Oct 02,2022 20:00

ద్వారకాకు వెళ్లనీయకుండా అడ్డుకున్న పోలీసులు
లెక్క చేయబోమంటూ ముందుకు సాగిన నేతలు
'తూర్పు'లో ప్రవేశించిన అమరావతి పాదయాత్ర
ప్రజాశక్తి-ద్వారకాతిరుమల (ఏలూరు జిల్లా), నల్లజర్ల(తూర్పు గోదావరి) :
రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రైతులు, మహిళలు చేపట్టిన 'అమరావతి టు అరసవల్లి' మహాపాదయాత్ర ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల కుంకుళ్లమ్మ ఆలయం వద్ద ప్రారంభమైంది. యాత్రలో అమరావతి హైకోర్టు న్యాయవాది డి ప్రసాద్‌ బాబు, 20 మంది హైకోర్టు న్యాయవాదులు, మహిళలు పాల్గన్నారు. ఈ యాత్రకు టిడిపి ప్రతినిధులు మల్లిపెద్ది వెంకటేశ్వరరావు, జెడ్‌పిటిసి మాజీ సభ్యులు లక్ష్మీరమణి, జనసేన నాయకులు నరసింహారావు, ఫణి, శివకుమార్‌ సంఘీభావం తెలిపారు. ఉగాది మండపం వద్ద నుంచి పాదయాత్ర బృందం చినవెంకన్న దేవస్థాన మండప ప్రాంగణం వైపు వెళ్లేందుకు ద్వారకాతిరుమలలోకి ప్రవేశిస్తుండగా పోలీసులు అభ్యంతం తెలిపారు. దీంతో జెఎసి నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ద్వారకలోకి ప్రవేశిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. కేసులు పెట్టుకున్నా తాము లెక్క చేయబోమంటూ నేతలు ముందుకు సాగారు. తిరుగుప్రయాణంలో ఉగాది మండపం మీదుగా కాపు కల్యాణ మండపం నుంచి రాళ్లకుంటకు చేరుకుంది.
'తూర్పు'లోకి పాదయాత్ర
నల్లజర్ల మండలం అయ్యవరం వద్ద ఉదయం 11:30 గంటలకు తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. యాత్రకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్‌పి మాజీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు ఆధ్వర్యంలో గ్రామస్తులు, రైతులు, టిడిపి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. పలుచోట్ల మహిళలు హారతులు పట్టారు. ఈ సందర్భంగా బాపిరాజు మాట్లాడుతూ మూడున్నరేళ్లుగా సిఎం జగన్‌ రాజధాని మహిళలను పెడుతున్న ఇబ్బందులను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రైతులను పెయిడ్‌ ఆర్టిస్టులని వ్యాఖ్యానించడంపై స్పందిస్తూ పెయిడ్‌ అర్టిస్టులయితే ఫొటోలు దిగి వెళ్లిపోతారు తప్ప, గుంతలు పడిన, రాళ్లుదేలిన రోడ్లపై వందల కిలోమీటర్లు నడవరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించిన మహా పాదయాత్ర అయ్యవరం మీదుగా కొత్తగూడెం చేరకుంది. భోజన విరామం అనంతరం మూడున్నర గంటలకు తిరిగి యాత్ర ప్రారంభమైంది. కొత్తగూడెం, గాంధీ కాలనీ, మీదుగా దూబచర్ల దత్త సాయి మండపం వద్దకు చేరుకుంది. రాత్రి బస అనంతరం సోమవారం దూబచర్ల నుంచి బయలుదేరి నల్లజర్ల మీదుగా తిరిగి పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుందని నాయకులు తెలిపారు. వీరి యాత్రకు మాజీ మంత్రి జవహర్‌, టిడిపి గోపాలపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ ముప్పిడి వెంకటేశ్వరరావు, నల్లజర్ల మండల అధ్యక్షులు తాతన సత్యనారాయణ, టిడిపి బిసి సెల్‌ రాష్ట్ర కార్యదర్శి షేక్‌ మీరాసాహెబ్‌ మద్దతు తెలిపారు.