
ప్రజాశక్తి - ఏలూరు:'భూమి మాదే.. పంట మాదే.. హక్కులు మాకే దక్కాలి' అని డిమాండ్ చేస్తూ ఎపి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన ఏలూరు కలెక్టరేట్ ఎదుట దెందులూరు మండలం దోసపాడు దళితులు, పేదలు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ మాట్లాడుతూ దోసపాడు పేదలు, దళితులు గత సంవత్సరం నుండి వారి భూముల కోసం పోరాడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం దుర్మార్గమని అన్నారు. పేదల హక్కులను కాలరాస్తూ, దళితుల చట్టాలను నీరుగారుస్తూ తీవ్రమైన అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దోసపాడు దళితుల సమస్యను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ దృష్టికి పలుసార్లు తీసుకెళ్లినా ఫలితంలేకుండా పోయిందన్నారు. 1965, 74లో దఫదఫాలుగా ప్రభుత్వాలు పేదలకు పట్టాలు, పాసుపుస్తకాలు మంజూరు చేశాయని తెలిపారు. ఆ రికార్డులు జిల్లా రెవెన్యూ శాఖాధికారుల అధీనంలో ఉన్నాయన్నారు. దోసపాడులో రెవెన్యూ రికార్డులను పరిశీలించాలని, రికార్డులను తారుమారు చేసిన రెవెన్యూ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, దళితులు, పేదలకు చెందిన అసైన్డ్, సీలింగ్ భూములను తక్షణమే వారికి అప్పగించాలని డిమాండ్ చేశారు. అక్రమంగా భూములను స్వాధీనం చేసుకుని అనుభవిస్తున్నారో వారిని అరెస్టు చేసి శిక్షించాలని, లేనిపక్షంలో ఈ నెల 10వ తేదీ నుండి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు సిహెచ్.జాన్‌రాజు, నాగేంద్ర, పవన్, మణి, బేబీ, తదితరులు పాల్గొన్నారు