May 27,2023 08:03

కౌలుదార్ల రక్షణ పేరుతో ప్రభుత్వాలు ప్రకటిస్తున్న ఏ ఒక్క పథకం వీరిని ఆదుకోవడంలేదు. అందువల్ల సొంత భూమి కలిగిన రైతుల సేద్యం ఖర్చుల కంటే కౌలు రైతుల ఖర్చులు దాదాపు రెట్టింపు అవుతున్నాయి. దీనితో కౌలుదార్లు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. తమకున్న కొద్దిపాటి భూమిని కూడా కోల్పోయి భూమి లేని నిరుపేదల్లో కలుస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యల్లో అత్యధికం కౌలు రైతులవే. ఈ వాస్తవ పరిస్థితులు ప్రభుత్వాలకు, పాలకులకు తెలియనివి కావు. అయినా కౌలు రైతులను వారు సరైన పద్ధతుల్లో ఆదుకోకపోవడం వెనుక పాలక వర్గాల సామాజిక, రాజకీయ ప్రయోజనాలు వున్నాయి.

         రాష్ట్రం మొత్తం సాగుభూమిలో సుమారు 49 నుండి 53 శాతం భూమిని కౌలు రైతులు సాగుచేస్తున్నారు. ఇందులో అత్యధికమంది సామాజికంగా వెనుకబడిన కులాలకు చెందిన భూమి లేని నిరుపేదలు. నకిలీ విత్తనాలు, ప్రకృతి వైపరీత్యాలు, పంటలకు గిట్టుబాటు ధరలు, పెట్టుబడి ఖర్చులు, రుణ సదుపాయం, మార్కెటింగ్‌ సమస్యల్లాంటి వాటికి అదనంగా నగదు కౌలు చెల్లించాల్సి రావడం కౌలుదార్లు ఎదుర్కొంటున్న అదనపు సమస్య. పంటల రకాలను, నేల స్వభావాన్ని బట్టి కౌలు రేట్లు వుంటున్నాయి. ప్రభుత్వాల ద్వారా రైతులకు అందుతున్న పంట రుణాలు, విత్తనాలు, ఎరువుల సబ్సిడీలు, రైతు బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంట నష్టపరిహారం, రైతు భరోసా....వంటి ఏ సహాయం వీరికి అందడంలేదు. ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారుల దగ్గర అధిక వడ్డీకి అప్పులు చేసి సాగు చేయాల్సిన పరిస్థితి వీరిది. కౌలుదార్ల రక్షణ పేరుతో ప్రభుత్వాలు ప్రకటిస్తున్న ఏ ఒక్క పథకం వీరిని ఆదుకోవడంలేదు. అందువల్ల సొంత భూమి కలిగిన రైతుల సేద్యం ఖర్చుల కంటే కౌలు రైతుల ఖర్చులు దాదాపు రెట్టింపు అవుతున్నాయి. దీనితో కౌలుదార్లు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. తమకున్న కొద్దిపాటి భూమిని కూడా కోల్పోయి భూమి లేని నిరుపేదల్లో కలుస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యల్లో అత్యధికం కౌలు రైతులవే. ఈ వాస్తవ పరిస్థితులు ప్రభుత్వాలకు, పాలకులకు తెలియనివి కావు. అయినా కౌలు రైతులను వారు సరైన పద్ధతుల్లో ఆదుకోకపోవడం వెనుక పాలక వర్గాల సామాజిక, రాజకీయ ప్రయోజనాలు వున్నాయి.
 

