Mar 18,2023 21:58

ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం : ఎన్‌టిఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలోని డాక్టర్‌ నార్ల తాతారావు థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (ఎన్‌టిటిపిఎస్‌)లో శనివారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు కాంట్రాక్టు కార్మికులు దుర్మరణం చెందారు. లిఫ్ట్‌ తెగిపడడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఎన్‌టిటిపిఎస్‌ స్టేజ్‌-5లోని 800 మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్‌ పనులను విజయవాడకు చెందిన పవర్‌ మిక్‌ కంపెనీ చేపట్టింది. ప్లాంట్‌ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ట్రయల్‌ రన్‌ కూడా వేశారు. ఇంకా మిగిలిన కొన్ని పనులను పూర్తి చేసేందుకు రోజువారి పనుల్లో భాగంగా ఎనిమిది మంది కాంట్రాక్ట్‌ కార్మికులు లిఫ్ట్‌లోపైకి వెళ్లారు. ఆరుగురు కార్మికులు మధ్యలో దిగిపోయారు. మిగిలిన ఇద్దరు లిఫ్ట్‌లో ఉన్నారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ లిఫ్ట్‌ తెగి ఒక్కసారిగా 70 అడుగుల ఎత్తు నుండి కింద పడింది. దీంతో, లిఫ్ట్‌లో ఉన్న జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన కాంట్రాక్టు కార్మికులు చోటా సింగ్‌ (23), జితేందర్‌ సింగ్‌ (24) అక్కడికక్కడే మృతి చెందారు. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పాతకాలం నాటి లిఫ్ట్‌ కావడంతో నాణ్యత లోపించి ఒక్కసారిగా తెగిపోయినట్లు సమాచారం.

  • మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున చెల్లించాలి : అఖిలపక్ష నేతల డిమాండ్‌

మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని అఖిలపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. సిపిఎం ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి డివి.కృష్ణ, సిఐటియు ఎన్‌టిఆర్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌.సిహెచ్‌.శ్రీనివాస్‌, జనసేన మైలవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి అక్కల గాంధీ, టిడిపి మండల నాయకులు తదితరులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎన్‌టిటిపిఎస్‌ చీఫ్‌ ఇంజినీర్‌తో మాట్లాడారు. ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌ వద్ద వెస్ట్‌జోన్‌ ఎసిపి హనుమంతరావుతో చర్చలు జరిపారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఎన్‌టిటిపిఎస్‌ యాజమాన్యాన్ని డిమాండ్‌ చేశారు.