Jun 27,2022 07:51

సామాన్యునికి సార్వభౌమత్వాన్ని ప్రసాదించాలని ప్రయత్నించిన మానవతావాదం, వ్యక్తి స్వేచ్ఛను బలపరిచింది. శాస్త్రీయ దక్పథాన్ని పెంపొందించేందుకు యత్నించింది. సామాజిక అసమానతల్ని ఖండించింది. జాతీయ చైతన్య స్ఫూర్తిని కలిగించింది. దళితులకు, స్త్రీలకు, వెనుకబడిన వాళ్ళకూ ఆత్మ గౌరవాన్ని, అభ్యుదయాన్ని ఆకాంక్షించింది. ఆధునికాంధ్ర కవిత్వానికి ఆలంబనగా మారింది.
    'ముదితల్‌ నేర్వగరాని విద్యగలదే ముద్దారనేర్పించినన్‌' అనుకొన్న కందుకూరి స్త్రీజనోద్ధరణం; 'యెల్ల లోకములొక్కయిల్లై/ వర్ణభేదం లెల్ల కల్లై / వేలనెరుగని ప్రేమబంధము/ వేడుకలు కురియాలని' కాంక్షించిన గురజాడ సంస్కరణ తత్వం; ఆంధ్ర భాషా భిషక్కుల కృతక భాషా భేజజాన్ని దునుమాడిన గిడుగు పిడుగు నుడికారపు నేపథ్యాలలో, మానవతా స్పర్శతో సామాన్యున్ని మాన్యునిగా మలిచే ప్రయత్నం జరిగింది. ఆధునికాంధ్ర మానవతా కవిత్వానికి పదహారో శతాబ్దంలో ఐరోపాలో వెల్లివిరిసిన సాంస్క ృతిక పునరుజ్జీవనం, పందొమ్మిదో శతాబ్దంలో తెలుగు కవిత్వాన్ని జ్వలింపజేసిన పునరుజ్జీవన దృక్పథం మూలమైంది. విశ్వవిద్యాలయాల స్థాపన, ఆంగ్ల విద్య, పాశ్చాత్య సాహితీ పరిచయం, ప్రభావం, పత్రికలు, ప్రచురణా సౌలభ్యం, రవాణా సౌకర్యాలు మొదలైన అంశాలు ఆంధ్రుల ఆలోచనల్లో కొంగొత్త భావాలకు రూపునిచ్చాయి. ఊపునిచ్చాయి. శీఅశ్రీy a టతీవవ ఎaఅ, ఱ్‌ షaర ష్ట్రవశ్రీస / షaర ఱఅ ్‌ష్ట్రవ షశీఎజూశ్రీవa్‌వ రవఅరవ a ఎaఅ a్‌ aశ్రీశ్రీ, a రశ్రీaఙవ షaర శీఅశ్రీy ష్ట్రaశ్రీట a ఎaఅ అంటూ, తమ రచనల్లో స్వేచ్ఛా మానవత్వాన్ని ప్రతిష్ఠింపచేసుకొనేలా చేశాయి.
