Aug 02,2022 16:31

ఇంటర్నెట్‌డెస్క్‌ : నాగాలాండ్‌ గిరిజన వ్యవహరాల మంత్రి టెంజెన్‌ ఇమ్నా గిరిజనులతో కలిసి కాలు కదిపారు. ఆయన భారీకాయంతో ఉన్నా.. డ్యాన్స్‌ చేయడం విశేషం. నాగాలాండ్‌లో ఘనంగా జరుపుకునే సుంగ్రెమాంగ్‌ పండుగలో ఆయన పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ఆయన గిరిజనులతో కలిసి సాంప్రదాయక నృత్యాన్ని చేశారు. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా ఆయన ట్విటర్‌ వేదికగా పోస్టు చేశారు. అలాగే ఈ వీడియోకు జతగా.. 'చూడండి.. నేను కూడా డ్యాన్స్‌ చేయగలను.' అని పేర్కొన్నారు. అలాగే ఆయన ఈ పండుగనుద్దేశించి.. 'నాగాలు.. పంటలు బాగా పండాలని జరుపుకునే పండుగ ఇది. సంస్కృతీ, సంప్రదాయాలకు నిలువుటద్దంగా ఈ ఫెస్టివల్‌ నిలుస్తుంది. నాగాలాండ్‌ సంస్కతిని చూడాలనుకునేవారు అక్కడికి వెళ్లండి' అని సూచించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 95 వేల మంది వీక్షించారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు మంత్రిని 'మల్టీ టాలెంటెడ్‌, 'రాక్‌స్టార్‌' అని మెచ్చుకుంటున్నారు.