Jan 25,2023 07:27

రైతాంగ రక్షణ కోసం, వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం, కిసాన్‌ సంయుక్త మోర్చా కోరుతున్న విధంగా స్వామినాథన్‌ సూచించిన సి2+50 ఫార్ములా ప్రకారం మద్దతు ధరల చట్టం కోసం, రుణ విముక్తి చట్టం కోసం, సమగ్ర పంటల బీమా చట్టం కోసం, రైతులకు, కూలీలకు పెన్షన్‌ కోసం వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ కోసం మరొక పోరాటం సాగించాల్సి ఉంది. అందుకు నాందిగా ఈ నెల 26న తలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీలో పాల్గొని, మరొక దీర్ఘకాల ఉద్యమానికి సిద్ధం కావాల్సి ఉంది.         

  కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ కంపెనీలకు అప్పజెప్పటానికి తెచ్చిన 3 వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతాంగం ఏడాది పైగా ఉద్యమం చేసింది. దాంతో కేంద్రం దిగివచ్చి వ్యవసాయ చట్టాలను రద్దు చేసింది. అంతేగాక రైతు సంక్షేమశాఖ కార్యదర్శి ద్వారా మిగిలిన కోర్కెల పరిష్కారానికి రాత పూర్వకంగా హామీ ఇస్తూ ఉద్యమాన్ని విరమించాలని కోరింది. సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకత్వం 2021 డిసెంబరు 11న ఉద్యమాన్ని విరమించింది. ఇది జరిగి ఏడాది దాటినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుపరచలేదు. పైగా ప్రధానమైన పంటల మద్దతు ధరల ప్రస్తావన లేకుండానే మూడు చట్టాలను బలపరిచిన వారితో కమిటీని ఏర్పరిచింది. 2020 విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును కూడా యథాతథంగా పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ రెండు అంశాలకు సంబంధించి సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకత్వంతో చర్చించనేలేదు. ఉద్యమం సందర్భంగా 70 వేల మంది రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయడం గాని, ఉద్యమం సందర్భంగా మృతి చెందిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇస్తామన్న హామీల గురించి గాని మాట్టాడడంలేదు. పరిస్థితిని సమీక్షించిన సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకత్వం... రైతాంగం యొక్క న్యాయమైన కోర్కెల సాధనకై మరో ఉద్యమానికి సన్నద్ధం కావాలని పిలుపు ఇచ్చింది. అందుకు తొలి చర్యగా జనవరి 26 రిపబ్లిక్‌డే రోజున అన్ని జిల్లా కేంద్రాలలో ట్రాక్టర్‌ ర్యాలీలు జరపాలని నిర్ణయించింది.
 

