
హైదరాబాద్ : తాను డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసిన 'నాటు నాటు' పాటకు ఆస్కార్ అవార్డు వస్తుందనుకోలేదని, ఈ అవార్డు రావడం తనకెంతో సంతోషంగా ఉందని ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ అన్నారు. ఆస్కార్ వేడుకలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన ఆయన తాజాగా హైదరాబాద్‌కి తిరిగి వచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'నేను ఆస్కార్ వేడుకలకు వెళ్తానని అస్సలు అనుకోలేదు. ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ సపోర్టుతోనే లాస్ ఏంజెల్స్ వెళ్లగలిగాను. అక్కడికి వెళ్లగానే నాటు పాట రిహార్సల్స్‌లో పాల్గొన్నాను. ఆస్కార్ వేడుకల్లో స్టేజ్‌పై ఆ పాట ప్రదర్శన పూర్తయిన వెంటనే అక్కడున్న వారంతా లేచి నిల్చొని చప్పట్లు కొట్టారు. ఆ క్షణం నాకు కన్నీళ్లు వచ్చేశాయి. అవార్డు తీసుకున్న తర్వాత సంగీత దర్శకుడు కీరవాణి నన్ను ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. ఆ క్షణం నేను పొందిన సంతోషాన్ని మాటల్లో చెప్పలేను' అని ఆయన అన్నారు.