May 26,2023 12:55

ప్రజాశక్తి-వెదురుకుప్పం ( చిత్తూరు జిల్లా) : ఓ జవాను దేశాన్ని కాపాడే ప్రయత్నంలో సరిహద్దుల్లో ప్రాణాలను కోల్పోయాడు. ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని పట్టాగా ఇచ్చారు. ఆ భూమిలో బాధితురాలు చదును చేసి శక్తి ఉన్నంతకాలం సాగుబడి చేసింది. వృద్ధాప్యం మీద పడడంతో ఇంటి దగ్గరే ఉంటుంది. ఆక్రమణలకు గురికాకుండా ఉండేటందుకు రెవెన్యూవారు హద్దులు చూపిస్తే.. చుట్టు సర్వే రాళ్లను నాటుకొని కాపాడుకుంటాను అంటూ ... మండల సర్వేయర్‌ చుట్టూ ఆ వృద్ధురాలు తిరుగుతుంది. కానీ అధికారులు స్పందించలేదు.

చిత్తూరు జిల్లా ఆర్డీవో రేణుక ఆమెను చూసి చలించి, ఆమె మాటలు విని ముందుగా ఆ భూమిని సర్వే చేసి వారికి హద్దులు చూపాలని ఆదేశాలిచ్చారు. అయినా ఎలాంటి స్పందన లేదు. చివరకు ఆ వృద్ధురాలు విసుగుచెంది మీడియాను ఆశ్రయించింది. ఆ బాధితురాలి బాధను పాఠకులకు తెలిపే ప్రయత్నంలో ప్రజాశక్తి ఆ వివరాలను మీ ముందుకు తెచ్చింది.

                                               అధికారులు స్పందించకపోగా.. అవమానాలు : బాధితురాలు

చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలో వెదురుకుప్పం మండలం పాతగుంట పంచాయితీ, బలిజపల్లి హరిజనవాడలో ఉంది. గ్రామంలో దేవరాజ్‌ కుటుంబీకులు ఉంటున్నారు. ఇతను భారత సైన్యంలో సేవలందించారు. కాశ్మీర్‌ బోర్డర్లో దేశాన్ని కాపాడే ప్రయత్నంలో శత్రువుల దాడిలో జులై 7, 2019లో అమరుడయ్యారు. ప్రభుత్వ లాంఛనాలతో వారి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు వారి కుటుంబానికి మండలంలోని తార్లబైలు గ్రామంలో సర్వే నెంబర్‌ 493, డికెటి నెంబర్‌ 8/4/1414 లో విస్తీర్ణం సుమారుగా 500 ఎకరాలు భూమిని 16-8-2004న ఇచ్చారు. ఒంట్లో శక్తి ఉన్నన్ని రోజులు ఆ భూమి దేవరాజ్‌ భార్య పుష్పమ్మ సాగు చేసింది. వయస్సు మీద పడడంతో, గత కొంతకాలం బలిజపల్లి లోనే ఉంటుంది. ఈ భూమి ఇతరులు ఆక్రమించుకోకుండా ఉండేటందుకు ఆమె 11-6-2022 లో భూమిని సర్వే చేసి హద్దులు చూపాలని గ్రామ సచివాలయంలో చలానా కట్టింది. అప్పటినుంచి రెవిన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉంది. అధికారులు స్పందించకపోగా అవమానాలు తప్పడం లేదని ఆమె వాపోయింది.

బాధితురాలు పుష్పమ్మ మాట్లాడుతూ ... సర్వేయర్‌ సమస్య తీర్చకపోగా, లెక్క లేకుండా మాట్లాడుతుందని అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

'' నా సమస్య ఆమెకి చెప్పాను, సర్వే చేయించాలని సంవత్సరం రోజులుగా ఆమె చుట్టూ తిరుగుతున్నాను. ఆర్డీవో మేడం కూడా సమస్య పరిష్కరించాలని ఆమెకు సూచించారు. సర్వేయర్‌ భానుమతి ఆర్డిఓ మాటలు కూడా లెక్కచేయకుండా నన్ను దుర్భాషలాడుతోంది. మెడబెట్టి బయటికి గెంటిస్తా.. బయటికి పో.. అంటుంది. నాకు న్యాయం చేయండి.. న్యాయం చేయండి... '' అని ఆమె కంటతడిపెట్టారు.

image



బాధితురాలి కుమారుడు ఎలిజ మాట్లాడుతూ ... '' నేను కూడా బిఎస్‌ఎఫ్‌ కలకత్తా రేంజ్‌ లో పనిచేస్తున్నాను. ప్రభుత్వంవారు మా నాన్నకు కేటాయించిన భూమిని మాకు హద్దులు చూపించండి. న్యాయం చేయండి.. '' అని వేడుకున్నానని చెప్పారు.

654



వెదురుకుప్పం మండలం తహశీల్దార్‌ పుల్లారెడ్డి మాట్లాడుతూ ... వివరాలన్నీ బాధితులు తనతో చెప్పారనీ, సర్వేయర్‌ కు చెప్పామనీ, న్యాయం చేస్తామని అన్నారు.