     సంఘ సంస్కరణానికి నడుం బిగించిన గురజాడ అప్పారావు తన నూత్న ఛందస్సు ముత్యాల సరాలతో - 'దేశమంటే మట్టికాదోరు/ దేశమంటే మనుషులోరు' అంటూ గిరులూ, తరులూ, నదీ నదాల మొదలైనవి దేశం కావు, దేశమంటే మనుషులు అంటూ సొబగుల వర్ణనల కంటే, సోదరుల సౌఖ్యమే ప్రధానమన్న వాస్తవాన్ని ఎలుగెత్తి చాటారు. 'చెట్టాపట్టాల్‌ పట్టుకొని దేశస్తులంతా నడవవలెనోరు/ అన్నదమ్ముల వలెను జాతి, మతములు మెలగవలెనోరు'' అంటూ జాతీయతా స్ఫూర్తిని కలిగించాడు. కులమతాలకతీతమైన మానవీయ సమాజాన్ని ఆకాంక్షిస్తూ, 'మంచి చెడ్డలు ఎంచి చూడగ/ మనుజులందున రెండు కులములు/ మంచియన్నది మాలయైతే / మాలనేనగుదున్‌' అంటూ గుణాధిక్యానికి పెద్దపీట వేశాడు. దైవాంశ సంభూతుడైన రాజో, ప్రభువో, రాయిరప్పలలో వెలసిన దేవుడో నాయకుడు కాదు, 'మానవమాత్రుడే' దైవం. అందుకే, 'ధనములు రెండు తెలుగులు/ ఒకటి మట్టిన బుట్టినది/ వేరొక్కటి మృత్కమలంపు సౌరభం' అంటూ హృదయ నైర్మల్యమున్న, 'నరుల చమటను తడసి మూలం/ ధనం పంటలు పండాలని' కాంక్షించాడు. స్వంతలాభం కొంత మానుకొని, పొరుగువాడికి తోడుపడమని, 'పూని యేద్కెనాను వొక మేల్‌/ కూర్చి జనులకు చూపవోయి' అంటూ మానవతా విలువల్ని తన కవిత్వంలో ప్రతిష్ఠించి, మానవత్వాన్ని, దేశభక్తిని చాటి చెప్పాడు.
కందుకూరి వీరేశలింగం స్త్రీల కష్టాలను తొలగించాలని కృషి చేస్తే గురజాడ స్త్రీల ఇష్టాల గురించి మాట్లాడాడు.
'మరులు ప్రేమని మది దలంచకు
మరులు మరలును వయసుతోడనె
మాయమర్మములేని నేస్తము
మగువలకు మగవారికొక్కటే
బ్రతుకు సుకముకు రాజమార్గము
ప్రేమ నిచ్చిన ప్రేమ వచ్చును
ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును' అంటూ నశ్వరమైన ఆకర్షణకు, శాశ్వతమైన ప్రేమకున్న వ్యత్యాసాన్ని హృదయంగమంగా వివరించాడు.
గురజాడ అప్పారావు, రాయప్రోలు సుబ్బారావులిద్దరూ స్త్రీల సౌభాగ్యం, సౌశీల్యం, స్వేచ్ఛ, సమానత్వాలను ఆకాంక్షించినవారే. ప్లేటో ప్రేమ సిద్ధాంతం కంటే ఒకమెట్టు పై నుంచి స్త్రీ, పురుషుల మధ్య ప్రేమ ఉదాత్తంగాను, సమాన ప్రతిపత్తితోనూ, తుచ్ఛమైన శారీరక సుఖాలకు దూరంగాను ఉండవచ్చునని ప్రతిపాదించి, తాను సంభావించే అమలిన శృంగారం ద్వారా స్త్రీలకు గౌరవాన్ని అందించినవాడు రాయప్రోలు.
'కనుల నొందొరులను జూచుకొనుట కన్న
మనసులన్యోన్య రంజనల్‌ గొనుటకన్న
కొసరి 'యేమోయి'యని పిల్చుకొనుటకన్న
చెలులకిలమీద నేమి కావలయు సఖుడ' అంటూ భోగలాలస కంటే, మనో వికారాలకు లోనుగాని, స్నేహ భావనలు గల 'తృణకంకణం' నాయికకు పెద్ద పీట వేయించాడు. 'స్నేహలత' కావ్యంలో వరకట్న దురాచారాన్ని నిరసించాడు.
స్వేచ్ఛను, స్వాతంత్య్రాన్ని కోరే తెలుగు కవిత్వం 'భరతఖండంబె యొక పెద్ద బందెఖాన' అంటూ మాతృభూమి శంఖలాలను తెంచటానికి వేగిరపడింది. 'నీచపు దాస్యవృత్తిలో మన నేరము' అంటూ కుండబద్దలు కొట్టింది. 'నాదు జాతి నా దేశము నాదు భాష అను అహంకార దర్శనమందుమాంధ్రులారా!' అంటూ రాయప్రోలు పలుకుల్తో ఆత్మాభిమానాన్ని ప్రదర్శించింది.