                                                          పంటలకు మద్దతు ధర గ్యారంటీ చట్టం

సరళీకరణ విధానం ప్రారంభం అయినప్పటి నుండి వ్యవసాయ రంగం సంక్షోభానికి గురైంది. రైతాంగం ఆత్మహత్యలు నిత్యకృత్యాలయ్యాయి. వ్యవసాయ సంక్షోభానికి పరిష్కారం చూపడం కోసం యు.పి.ఎ ప్రభుత్వం ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త డా||స్వామినాథన్‌ నాయకత్వాన కమిషన్‌ను నియమించింది. వ్యవసాయ రంగంలో తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ సమగ్రమైన నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో కీలకమైన అంశం రైతు పండించిన అన్ని పంటలకు సమగ్రంగా అయిన ఖర్చులపై అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధరగా ఇవ్వాలని సూచించింది. దానినే సి2+50 ఫార్ములా అన్నారు. ఈ ఫార్ములాను అన్ని రైతు సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించాయి. కాని అమలుకు నోచుకోలేదు.
డా|| స్వామినాథన్‌ సూచన ప్రకారం అన్ని పంటలకు సి2+50 ఫార్ములా ప్రకారం మద్దతు ధరలు అమలు పరుస్తామని 2014 ఎన్నికలలో బిజెపి హామీ ఇచ్చింది. అనతి కాలంలోనే స్వామినాథన్‌ కమిషన్‌ సూచనల అమలు జరపలేమని సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. 2016లో పప్పుధాన్యాల ధరల సమస్యపై ప్రధానమంత్రి మోడీ స్వయంగా నియమించిన అరవింద సుబ్రమణ్యం కమిటీ ఇచ్చిన రిపోర్టును సైతం తుంగలో తొక్కింది.
      రైతుసంఘాలన్నీ ఐక్యమై పోరాటం సాగించగా ఎ2+ఎఫ్‌ఎల్‌ అనే బూజు పట్టిన పథకాన్ని అమలు పరుస్తున్నానని చెప్పింది. ఎ2+ఎఫ్‌ఎల్‌ ఫార్ములా నాలుగు దశాబ్దాలకు పూర్వం తెచ్చింది. దాని ప్రకారం రైతుకు ఉత్పత్తి ఖర్చులు కూడా రావడం లేదని బి2 ఫార్ములా రూపొందించారు. పెరుగుతున్న పెట్టుబడులకు అది కూడా సరిగా లేదని సి2 ఫార్ములా రూపొందించారు. ఈ ఫార్ములా ప్రకారం ఉత్పత్తి ఖర్చులు సమగ్రంగా గుణిస్తారు. రైతుకు మిగులు ఏమి ఉండదు. అన్ని పారిశ్రామిక వస్తువులకు ధరలు నిర్ణయిస్తున్న పద్ధతిలోనే రైతు పండించిన పంటలకు కూడా ఉత్పత్తి ఖర్చులకు అదనంగా 50 శాతం కలిపి ఇవ్వాలని డా||స్వామినాథన్‌ సూచించారు. వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలంటే స్వామినాథన్‌ సూచించిన సి2+50 ఫార్ములా అమలు పరచడమే మార్గమని పలువురు వ్యవసాయ శాస్త్రవేత్తలు నొక్కి చెప్తున్నారు.
 

                                                       రైతుకు రుణ మాఫీ ఎందుకు చేయాలి ?

కేంద్రంలో మోడీ అధికారంలోకి రాగానే చేసిన మరొక చర్య మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ స్కీమును నీరుగార్చటం. పైగా శాంతకుమార్‌ కమిటీ సూచన పేరుతో మార్కెట్‌లో జోక్యం చేసుకోవడం మానివేసింది. ప్రధానమంత్రి అన్నదాతా ఆరు సంరక్షణ్‌ యోజన పథకం పేరుతో ప్రభుత్వం కొనుగోలు చేయకుండా...తక్కువకు అమ్ముకున్న రైతులకు నగదు బదిలీ పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకంలో మార్కెట్‌కు వచ్చిన సరుకులో 25 శాతం పంటకు మాత్రమే సరిపెట్టటంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. వ్యవసాయ ఆర్థికవేత్తల అంచనా ప్రకారం ఈ కాలంలో రైతాంగం ఏటా రూ.2 లక్షల కోట్లకు పైగా కోల్పోయారు. ఆ మేరకు రైతులు అప్పులతో ఉన్నట్లు అనేక నివేదికలు తెలియజేస్తున్నాయి. రైతులకు ఉత్పత్తి ఖర్చులు తగ్గించుకోమని చెప్తుంది. జీరో పెట్టుబడి వ్యవసాయం పేరుతో రైతులకు కథలు వినిపించింది. స్వామినాథన్‌ ఫార్ములా ప్రకారం కాదు గదా సి.ఎ.సి.పి నిర్ణయించిన ధరలు సైతం రైతుకు దక్కలేదు. మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయానికి అవసరమైన ఎరువులు, డీజిల్‌, క్రిమిసంహారకాలు, పరికరాలు తదితరాలపై కంట్రోల్‌ తొలగించడం, ధరలు పెంచటం, సబ్సిడీలు తగ్గించడం, పాల ఉత్పత్తులతో సహా జిఎస్టి విధించడం ద్వారా పెట్టుబడులు పెరిగాయి. రుణగ్రస్తమవుతున్న రైతాంగం ఆత్మహత్యలు చేసుకోవడం పెరిగింది. రైతులు ఒకసారి రుణాలు మాఫీ చేయాలని కోరుతుండగా...రైతుల రుణాలు మాఫీ చేస్తే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని సన్నాయి నొక్కులు నొక్కింది. మరొకవైపు కార్పొరేట్‌ కంపెనీలకు ఈ కాలంలో రూ.10 లక్షల కోట్లు మాఫీ చేసింది. దేశానికి అన్నం పెట్టే రైతుకు రుణమాఫీ చేస్తే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. దోపిడీదారులైన కార్పొరేట్లకు దోచిపెట్టడాన్ని ఏమనాలి? అందుకే ఒకసారి రైతుల మొత్తం రుణాలు రద్దు చేయాలి. కేరళ రాష్ట్రంలో అమలులో ఉన్న రుణ ఉపశమన చట్టం చేయడం అవసరం.
 

