Aug 08,2022 07:18

సాంబమూర్తికి మనుషులంటే వల్లమాలిన ప్రేమ. తన అమ్మ, నాన్న తనని విపరీతంగా ప్రేమించినట్టు ఈ కవి మనుషుల పట్ల గొప్ప ప్రేమను చూపిస్తాడు. జీవనోత్సాహాన్ని కలగంటున్నాడు. ఇతని వాక్యాలు మట్టిని చీల్చుతూ పైకి వస్తున్న విత్తనం పడే వేదనతో నిండి ఉంటారు. చెట్టు నుంఎతీ రాలుతున్న ఆకు కార్చే కన్నీటి చెమ్మ కనిపిస్తుంది. గుండె పొదుగు వట్టిపోయిన మనుషుల కోసం ఈ కవి, అడుగడుగునా వేదన చెందుతున్నాడు.
    నీడల్ని పెకళించుకుని/ శూన్యం ఊడ/ ఇళ్లలోకి ఎప్పుడు దిగబడిందో తెలీదు/ బయటకి ఇళ్ళన్ని ప్రశాంతంగా కనబడుతున్నా/ లోపల గదులు గదులుగా శూన్యం/ ఎప్పుడు విస్తరించిందో తెలీదు/
    'ఇప్పుడిక్కడ ఏ మనిషి హృదయంలోనూ మనం అనే ముడి ఖనిజపు నిల్వల్లేవు'' అనే వాక్యం రాయడానికి ఇతను ఎంత నైరాశ్యం పొంది ఉండాలి. ఈ సింథటిక్‌ భూగోళంలో ఇప్పుడు నడుస్తున్న వర్చువల్‌ ఋతువు గురించి సాంబమూర్తికి ఎరుక ఎక్కువ. అందుకే వదలి పోవాల్సిన చెదలు గురించి హెచ్చరిస్తున్నాడు. హృదయాల్లో నాటాల్సిన నారుమడి గురించి గుర్తు చేస్తున్నాడు. శకలాలుగా ఉన్న మనిషి ఏకమయ్యే క్షణాల్ని కోరుకుంటున్నాడు.
     కవిగా సాంబమూర్తి ప్రయాణం ఈ సంపుటితో స్థిరపడింది. అందుకోసం ఈ కవి ఏమి చేశాడు? విస్తృతంగా చదివాడు. నేటి సమాజాన్ని ఎలా చూడాలో, తాను చేసిన సమాజాన్ని పాఠకులకు ఎలా చూపాలో తెలుసుకున్నాడు. ఇతని వాక్యం శిక్షణ పొందిన ఉద్యమకారుని శ్వాసలా కనిపిస్తుంది. ''నువ్వెళ్ళిపోయాక కూడా/ నీ లోనుంచి తవ్వుకొనీ తవ్వుకొనీ/ ప్రపంచం తలపాగా చుట్టుకోవడానికి/ గుండెల మీద గర్వంగా ముద్రించుకోవడానికి/ నీవు పుట్టిన నేలలో/ నీదైన ఏదో నిధిని/ నువ్వు బతికున్నప్పుడే పాతిపెట్టాలి!'' సామూకి కవిత్వం అంటే మట్టి మీద రైతుకున్నంత ప్రేమ. చెట్టు మీద పిట్టకున్నంత అభిమానం. అతని వాక్యాలు అమ్మ వాసనవేస్తుంటారు. వాక్యాల్లో మానవత్వపు పరిమళం గుప్పుమంటుంది. రైతు వాసన వేస్తుంటారు.