                                                             గుర్తింపునకు నోచుకోని కౌలు రైతులు

రాష్ట్రంలో ఎంతమంది కౌలు రైతులు ఉన్నారో ప్రభుత్వం దగ్గర ఖచ్చితమైన లెక్కలు లేవు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వాలంటీర్‌ వ్యవస్థ వాటి ద్వారా పరిపాలన వ్యవస్థను గ్రామ కేంద్రంగా మార్చామని గొప్పలు చెప్పుకుంటున్న పాలకులకు కౌలు రైతులను గుర్తించడం పెద్ద కష్టమా? కౌలు రైతులను గుర్తిస్తే వారికి గుర్తింపు కార్డులు అందుతాయి. తద్వారా పంట రుణాలు, ఇన్‌పుట్‌ సబ్సిడీలు, పంట నష్టపరిహారాలు, రైతు భరోసా సహాయాలు అందే అవకాశాలు వుంటాయి. రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలు రైతులు వున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు ఆరు లక్షల మంది వుండగా, మొత్తం కౌలుదార్లలో కోస్తా జిల్లాల్లోనే సుమారు 78 శాతం మంది వున్నారు. పూర్తిగా వర్షం మీద ఆధారపడిన రాయలసీమ జిల్లాలో కూడా కౌలు రైతులు పెరుగుతున్నారు. రైతు స్వరాజ్య వేదిక అంచనా ప్రకారం రాష్ట్రంలో కౌలు సాగుచేస్తున్న వారిలో 50 శాతం మంది భూమి లేని నిరుపేదలు కాగా, ఎకరం లోపు స్వంత భూమి వున్నవారు 35 శాతం మంది. అంటే మొత్తం కౌలురైతుల్లో 85 శాతం మంది నిరుపేదలు. వీరిలో 89 శాతం మంది బిసి, ఎస్సీ కుటుంబాల వారు. వీరిని చిత్తశుద్ధితో ఆదుకోకుండా సామాజిక న్యాయం గురించి, వ్యవసాయం గురించి, రైతు భరోసా గురించి, నగదు బదిలీ గురించి ఎంత చెప్పినా ప్రయోజనం ఏమిటి ?
          రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలు రైతులు వున్నట్లుగా వివిధ అంచనాలు చెబుతుంటే ప్రభుత్వ అనుకూల మీడియా ఏజెన్సీలు 2021లో 16 లక్షల 483 మంది కౌలుదార్లు వున్నట్లు అంచనా వేశాయి. వీరందరికి గుర్తింపు కార్డులు ఇస్తామని, పంట రుణాలు అందివ్వడంతో పాటు, పంట నష్టపరిహారం వాస్తవ సాగుదార్లకు అందేలా చేస్తామని గత ఎన్నికల ముందు వైసిపి నేత ప్రస్తుత ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం కౌలుదార్లకు సరైన న్యాయం చేయలేకపోయామని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ప్రకటించారు. తర్వాతనైనా కౌలుదార్లకు న్యాయం చేసింది లేదు. పాలకుల లెక్కల ప్రకారం 16 లక్షలకు పైగా వున్న కౌలుదార్లలో కేవలం 4,87,000 మందికి గుర్తింపు కార్డులు (సిసిఆర్‌సి) ఇవ్వాలని 2021లో లక్ష్యం పెట్టుకొని, లక్ష్యంలో సగం మందికి కూడా గుర్తింపు కార్డులు ఇవ్వలేక పోయారు. చిత్తూరు జిల్లాలో 1 శాతం, అనంతపురంలో 2 శాతం, శ్రీకాకుళంలో 6 శాతం, కడప జల్లాలో 14 శాతం కౌలుదార్లకు మాత్రమే ఈ కార్డులు అందాయి. ఈ లెక్కన 16 లక్షల మందికైనా గుర్తింపు కార్డులు అందాలంటే మరో పుష్కర కాలం ఎదురుచూడాలి. ఈ కార్డులు పొందిన వారిని సామాజిక తరగతుల వారీగా పరిశీలిస్తే వాస్తవాలు మరింత ఆశ్చర్యం కలిగిస్తాయి. కౌలుదార్లలో 29 శాతం మంది ఓ.సి లు వుండగా సిసిఆర్‌సి కార్డులు పొందినవారిలో వీరు 41 శాతంగా వున్నారు. కౌలుదార్లలో 40 శాతం మంది బి.సి లు వుంటే 28 శాతం మంది మాత్రమే పొందారు. కోస్తా జిల్లాల్లో భూ యజమానులు వాస్తవ సాగుదార్లకు కాకుండా సాగులో లేని తమ బంధువులకు, తమ సామాజిక వర్గానికి చెందిన వారికి సిసిఆర్‌సి కార్డులు ఇప్పించినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ ధోరణి ఒక్క కోస్తా జిల్లాల్లోనే కాదు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కొనసాగుతుంది.
 