                                                        పి.ఎం ఫసల్‌ బీమా యోజన ఎవరి కోసం ?

వ్యవసాయం ప్రకృతిలో ఆరుబయలులో చేయాల్సినది. మిగతా రంగాల లాగా రక్షణ గొడుగు కింది చేసేది కాదు. భూగోళంపై వచ్చే తుఫానులు, అతివృష్టి, అనావృష్టి, కరువులు, వరదలు, చీడలు, పీడలు పంటలను నిరంతరం నష్టపరుస్తుంటాయి. వీటికి తోడు ప్రభుత్వ విధానాల పుణ్యమా అని నాణ్యత లేని విత్తనాలు, కల్తీ క్రిమిసంహారకాలు రైతులను దెబ్బ తీస్తుంటాయి. వాటి నుండి రక్షణ కల్పించడం కోసం పంటల బీమా పథకం ప్రవేశపెట్టింది. పంటల బీమా పథకం రెండు దశాబ్దాల నుండి ప్రయోగాలకే పరిమితంగా ఉంది. మోడీ ప్రభుత్వం 2017లో మూడు పంటల బీమా పథకాలను ఏకం చేసి ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం ప్రవేశపెట్టారు. పంట దెబ్బతిన్న రైతులు చేలో నిలబడి స్మార్ట్‌ఫోనులో ఫోటో తీసి పెడితే చాలు 15 రోజులలో బీమా సొమ్ము వస్తుందని కబుర్లు చెప్పారు. ఈ పథకం అమలును 10 ప్రెవేటు బీమా కంపెనీలకు అప్పగించారు. 2019లో పార్లమెంట్‌ చర్చలలో తేలిందేమంటే 10 ప్రెవేటు బీమా కంపెనీలు ఒక్కొక్కటి వెయ్యి కోట్లకు పైగా లాభం ఆర్జించాయి.
           పంట పోయిన రైతులకు బీమా పరిహారం అందలేదు. దీనితో 9 రాష్ట్రాలు ఏకంగా ఈ పథకం నుండి తప్పుకున్నాయి. మోడీ ప్రభుత్వం తెచ్చిన బీమా పథకం రైతుల ప్రయోజనాలకా? ప్రైవేటు కంపెనీల ప్రయోజనాలకా? కావున రైతులు కోరుతున్నట్లు సమగ్ర పంటల బీమా పథకం తీసుకురావల్సి ఉంది.
 

                                                  విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు ఎవరి మేలు కోసం ?

