Oct 02,2022 06:47

వ్యవసాయం తరువాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే రంగం చేనేత. స్వాతంత్య్రం అనంతరం పాలకులు అవలంబించిన చేనేత వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల విధానాల వలన చేనేత పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకున్నది. ఇప్పటికి దేశవ్యాపితంగా 34 లక్షల మగ్గాలు పని చేస్తున్నాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. దీనిపై ఆధారపడిన ఉప వృత్తులవారు మరో 40 లక్షల మంది వరకు ఉన్నారు. వారి జీవనోపాధికి చర్యలు తీసుకోవాల్సిన పాలక వర్గాలు అదేమీ చేయకపోగా వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి.
రాష్ట్రంలో ఇప్పటికి పనిచేస్తున్న 2 లక్షల మగ్గాలు, ఉపవృత్తుల మీద 4 లక్షల మంది జీవిస్తున్నారు. సహకార రంగంలో చేనేత కార్మికులకు నూటికి 5 శాతం మించి పని దొరకటం లేదు. మిగతా వారంతా ప్రయివేటు రంగంలోని మాస్టర్‌ వీవర్ల దగ్గర పనిచేస్తున్నారు. వీరికి కనీస వేతన (మజూరి) చట్టం లేదు. చేసిన పనికి తగిన ఫలితం ఉండదు. మార్కెట్లో పెరిగిన ధరలకు అనుగుణంగా వస్తున్న మజూరి చాలక అర్థాకలితో కాలం గడుపుతూ, కొంత మంది ఆకలి చావులకు గురవుతున్నారు. కొంతమంది అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
వై.ఎస్‌.ఆర్‌.సి.పి అధికారంలోకి వస్తే సంవత్సరానికి బడ్జెట్లో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తానని, నేతన్నలకు పక్కా ఇళ్ళు ఉచితంగా నిర్మించి ఇస్తానని నూట యాభై యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తానని...2019లో ఎన్నారై 'వై' జంక్షన్‌ వద్ద జగన్‌ మోహన్‌ రెడ్డి ఒకరోజు నిరాహారదీక్ష జరిపి మరీ వాగ్దానం చేశారు. కాని అధికారానికి వచ్చిన తరువాత బడ్జెట్లో నిధులు కేటాయించకుండా మాట తప్పారు. వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం కింద ప్రతి చేనేత కార్మికునికి సంవత్సరానికి 24 వేల రూపాయలు ఇస్తానని చెప్పారు. చేనేత కార్మికులు సంతోషించారు. కాని ఆచరణలో స్వంత ఇంట్లో మగ్గం ఉన్న వారికి మాత్రమే ఈ స్కీము అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో 2 లక్షల మగ్గాలుండగా కేవలం 81 వేల మందికి మాత్రమే ఈ పథకం అమలు జరుపుతున్నారు. మిగతా లక్షా ఇరవై వేల మందికి స్వంత ఇల్లు, మగ్గం లేదని ఈ పథకం అమలు జరపటం లేదు. 2022-23 రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్‌ లో చేనేతకు కేవలం రెండు వందల కోట్లు మాత్రమే కేటాయిస్తూ అవి కూడా నేతన్న నేస్తం వారికి మాత్రమే అని ప్రకటించారు. అంటే 81 వేల మందికి రూ.24 వేల చొప్పున రూ.196 కోట్లు అవుతాయి. మిగిలిన రూ.4 కోట్లు చేనేతలో ఉన్న ఉద్యోగుల జీతాలకు సరిపోతాయి. చేనేత సంక్షేమానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.
రాష్ట్రంలో సహకార సంఘాల వద్ద ఆప్కో ద్వారా కొనుగోలు చేసిన వస్త్రాలకు 2019 నుండి డబ్బు చెల్లించడంలేదు. నాబార్డు వద్ద తీసుకున్న అప్పుకు 13 శాతం వడ్డీ చెల్లించాల్సి రావడంతో సహకార సంఘాలు దివాళా తీసే పరిస్థితికి నెట్టబడుతున్నాయి. ఈ సంఘాలలోని వారికి త్రిప్టు ఫండు, పావలా వడ్డీ, యారన్‌ సబ్సిడీ రిబేటు కింద రూ.70 కోట్ల బకాయి ఉన్నది. అది చెల్లించకపోవడంతో సహకార సంఘాలలో నేత నేస్తున్న చేనేత కార్మికులకు పని చూపించడం లేదు. దాంతో వీరు ఇతర వృత్తులు చూసుకోవలసిన పరిస్థితి దాపురించింది.
