Jul 02,2022 20:51

ప్రజాశక్తి- విశాఖపట్నం ప్రతినిధి, గొలుగొండ, పద్మనాభం విలేకరులు :గిరిజన హక్కులను కాలరాసి అటవీ సంపదను బహుళజాతి, కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతోన్న మోడీ సర్కారుకు అల్లూరి సీతారామరాజు జయంత్యుత్సవాలు జరిపే అర్హత లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. అడవిపై గిరిజన హక్కుల కోసం పోరాడిన అల్లూరి ఆశయాలకు తూట్లు పొడుస్తోన్న పాలకులే అల్లూరి జయంత్యుత్సవాలు నిర్వహించడం ప్రజలను మోసగించడమేనని తెలిపారు. సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా అల్లూరి జన్మించిన విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగిని శనివారం ఆయన సందర్శించి ఆ గ్రామంలోని అల్లూరి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలోని అల్లూరి, గంటందొర సమాధులను సందర్శించి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే తరాల ప్రజల భవిష్యత్తు, సంక్షేమం కోసం అల్లూరి స్ఫూర్తితో ఉద్యమించాలన్నారు. అల్లూరి పార్కును చారిత్రక ప్రదేశంగా అభివృద్ధి చేసి, స్ఫూర్తి పర్యటన పేరుతో విద్యార్థుల్లో స్వాతంత్య్రోద్యమ భావాలు, దేశభక్తి పెంపొందించాలని కోరారు. వామపక్షాల మద్దతుతో యుపిఎ ప్రభుత్వం తెచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నీరుగార్చిందన్నారు. గిరిజనులకు అడవిపైనా, అటవీ భూములపైనా ఉన్న హక్కును తొలగిస్తోందని తెలిపారు. దేశభక్తి పేరు చెప్తూ దేశ ద్రోహానికి తలపెడుతోందని విమర్శించారు. ప్రయివేటు కంపెనీలకు అటవీ సంపదను కట్టబెట్టడాన్ని అడ్డుకోవాలన్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలు అమలు చేస్తారా? లేదా? విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ ఆపుతారా? లేదా? వంటి వాటికి సమాధానం చెప్పకుండా ప్రధాని మోడీ రాష్ట్రం వచ్చి వెళ్లిపోతే ఆంధ్రా ప్రజలు క్షమించరని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితులైన రెండు లక్షల మంది గిరిజనుల పునరావాసానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా ఇబ్బందులు పెడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు తదితరులు పాల్గన్నారు. కెడి పేట పిహెచ్‌సి నుంచి అల్లూరి స్మారక పార్కు వరకు సిపిఎం కార్యకర్తలు బైకు ర్యాలీ నిర్వహించారు. పాండ్రంగి గ్రామాన్ని వి.శ్రీనివాసరావు సందర్శించినప్పుడు రాష్ట్ర మాజీ మంతి ఆర్‌ఎస్‌డిపి.అప్పలనరసింహరాజు కలిసి అల్లూరి జీవిత విశేషాలను తెలియజేశారు.