Nov 25,2022 12:23

అహ్మదాబాద్‌ : గుజరాత్‌లోని బిజెపి ప్రభుత్వంపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇటీవల మోర్బీ వంతెన కుప్పకూలిన అత్యంత విషాదకర ఘటనలో మృతుల కుటుంబ సభ్యులకు ప్రకటించిన పరిహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి ప్రభుత్వ తీరును నిలదీసింది. ఈ పరిహారం ఏ మూలకూ చాలదని ఆక్షేపించింది. అంతులేని విషాదంలో మునిగిన కుటుంబాలను ఆదుకునే తీరు ఇదా అని నిలదీసింది. వాస్తవమైన, సముచితమైన పరిహారం అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రమాదంలో గాయపడినవారికి అందజేసిన పరిహారంపైనా న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆప్తులను కోల్పోయి అనాధలుగా మిగిలినవారికి నెలకు రూ.3000 చొప్పున అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఏమాత్రం చాలదని పేర్కొంది.
          ఈ మొత్తం కనీసం పిల్లల యూనిఫామ్స్‌, పుస్తకాలు కొనుగోలుకు కూడా సరిపోదని తెలిపింది. ఈ విషాదకర ఘటనలో ఏడుగురు పిల్లలు తల్లిదండ్రులను ఇద్దరినీ కోల్పోయి అనాధలుగా మిగిలారు. మరో 12 మంది చిన్నారులు తమ తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయారు. అనాధ పిల్లలకు ప్రకటించిన మొత్తాన్ని కనీసం రెట్టింపు చేయాలని (నెలకు రూ.6 వేలు) లేదా తక్షణం కనీసం రూ.10 లక్షల మొత్తాన్ని అయినా అందజేయాలని ఆదేశించింది. ఈ ప్రమాదంలో బాధితులైనవారి పూర్తి వివరాలను, వారికి పరిహారం అందజేసే విధానానికి సంబంధించి సమగ్ర నివేదికతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. మృతుల జాబితాలో బాధితుల వివరాలను కులాల వారీగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి విషాదకర ఘటనల్లోనూ కులాల ప్రస్తావన అవసరమేంటని నిలదీసింది. గత అక్టోబరు 30న మోర్బీ వంతెన కూలిన 130 మందికిపైగా చనిపోయిన సంగతి తెలిసిందే.
 

                                                                  వంతెనలపై సర్వే

గుజరాత్‌లోని అన్ని వంతెనల పరిస్థితిపై సర్వే నిర్వహించి ఆ వివరాలను కోర్టుకు సమర్పించాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అవన్నీ సరైన స్థితిలో ఉన్నాయా లేదా? అధ్యయనం నిర్వహించి నిపుణులైన ఇంజనీర్లతో ధ్రువీకరించి 10 రోజుల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.