కేంద్రం లోని మోడీ ప్రభుత్వం 2 సంవత్సరాల నుండి 2020 విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు తయారు చేసుకుని కూర్చున్నది. ఆ బిల్లు చట్టమైతే విద్యుత్‌ ఉత్పతి సంస్థలు, పంపిణీ సంస్థలు ప్రైవేటు కార్పొరేట్‌ కంపెనీల వశమవుతాయి. లక్షల కోట్ల విలువైన విద్యుత్‌ సంస్థల ఆస్థులన్నీ ప్రైవేటు కంపెనీల ఆస్థులుగా మారిపోతాయి. రాష్ట్ర ప్రభుత్వాల అజమాయిషీగాని, రాష్ట్ర విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ అజమాయిషీ గాని ఉండవు. కేంద్ర ప్రభుత్వం నియమించే కేంద్ర విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ అజమాయిషీలోకి వెళతాయి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ పథకాలు రద్దవుతాయి. రాష్ట్రాలు నగదు బదిలీ పథకాలు పెట్టుకోవచ్చు. 20 శాతం సబ్సిడీలు మించి ఇవ్వడానికి వీలు లేదు. ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేస్తారు. ప్రతి నెలా రీడింగ్‌ తీసి రైతుకు బిల్లు ఇస్తారు. రైతు బిల్లు చెల్లించాలి. రైతు ఉద్యమ విరమణ సందర్భంగా సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకత్వంతో చర్చిస్తామని ప్రభుత్వం రాతపూర్వకంగా తెలియజేసింది. రైతుసంఘాలతో చర్చించకుండానే పార్లమెంటులో ప్రవేశపెట్టింది.
         ఈ పథకాన్ని 11 రాష్ట్రాలు వ్యతిరేకించాయి. అయినా మన రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టం అవకుండానే 2020 లోనే మీటర్లు ఏర్పాటుకు జీవో 22 విడుదల చేసింది. పైలెట్‌ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో ప్రవేశపెట్టింది. స్మార్ట్‌ మీటర్లు బిగించడం వలన నష్టాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రయాస్‌ ఎనర్జీ గ్రూపుతో సర్వే నిర్వహించింది. ఆ నివేదికను బయట పెట్టడం లేదు. రైతాంగంలో ఆందోళన రావడంతో బిల్లులు ప్రభుత్వమే చెల్లిస్తుంది. 25 సంవత్సరాలు ఉచిత విద్యుత్‌ ఉంటుందని నమ్మబలుకుతున్నది. ఒక్కో మీటరుకు రూ.14000 ఖర్చు చేస్తుంది. ఇది అంబానీకి లాభాల పంట-రైతుకు గుదిబండలాగా మారుతుంది. దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ పథకం ఎగిరిపోతుంది. స్వంతంగా బోరు వేసుకుని మోటారు పెట్టుకున్న రైతుకు మాత్రం బిల్లు చేతికి వస్తుంది.
 

                                       రైతులకు, కౌలురైతులకు, వ్యవసాయ కార్మికులకు పెన్షన్‌ అక్కర్లేదా ?

దేశంలో వ్యవసాయ రంగానికి తప్ప అన్ని రంగాలకు పెన్షన్‌లు ఉన్నాయి. స్వంత వ్యాపారాలు, సంపాదనలు సాగించుకుంటూ కేవలం 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, ఎంపీగా పని చేసిన పాలకులు జీవితాంతం పెన్షన్‌ పొందుతున్నారు. ఎండనక, వాననక కరోనాలో సైతం పంటలు పండించి దేశానికి అన్నం పెట్టే రైతుకు, కూలీకి పెన్షన్‌ ఇవ్వాలనే తలంపు ఎందుకు లేదు? 60 ఏళ్లు దాటినా జీవనం సాగించడం కోసం పేదరైతులు, కౌలురైతులు వ్యవసాయ కార్మికులు పని చేయాల్సిందేనా? సంయుక్త కిసాన్‌ మోర్చా రైతులకు, కౌలురైతులకు, వ్యవసాయ కార్మికులకు నెలకు రూ.5000 పెన్షన్‌ ఇవ్వాలని కోరుతున్నది.
       కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎ2+ఎఫ్‌ఎల్‌ పంటల ధరల విధానం, ప్రధానమంత్రి అన్నదాతా ఆరు సంరక్షణ్‌ యోజన పథకం, ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం, విద్యుత్‌ సవరణ చట్టం తదితర పథకాలన్నీ కార్పొరేట్‌ సంస్థల ప్రయోజనం కోసమేనని, రైతుల ప్రయోజనం కోసం కాదని తేటతెల్లం అయ్యింది. రైతాంగ రక్షణ కోసం, వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం, కిసాన్‌ సంయుక్త మోర్చా కోరుతున్న విధంగా స్వామినాథన్‌ సూచించిన సి2+50 ఫార్ములా ప్రకారం మద్దతు ధరల చట్టం కోసం, రుణ విముక్తి చట్టం కోసం, సమగ్ర పంటల బీమా చట్టం కోసం, రైతులకు, కూలీలకు పెన్షన్‌ కోసం వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ కోసం మరొక పోరాటం సాగించాల్సి ఉంది. అందుకు నాందిగా ఈ నెల 26న తలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీలో పాల్గొని, మరొక దీర్ఘకాల ఉద్యమానికి సిద్ధం కావాల్సి ఉంది.

(వ్యాసకర్త : రైతుసంఘం సీనియర్‌ నాయకులు)
వై. కేశవరావు

వై. కేశవరావు