
న్యూఢిల్లీ : దేశంలో పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయమతున్నాయి. దీంతో రోడ్లపై ఉన్న గుంతలు, మ్యాన్‌హోల్స్, మురుగు కాల్వలు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇదే పరిస్థితి యుపిలో నెలకొంది. అలీఘర్‌లో వర్షాలకు వరద నీరు గుంతలు, మురుగు కాల్వలకు చేరగా.. అందులో పడి తృటిలో తప్పించుకున్నారు ఓ పోలీసు ఆయన భార్య. ఆలీఘర్‌లోని ఓ ఆసుపత్రికి ద్విచక్ర వాహనంపై వెళుతున్న పోలీసు,ఆయన భార్యకు నీటితో నిండిన మురుగు కాలువ కనిపించలేదు. రోడ్డు అనుకుని ముందుకు వెళ్లగా వాహనంతో పాటు అందులో పడిపోయారు. అక్కడే ఉన్న స్థానికులు వారిని నీటిలో నుండి బయట పడేందుకు సాయం చేయడంతో ప్రాణాపాయం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. వర్షపు నీటితో నిండిన డ్రెయిన్ కనిపించకపోవడంతో అందులో పడిపోయామని, స్వల్పంగా గాయపడినట్లు దయానంద్ అనే పోలీసు అధికారి పేర్కొన్నారు. దీనిపై రిటైర్డ్ ఐఎఎస్ అధికారి సూర్యప్రతాప్ ట్విట్టర్లో స్పందించారు. 'యుపిలోని అలీఘర్ స్మార్ట్ సిటీ. ఎవ్వరికీ కృతజ్ఞతలు చెప్పాలి' అంటూ యోగి సర్కార్ గొప్పగా చెప్పుకుంటున్న స్మార్ట్ సిటీపై ఎద్దేవా చేశారు.