     చాలా వేగంగా కవిత్వం కాగలడు. కానీ అదుపు ఉంటుంది. నిబ్బరం ఉంటుంది. సామూ నాకు పార్ట్‌ టైం కవిగా అనిపించడు. కార్మికుడిలా ఓవర్‌ టైం చేస్తాడు. ఎలా కవిత్వం చేయాలో తెలుసు. కవిత్వం అయ్యే సమయం తెలుసు. ఆ సందర్భాల్లో అతను తీక్షణంగా ఉంటాడు. మెతుకు ఉడికినట్టు ఉంటాడు. అల్లకల్లోలంగా ఉంటాడు. ఇలా చెప్పడానికి ఈ సంపుటిలో అనేక ఆధారాలున్నాయి. కవిత్వ నిర్మాణం, నడక చూస్తే ముచ్చటగా ఉంది. అతను రూపకాలు, ఉపమాలు అరువు తెచ్చుకోలేదు. తెలిసిన దాని నుండి తెలియని వైపు తీసుకుపోవడం, కొన్ని సూత్రాల నుండి సాధారణీకరించడం ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
'ఎప్పుడోసారి/ నులకమంచం వదులైపోయినట్టు/ జీవితాలు కూడా వదులైపోయి/ మనం తాళ్ళు తాళ్ళుగా వేరుపడ్డామని గుర్తిస్తాం'
'ఆక్టోపస్‌లా శూన్యం/ ఎనిమిది దిక్కుల నుంచీ చుట్టేస్తుంది'
'అపనమ్మకం కొండచిలువలా వచ్చి/ మనమధ్య కూర్చుంటుంది'
'ముదిరిన వడ్లగింజలా నవ్వేవాడు/ వానా కాలం ముసురుకు నిండిన
పెద్ద కాలువలా తృప్తిగా నవ్వేవాడు'
పైన నేను చెప్పిన ప్రతిపాదించిన కొన్ని ప్రకటనలకు ఇవి కొన్ని సాక్ష్యాలు. సామూ తాజాగా ఉన్నాడు. వెన్ను తీసి నవ్వుతున్న పైరులా ఉన్నాడు. సారవంతమైన సమాజాన్ని ఆశిస్తున్నాడు.
    రాసిన వాక్యం ఎంతవరకు విజయవంతం అవుతుంది అనేది, పాఠకుని ఆలోచనలపై, ఊహలపై అది కలిగించే ప్రభావం మీద ఆధారపడి కూడా ఉంటుంది. క్రియాశీలకం అయిన పాఠకుడు కొంత అలవాటు పడి ఉంటాడు. కొంత ఊహించగలడు. వాక్యాన్ని పూరించగలడు. ఈనాటి కవి దాన్ని బ్రేక్‌ చేయగలగాలి. పాఠకుని ఊహాల్ని, ఆలోచనల్ని సరిగ్గా ప్రతిబింబించగలగాలి. లేదా అతని ఊహించలేని విషయాన్ని చెప్పగలగాలి. అందరికి కొన్ని సామాన్యంగా ఎదురయ్యే అనుభవాలు ఉంటాయి. ఇల్లు కట్టుకోవడం, నిద్రలేచే ఊరు, స్నేహితుల నుంచి దూరం కావడం ఇలాంటివి కొన్ని అనుభవాలు ఉంటాయి. ఇలాంటి వస్తువులపై కవిత రాసినప్పుడు, చదివిన పాఠకుడు కూడా ఓహ్ కవి నా అంతరంగాన్ని ఎలా పట్టుకున్నాడు! అచ్చు నా లాంటి ఆలోచనలు ఉన్నాయి అని సంబరపడాలి. లేదా అసలు పాఠకుడు ఏ రకం గానూ ఊహించలేని విషయాన్ని చెప్పటం ద్వారా కవిత ఆనందాన్ని కలిగించాలి. ఈ సంపుటిలో.. 'మొలకెత్తుతున్న ఇల్లు' అనే కవిత అందరి జీవితాలకు పరిచయం ఉండే వస్తువు. సొంతింటి కల నిజమయ్యే క్షణాలు కోసం ఎదురుచూసే అనుభవం ఎలా ఉంటుందో అందరికి తెలుసు.
