
- సిపిఎస్ రద్దు చేసే వరకు పోరాటం : జెఎసి చైర్మన్
ప్రజాశక్తి - కర్నూలు కలెక్టరేట్ : ఉద్యోగులకు ప్రతినెలా జీతాలను చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఎపి ఉద్యోగ అమరావతి జెఎసి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. నవంబర్ నెల జీతాలు డిసెంబర్ పదో తారీకు వస్తున్నా ఇంకా అనేక మంది ఉద్యోగులకు వేతనాలు అందలేదని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి ఈ ప్రభుత్వం గండికొడుతోందన్నారు. ఎపి అమరావతి జెఎసి జిల్లా స్టీరింగ్ కమిటీ, ఎపి రెవెన్యూ ఉద్యోగుల సమావేశం గురువారం కర్నూలు కలెక్టరేట్లోని పొదుపు భవన్లో జరిగింది. సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగుల జీతాల కోసం అప్పులు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు చేయడం సరికాదన్నారు. ఉద్యోగుల వల్లనే సంక్షేమ పథకాలు, కార్యకలాపాలను నడుపుతున్నారని తెలిపారు. డిఎ ఎరియర్స్, జిపిఎఫ్ లోన్లు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ త్వరగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎస్‌ను రద్దు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకోలేదన్నారు. కొన్ని రాష్ట్రాలు సిపిఎస్‌ను రద్దు చేసుకుని ఒపిఎస్ విధానంలోకి వెళ్తే మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం టెక్నికల్ సమస్యలంటూ దాటవేయడం సరైనది కాదని విమర్శించారు. ఇచ్చిన హామీ మేరకు వెంటనే సిపిఎస్‌ను రద్దుచేసి ఒపిఎస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.