Sep 18,2023 14:16

భారత స్టార్‌ బౌలర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ ఆసియా కప్‌ ఫైనల్‌లో చేలరేగడంతో శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌటయ్యింది. సిరాజ్‌ కెరీర్‌లోనే అత్యుత్తమ (6/21) బౌలింగ్‌ గణాంకాలను నమోదు చేయడమే కాకుండా ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. అయితే, సిరాజ్‌ ఈ మ్యాచ్‌లో కేవలం ఏడు ఓవర్లను మాత్రమే బౌలింగ్‌ చేశాడు. సిరాజ్‌కు 7 ఒవర్ల తర్వాత ఎందుకు బౌలింగ్‌ ఇవ్వలేదనే దానిపై భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందించాడు. ''సిరాజ్‌ ఏడు ఓవర్ల స్పెల్‌ను నిర్విరామంగా వేశాడు. దీంతో అతడికి కాస్త విశ్రాంతి ఇవ్వాలని ట్రైయినర్‌ నుంచి సందేశం వచ్చింది. దీంతో రెస్ట్‌ ఇచ్చి స్పిన్నర్‌తో పాటు హార్దిక్‌తో కంటిన్యూ చేయించా. అయితే, హార్దిక్‌ కూడా అద్భుతంగా బౌలింగ్‌ చేసి వికెట్లను తీయడంతో మళ్లీ సిరాజ్‌కు అవకాశం రాలేదు. గతంలో త్రివేండ్రం (తిరువనంతపురం)లోనూ వరుసగా 8-9 ఓవర్లు వేశాడు. వన్డే ప్రపంచకప్‌ సమీపిస్తున్న నేపథ్యంలో మరీ ఒత్తిడి ఎక్కువ లేకుండా ఉండాలనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్లేయర్‌ ఆఫ్‌ టోర్నీగా నిలిచిన కుల్‌దీప్‌ తీవ్ర ఒత్తిడిలోనూ అద్భుతంగా బౌలింగ్‌ వేశాడు'' అని రోహిత్‌ వ్యాఖ్యానించాడు.