వంగా ప్రకటించుకున్న సందర్భం కూడా లేకపోలేదు.
''నేను స్వాతంత్య్ర సమరయోధుణ్ణి
నాటికీ నేటికీ సమిథలా
యజ్ఞంలా ఆహుతి అయ్యే
ఆలోచనలో వున్న వాణ్ణి
.. .. .. ..''
స్వాతంత్య్ర సిద్ధికోసం, తెలుగు వెలుగు కోసం నిరంతరం తపించిన తెలుగు కవులెందరో ఉన్నారు. అందరినీ విశ్లేషించటం సాధ్యం కాదు గనుక, విశ్లేషిస్తే ఒక గ్రంథమే అవుతుంది గనుక, చివరిగా 'జంపన' గారి 'ఆంధ్రజ్వాల' అనే కావ్యంలోని 'ప్రబోధము' కవితా ఖండిక వారి హృదయార్తిని వెల్లడి చేస్తుంది.
''నేను తెలుగు వాడను; తల్లి నేల కొరకు
రాల్చు కన్నీళ్ళె రత్నాల రాసులగును
నేను తెలుగువీరుడు; తల్లి నేల కొరకు
కార్చు రుధిరమ్మె స్వాతంత్య్ర సుధల నొసగు'' అంటారు.
ఇంకా శ్రీపాద, నాళం కృష్ణారావు, సోమసుందర్‌, కోటితలపూడి సీతమ్మ మున్నగు వారెందరో ఈ రహదారిలో నడిచి, దేవభక్తనెడి మొక్కలు నాటారు. స్వాతంత్య్రోద్యమంలో కవుల పాత్ర మరువరానిది. వారి అక్షరాలు జ్వాలా చిత్రాలై ప్రకాశిస్తాయి.
 

- ఎస్‌ఆర్‌ పృధ్వి
99892 23245