జాతీయోద్యమ కాలంలో సంఘ సంస్కరణ కవిత్వం సంఘంలోని సామాన్యుల, ఆర్తుల అవసరాలను గుర్తించి 'నా జాతి మానవజాతి' బతికితే స్వతంత్రుణ్నయి బతుకుతాను లేకపోతే ఉండనే ఉండను' అంటూ మామూలు మానవుణ్ణి మకుటధారిని చేసే ప్రయత్నం చేసింది. కందుకూరి, గురజాడ, త్రిపురనేని రామస్వామి చౌదరి వంటివారు ఈ మానవోద్యమానికి మూలపురుషులు కాగా; ఆ కోవలో దురాచార నిరసనం, వర్ణవ్యవస్థా నిరసనం, సంఘ వ్యవస్థా నిరసనం, అస్పృశ్యతా నివారణ కవిత్వం వెలువడింది.
'కల్లు త్రాగబోకు - కడుపు మాడ్చుకోకు
నీ యిల్లు గుల్ల సేయగోరి - తమ్ముడా!' అంటూ పిలుపు నిచ్చిన గరిమెళ్ళ సత్యనారాయణ గీతం, 'తిన్నాడో పస్తులే యున్నాడో ముప్రొద్దు/ గుడువ బెట్టును నీకు గడుపునిండ' అన్న కాటూరి కవిత్వం, 'మాలలు మాలలా! భరతమాత గళాస్థచిరత్న రత్నసం లాలిత మాల'లన్న బహ్మభట్ట పట్టాభిరామశర్మ పంచమోద్ధార కవిత్వం ఈ కోవలోనివే. మహాకవి గుఱ్ఱం జాషువా 'అనాథ', 'గబ్బిలము' దళిత సమస్యనే ప్రధానంగా వస్తువు చేసుకొన్న కావ్యాలు. స్వీయానుభవంతో దళితుల సమస్యలను ఆర్థిక కోణంలో కూడా దర్శించి, అన్యాయాలను ధిక్కరించి, 'నన్ను తొలగించి లెక్కించినారు గాని / తొలుత ఐదుగురమన్నదమ్ములము మేము' అని జాతీయతను ప్రకటించిన సహృదయ కవిత్వం జాషువాది. 'ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయించే దేశంలో పేదల, ఫకీరుల శూన్య పాత్రలలో మెతుకు విదల్చలేరు' అని వాపోయిన జాషువా, 'నరుని కష్టపెట్టి నారాయణున్ని' కొలవటంలోని ఔచిత్యాన్ని ప్రశ్నించాడు. ఇన్ని అన్యాయాలకు, అంటరానితనానికి లోనౌతూ ఉన్నా 'నిఖిల లోకమెట్లు నిర్ణయించినగాని తిరుగులేదు, నాకు తిరుగు లేదు, విశ్వనరుడ'నంటూ 'నేను' కవితలో మానవౌన్నత్యాన్ని చాటి చెప్పాడు.
'ఏ కులమంచు నన్ను వివరింపుల గూడినకుంటి ప్రశ్నలన్‌ వ్యాకుల పెట్టబోకుడదివ్యర్థ' మంటూ 'హృదయాకృతి జూచి సమాదరింపరే' యన్న బోయి భీమన్నది సంఘ సంస్కరణ కవిత్వంలో బలమైన గొంతుక. 'చదువులే లేని నాకు ప్రాజదువు లేడ' అని వాపోయినా, 'ఉర్వి నాగతి నా చేత నుండె నేని/ ముల్లుగా పుట్టి యందునా - పువ్వుగా కాక' అంటూ లోకహితాన్ని కోరిన మానవతావాది భీమన్న. ఆయన ఆశించేది - 'కులమత వర్ణ వర్గ విముక్తమైన/ విశ్వైక మానవతా మార్గం./ అరుణ తరుణ గుణ వరీయులకు/ ఆనంద రసాద్వైతం' అంటూ ఆర్థమతంలో అరమరికలు లేవంటాడు ఈ కవి.