     'పునాది పడ్డ మంటే/ దున్ని చదును చేసిన పొలంలో/ విత్తులు వేసినట్టే/ గోడలు మొలుస్తుంటే/ చినుకు కడుపులో/ ఇంద్రధనస్సు పడ్డట్టే..' ఈ కవిత ఇలా మొదలై, ప్రసూతి గది ముందు పచార్లు చేసే భర్త ఆలోచనల వరకు వెళ్తుంది. ఆ నీడ కింద వాలే పిట్టలు, ఎగరబోయే తూనీగలు, గోడల మీద పువ్వులను చూసి అతుక్కునే సీతాకోకచిలుకలు ఇలా కవి చేసే ఊహలు, పాఠకుడి ఊహాల్ని దాటి ఉంటాయి. కిటికల్ని సున్నితంగా తెరవండి/ నా కనురెప్పల్ని కర్టెన్లుగా వేసుంచాను' అనడం ద్వారా కవి హృదయం తెలుస్తుంది.
    ఏది ఉత్తమ కవిత్వం, ఏది కాదు అనే విషయం మీద చర్చ ఇప్పటిది కాదు. దీనిని కవికి, పాఠకుడికి మధ్య కుదిరే లంకె మీద, వారి వారి అనుభవాల మీద ఆధారపడి నిర్ణయించుకోవాల్సిందే. కవి చూపు వెంట పాఠకుడు నడవాలి. ఆ చూపు కాంతి వంతంగా ఉండాలి. గుండెల్లో వెలుగు ప్రసరించాలి. పాఠకుడికి కవి దగ్గర కావాలి. అప్పుడు ఇద్దరికీ తృప్తి కలుగుతుంది. 'నాలుగు రెక్కల పిట్ట'లో కవిత్వం అలాంటి తృప్తిని కలిగిస్తుంది.
మెతక రంగుపూలు, వంకరచెట్ల అడవి లాంటి కవితల ద్వారా సామూ ఒక సామాజిక చైతన్యాన్ని ఆశిస్తున్నాడు. వెలుతురు కలలు కూడా ఇదే చెప్తుంది. సామూ శత్రువుని గుర్తు పడుతున్నాడు. చూపిస్తున్నాడు. గెలవడానికి మార్గం వెతుకుతున్నాడు. తన ప్రాంతం గుండె అవుతున్నాడు. అక్కడి విధ్వంసాన్ని ఎలుగెత్తి చెప్తున్నాడు. రైతు ఉద్యమ నేపథ్యంలో రాసిన కవితలు బాగున్నాయి.
    సామూ వాక్యనిర్మాణంపై నాకు కొంత అసంతృప్తి ఉంది. కొన్ని వాక్యాలు విరిచి కింద పేర్చినట్టుగా అనిపిస్తున్నారు. పదాలు అవే రిపీట్‌ అవుతున్నట్టు ఉన్నాయి. అలాగే కొన్ని చోట్ల కవితలోకి వెంటనే పోలేని స్థితి కూడా నేను అనుభవించాను. ఐతే మరింత మంచి మనిషి కోసం, మరింత మంచి కాలం కోసం, మరింత మంచి సమాజం కోసం పదే పదే తపన పడే కవికి ఇవి పెద్ద లోపాలు ఏమీ కావు.
    సామూ కవిత్వాన్ని అందరూ చదవాలి. చదివి, మనం చెప్పే నాలుగు మాటలు అతనికి మరి కొన్ని రెక్కలిస్తారు. పుస్తకం కోసం 96427 32008 నెంబర్‌లో కవిని సంప్రదించండి. ఈ పుస్తకంలో అనేక వాక్యాలు గురించి ఇంకా చెప్పొచ్చు. సామూ అనుక్షణం కవిత్వం ఐపోతాడు. అతని తీక్షణమైన చూపుల్లో వాక్యాలు తిరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు విరామం కూడా కవిని శక్తివంతుణ్ణి చేస్తుంది. ఖాళీ కనబడిన చోటల్లా అక్షరాల్ని నాటుతున్న సామూకి అభినందనలు.
 

- డా. సుంకర గోపాల్‌
94926 38547