                                                               పంట రుణాల్లో కౌలు రైతులకు ద్రోహం

2019-20 నుండి 2021-22 వరకు రాష్ట్రంలో 307.20 లక్షల మంది రైతులకు రూ.4,37,828 కోట్లు వ్యవసాయ రుణాలుగా బ్యాంకులు ఇచ్చాయి. ఇందులో వాస్తవ సాగు ఆధారంగా కౌలుదార్లు పొందాల్సిన రుణాలు రూ. 2,32,914 కోట్లు. కాని కౌలు రైతులు పొందిన రుణాలు కేవలం రూ. 350 కోట్లు. పంటలు సాగు చేయని భూ యజమానులు సుమారు 2,32,564 కోట్ల రూపాయలు పంట రుణాలు పొందారు. వారిలో చాలామంది ఈ డబ్బుతో వ్యాపారాలు, కాంట్రాక్టులు, వడ్డీ వ్యాపారాలు, ప్రైవేటు విద్యాలయాలు, ఆసుపత్రుల లాంటివి నిర్వహిస్తూ భారీగా లాభపడుతున్నారు. కేంద్రం 2020-21లో రూ. 16.50 లక్షల కోట్ల పంట రుణాలు ఇచ్చినట్లు పార్లమెంట్‌లో ప్రకటించారు. ఈ సంవత్సరం రూ.18 లక్షల కోట్లు ఇస్తామన్నారు. దేశంలో సాగుదార్లలో 50 శాతం మంది కౌలు రైతులు వున్నారు. వీరికి అందే ప్రభుత్వ రుణ సదుపాయం నామమాత్రం. 67 వేల మంది కౌలుదార్లు వున్న అనంతపురం జిల్లాలో కేవలం 48 మందికి ఒక్కొక్కరికి సగటున రూ.29 వేల చొప్పున బ్యాంకు రుణాలు అందాయి. పంటలు సాగు చేయకుండా భూమి మీద యాజమాన్య హక్కు వుండడం వల్ల భూస్వాములు, ధనిక రైతులు ఒకవైపు కౌలుదార్ల నుండి నగదు కౌలు, మరోవైపు బ్యాంకుల నుండి తక్కువ వడ్డీకి పంట రుణాలు, ప్రభుత్వాలు ప్రకటించే పంటల పరిహారం, రైతు భరోసా లాంటివి పొందుతున్నారు. ఈ డబ్బుతో కొందరు వివిధ వ్యాపారాలు చేస్తూ ముప్పేట లాభపడుతుంటే కౌలు రైతులు కుదేలవుతున్నారు.
 

                                                         పంట సాగు చేసిన వారికి పరిహారం అందదు

2019-20 నుండి 2022-23 వరకు రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల 30.86 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ మే నెలలో కురిసిన వర్షాలు, తీవ్ర గాలుల వల్ల 7 వేల హెక్టార్లలో పంటలు, రెండు వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయని, ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసం కనీసంగా రూ.288 లక్షలు అవసరమని అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ఈ నష్టంలో సగానికి పైగా కౌలుదార్లు నష్టపోయారు. భూమికి కౌలు చెల్లించడంతో పాటు, పంటల పెట్టుబడి, కుటుంబ శ్రమ మొత్తం కోల్పోయారు. అప్పుల భారం పెరిగిపోతుంది. ప్రభుత్వాలు ప్రకటించే పరిహారం, పంటల బీమా లాంటివి ఏవీ వీరి దరిదాపుల్లోకి రావడంలేదు. గత ప్రభుత్వం 2014-2019 వరకు సబ్సిడీ విత్తనాలకు, సున్నా వడ్డీకి, పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, ధాన్యం కొనుగోలు కోసం మొత్తం రూ. 5,942 కోట్లు బకాయి పెట్టినట్లు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటిని చెల్లించడంతో పాటు, 2019 నుండి 2023 ఏప్రిల్‌ వరకు రూ. 1911.8 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీగా రైతులకు చెల్లించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి ఈ నెలలో ప్రకటించారు. ఇందులో వాస్తవ సాగుదార్లయిన కౌలు రైతులకు అందింది ఎంత? నిజమైన సాగుదార్లయిన కౌలురైతులకు ప్రభుత్వ సహాయం అందకపోతే వ్యవసాయం ఎలా బాగుపడుతుంది?
 