జంధ్యాల పాపయ్య శాస్త్రి కలం నుంచి జాలువారిన -'లెమ్మిక మేలుకొమ్ము! కదలింపుము క్రాంతి రథమ్ము శాంతి మా/ ర్గమ్మున, కాంతి పుంజములఖండముల్కె నవజీవన ప్రభా/ తమ్ములు నింప, సర్వసమతా సుమకోమల మానవాంతరం/ గమ్ముల ప్రేమ సూత్రమున గట్టుము మంగళతోరణమ్ములన్‌' అన్న పద్యం భావయుగంలో సమతా పరిమళాల్ని వెదజల్లిన మానవతా కుసుమం. ప్రేమతో మానవతా సూత్రంతో, సర్వమానవాళిని ముడి వేయాలన్న ఆకాంక్ష ఇందులో వ్యక్తమౌతుంది.
వేంకట పార్వతీశ కవులు రచించిన పంచమాభివందనములోని -
'మమత దప్పిన యాతడు మాలగాక
మాటదప్పిన యతడు మాలగాక
అన్నెమును బున్నెమెఱుగని యట్టి మాల
మాలయే? దేవు మెడ బూలమాలగాక!' వంటి పద్యం అస్ప ృశ్యతానివారణకై గళమెత్తిన మానవతా విలువలున్న గీతం.
'కదిలేదీ, కదిలించేదీ
మారేదీ, మార్పించేదీ
పాడేదీ, పాడించేదీ
పెను నిద్దుర వదిలించేదీ
మునుముందుకు సాగించేదీ
పరిపూర్ణపు బ్రదుకిచ్చేదీ
కావాలోరు నవ కవనానికి' అంటూ అభ్యుదయ కవిత్వానికి బాటలు వేసిన శ్రీశ్రీ -
'నైలు నదీ నాగరికతలో/ సామాన్యుని జీవన మెట్టిది
తాజమహల్‌ నిర్మాణానికి/ రాళ్ళెత్తిన కూలీలెవ్వరు' అంటూ గనిలో, వనిలో, కార్ఖానాల్లో పరిశ్రమించే కర్షక, కార్మికుల ఘర్మ జలం కంటే విలువైనదేదీ లేదనటం మానవీయ విలువలకెత్తిన కేతనం.
'నూటికి యెనుబదియైదు/ మేటి కాపులుందు పుడమి
కూటికి బిచ్చము నెత్తుట/ లోటెకాదు సిగ్గు చేటు' అంటూ మానవ సమాజంలో తాండవమాడే పేదరికాన్ని సృష్టించిన వారిని నిరశించాడు కాళోజీ నారాయణరావు.
'ఆర్జించెడు వారు లేక/ ఆరగించువారుండిన
అమర తరువు కుబేరాస్తి/ ఆగలేవు అంతమొందు' అంటూ సోమరులను నిరసించాడు. 'శక్తిమంతులగు వారలు/ శక్తి వంచనంబు లేక/ శ్రమల కోర్చునాడు గాని/ జాతిధనం పెంపొందదు' అంటూ శ్రమైక జీవనంలో వ్యక్తి వృద్ధిని, జాతీయ సంపద సమృద్ధిని ఆకాంక్షించాడు..
'యాలరో ఈ మాదిగ బతుకు
ఎంత మొత్తుకున్నా దొరకదు మెతుకు' అన్న గద్దర్‌ గీతమైనా, 'ఆ రాత్రి పాలేరు వెంకన్న కలగన్నాడు/ తాను కడుపునిండా భోంచేశానని' అన్న శివసాగర్‌ కవితైనా పేదల నికృష్టపు జీవితాలను ప్రతిబింబించేవే.
'అందమైన దోపిడీకీ - పవిత్రమైన హింసకూ/ న్యాయమైన దాస్యానికీ - బలైపోతున్న' భారతీయ స్త్రీ గురించి తెలుగు కవిత్వం గొంతెత్తింది. బడుగుల బలహీనుల సమస్యలపై, సంఘర్షణపై ఎంతో బలమైన కవిత్వం వెలువడింది. మనిషిని ఉన్న దుర్భరస్థితిని మరింత ముందుకు చైతన్యవంతమైన, ప్రజాస్వామికమైన స్థితిలోకి తీసుకెళ్లే ప్రతి కవితా మానవీయ విలువలను ప్రతిఫలించేదే!
 

- డా.కల్లూరి ఆనందరావు