Aug 02,2022 09:30

పిల్లలూ, ఈ రోజు స్వాతంత్య్ర సమరయోధుడు, జాతీయ పతకా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి.
ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందామా !

పింగళి వెంకయ్య ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపాన ఉన్న ప్రస్తుత మొవ్వ మండలంలోని భట్లపెనుమర్రు గ్రామంలో హనుమంత రాయుడు, వెంకటరత్నమ్మ దంపతులకు 1876 ఆగస్టు 2న జన్మించారు. తండ్రి దివి తాలూకా యార్లగడ్డ గ్రామ కరణంగా ఉండేవారు. ఆయనకు పెదకళ్ళేపల్లి బదిలీ కావటం వల్ల వెంకయ్య ప్రాథమిక విద్య అక్కడే పూర్తి అయింది. తరువాత చల్లపల్లిలోను, మచిలీపట్నం హిందూ ఉన్నత పాఠశాలలోనూ విద్య అభ్యసించాడు. ఉన్నత పాఠశాల విద్య పూర్తిచేసుకొని సీనియర్‌ కేంబ్రిడ్జ్‌ చేయటానికి కొలంబో వెళ్లాడు. చొరవ, సాహసం మూర్తీభవించిన వెంకయ్య బొంబాయి వెళ్ళి, 19వ యేట సైన్యంలో చేరి దక్షిణాఫ్రికాలోని రెండవ బోయర్‌ యుద్ధంలో పాల్గొన్నాడు. అప్పుడు మహాత్మా గాంధీని కలిశాడు.
    1906 నుంచి 1922 వరకు భారత జాతీయోద్యమంలో పాల్గొన్నాడు. బెంగుళూరు, మద్రాసులలో రైల్వే గార్డుగా పనిచేశాడు. కొంత కాలం బళ్లారిలో ప్లేగు అధికారిగా పనిచేశాడు. ఆయనలోని దేశభక్తి ఎంతో కాలం ఉద్యోగం చేయనివ్వలేదు. లాహోరు లోని ఆంగ్లో - వేదిక్‌ కళాశాలలో చేరి ఉర్దూ, జపనీస్‌ భాషలను నేర్చుకున్నాడు. ప్రొఫెసర్‌ గోటే ఆధ్వర్యంలో జపనీస్‌, చరిత్ర అభ్యసించాడు.
    ఒక జాతికీ, ఆ జాతి నిర్వహించే ఉద్యమానికీ ఒక పతాకం అవసరమని వెంకయ్యకు 1906లోనే ఆలోచన కలిగింది. గాంధీజీ బెజవాడ వచ్చినప్పుడు ఆయన్ని కలుసుకున్నాడు. మహాత్ముడు సూచించిన ప్రకారం కషాయం, తెలుపు, ఆకుపచ్చ మధ్యలో రంగుల రాట్నంతో నేటి త్రివర్ణ పతాకాన్ని దేశానికి ప్రసాదించాడు. 1916లో 'భారత దేశానికి ఒక జాతీయ పతాకం' అనే ఆంగ్ల గ్రంథాన్ని రచించాడు.
    వెంకయ్య బందరులోని జాతీయ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశాడు. వ్యవసాయ శాస్త్రం, చరిత్రలతో పాటు విద్యార్థులకు గుర్రపుస్వారీ, వ్యాయామం, సైనిక శిక్షణ ఇచ్చేవాడు. జమీందారు రాజా బహుదూర్‌ నాయని రంగారావు కోరిక మేరకు పత్తి మొక్కలలోని మేలు రకాలపై పరిశోధనలు చేశారు. జియాలజీలో పట్టభద్రుడైన అతను ఆంధ్రప్రదేశ్‌లో వజ్రాల తవ్వకాల్లో రికార్డు సృష్టించాడు. అందుకే ఆయన్ని 'డైమండ్‌ వెంకయ్య' అని కూడా అనేవారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత వెంకయ్య నెల్లూరులో స్థిరపడి నవరత్నాల మీద అనేక పరిశోధక వ్యాసాలు రాశాడు. వృద్ధాప్యంలో ఆర్థిక బాధలు ఆయనను చుట్టుముట్టాయి. మిలటరీలో పనిచేసినందుకు విజయవాడ చిట్టినగరులో ప్రభుత్వం ఇచ్చిన స్ధలంలో అతను చిన్న గుడిసె వేసుకొని జీవితాన్ని గడపవలసి వచ్చింది. 1963 జులై 4న వెంకయ్య మరణించారు.