                                                                        కౌలు రైతుల ఆత్మహత్యలు

2016 నుండి 2021 వరకు దేశవ్యాప్తంగా 63,722 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మన రాష్ట్రంలో 2020లో 889 మంది, 2021లో 1065 మంది అంటే 14.5 శాతం అదనంగా రైతులు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నట్లు అధికార లెక్కల చెబుతున్నాయి. వాస్తవ పరిస్థితి ఇంతకు రెండింతలు వుంటుంది. అనంతపురం జిల్లాలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే గత నాలుగు సంవత్సరాల్లో 85 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాస్తవ లెక్కల ప్రకరాం సుమారు 294 మంది వున్నారు. పంటల పెట్టుబడి ఖర్చులు పెరగడం, గిట్టుబాటు ధరలు అందకపోవడం, ప్రభుత్వ రుణ సదుపాయం తగ్గిపోవడం, ప్రకృతి వైపరీత్యాలు, కౌలు చెల్లింపులు ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణాలుగా వున్నాయి. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ప్రభుత్వం చెల్లిస్తున్నట్లు చెబుతున్న రూ.5 లక్షల పరిహారం వాస్తవ సాగుదార్లయిన కౌలు రైతులకు అందడంలేదు. వీరి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోవడమే కాక, ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి అనాథలుగా మారుతున్నారు.
 

                                                                    చివరి సాగుదారుడు కౌలు రైతు

వ్యవసాయంలో చివరి సాగుదారులు కౌలు రైతులు. వ్యవసాయం మీద చివరి విశ్వాసాధారులు కూడా వీరే. స్వాతంత్య్రానంతరం పాలకులు చేపట్టిన విధానాల వల్ల భూస్వాములు, ధనిక రైతులు గ్రామాల్లో భూములపై ఆధిపత్యం కొనసాగిస్తూనే పట్టణాలకు, నగరాలకు ఎగబాకి వ్యాపారులుగా, కాంట్రాక్టర్లుగా, వడ్డీ వ్యాపారులుగా, రియల్‌ ఎస్టేట్‌దారులుగా మారారు. వీరి పొలాలన్నీ కౌలుదార్లు సాగుచేస్తున్నారు. మధ్యతరగతి రైతుల్లో ఎక్కువ కాలం వ్యవసాయ కూలీల మీద ఆధారపడి వ్యవసాయాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం అందించే సహాయాన్ని పొందుతూ, వ్యవసాయం గిట్టుబాటు కాక సాగు పట్ల నిరాసక్తతతో వుంటున్నారు. వీరిలో కొందరి పిల్లలు ఐటి లాంటి ఉద్యోగాలు చేస్తూ ఎక్కువ మొత్తాలను ఆర్జిస్త్తుంటే, వీరు మాత్రం గ్రామాల్లో వుంటూ వ్యవసాయ భూములను కౌలుకు ఇవ్వడం, కౌలుదార్లకు అవసరమైన పంట పెట్టుబడులకు, ఇతర అవసరాలకు వడ్డీకి అప్పులు ఇస్తూ ధనిక రైతులుగా మారుతున్నారు. చిన్న, సన్నకారు రైతులు తమకు వున్న కొద్ది పొలానికి తోడు కౌలు భూములు సాగు చేస్తూ గ్రామాలను వదలలేక, వ్యవసాయం తప్ప ఇంకో పనికి పోలేక, సామాజిక గౌరవం కోసం సాగు కష్టాల సుడిగుండంలో వున్నారు. కౌలు సేద్యం చేస్తున్న కౌలుదార్లను ఆదుకునే చర్యలు చిత్తశుద్ధితో చేపట్టకుండా వ్యవసాయాభివృద్ధి గురించి చెప్పేవన్నీ మోసపు మాటలుగా నిలిచిపోతాయి.

/ వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు /
వి. రాంభూపాల్‌

వి. రాంభూపాల్‌