తాము అధికారంలోకి వస్తే చేనేత రంగానికి సంవత్సరానికి ఐదు వేల కోట్లు కేటాయిస్తామని బిజెపి నేతలు పార్లమెంటు సాక్షిగా చెప్పారు. కాని 2014లో అధికారానికి వచ్చిన నాటి నుండి (2014లో 621 కోట్లు, 2015లో 486 కోట్లు, 2016లో 710 కోట్లు, 2017లో 604 కోట్లు, 2018లో 396 కోట్లు, 2019లో 456 కోట్లు, 2020లో 344 కోట్లు 2021లో 475 కోట్లు 2022లో 200 కోట్లు) మొత్తం రూ.4292 కోట్లు మాత్రమే కేటాయించారు. మొత్తం 9 సంవత్సరాలకు కలిపి కూడా ఐదు వేల కోట్లు కూడా కేటాయించలేదు. వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్నపుడు సత్యం కమిటి వేసి చేనేతకు అవసరమైన చిలపనూలు (యాంక్‌ యారన్‌) తయారు చేయరాదని నిర్ణయించి చేనేతను చావుదెబ్బ తీశారు. ఆనాడు చేనేతవర్గం దేశవ్యాపిత ఆందోళనలు జరిపింది. ఇప్పుడు నరేంద్రమోడీ అధికారానికి రాగానే మద్రాసులో ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం రోజున మాట్లాడుతూ చేనేతకు కావాల్సిన అన్ని రకాల సహకారం ఇస్తామని, తమది స్వదేశీ విధానమని, ఆ విధానంలో చేనేతకు ప్రాధాన్యత ఉంటుందని ప్రకటించారు. కాని ఆచరణలో చూస్తే చేనేతను ధ్వంసం చేసే విధానాలు అమలు జరుపుతున్నారు.
2017లో చేనేత వస్త్రాలపై 5 శాతం జి.ఎస్‌.టి. పన్ను వేయడంతో చేనేత సంక్షోభంలో చిక్కుకున్నది. నూలు, రంగులు, రసాయనాలపై ఈ జి.ఎస్‌.టి. వేయడంతో నూటికి 40 శాతం దాకా ధరలు పెరిగాయి. ఈ ధరల పెరుగుదల వల్ల చేనేతరంగం సంక్షోభంలో చిక్కుకున్నది. మరొకపక్క చేనేతకు కేటాయించిన 11 రకాల వస్త్రాలు పవర్‌లూమ్‌ మగ్గాలపై తయారవుతున్నాయి. వీటిని అరికట్టడానికి చర్యలు తీసుకోకపోగా పవర్‌లూమ్‌ యజమానులను ప్రోత్సహిస్తూ వారికి వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నది. అదే విధంగా చేనేత కార్మికులకు ఇన్సూరెన్సు స్కీము ఉండేది. చేనేత కార్మికుడు 59 సంవత్సరాలకు చనిపోతే (సంవత్సరానికి 80 రూపాయలు చెల్లిస్తే మహాత్మాగాంధి బునకర్‌ యోజన బీమా స్కీము ద్వారా) 60 వేల రూపాయలు చెల్లించేవారు. మృతుని కుటుంబంలో ఇద్దరు పిల్లలకు 9 నుండి ఇంటర్‌ వరకు సంవత్సరానికి రూ. పన్నెండు వందలు స్కాలర్‌షిప్‌ ఇచ్చేవారు. అదే విధంగా ఐసిఐసిఐ లాంబార్డు స్కీము కింద ఆరోగ్య బీమా కార్డు ఉండేది. తద్వారా సంవత్సరానికి రూ. ముప్పయి వేల వైద్యం చేయించుకునే అవకాశం ఉండేది. ఈ రెంటిని 2018 మార్చి 30వ తేదీన రద్దు చేసి చేనేత కార్మికులకు తీరని అన్యాయం చేసింది బి.జె.పి. ప్రభుత్వం.
చేనేతకు మరణశాసనం రాసే విధంగా... పట్టు, జరీ ధర 2022లో రూ. 4 వేల నుండి రూ. 8 వేలకు పెరిగింది. నూలు రంగులు, రసాయనాల ధరలు రూ. 1800 నుండి రూ. 3500కు పెరిగాయి. ఈ ధరల పెరుగుదల వల్ల చేనేత వస్త్రాలు ఉత్పత్తి చేయలేక మగ్గాలు మూత వేసే పరిస్థితి వస్తున్నది. దాంతో చేనేత కార్మికులు పనులు లేక ఆకలి చావులు, ఆత్మహత్యలు సంభవించే ప్రమాదం వున్నది. ఇది చాలదన్నట్లు చేనేత జిఎస్‌టిని 12 శాతానికి పెంచేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. చేనేతను చావుదెబ్బ తీస్తున్న పవర్‌లూమ్‌ వస్త్రాలపై...18 శాతం ఉన్న జిఎసీటిని 12 శాతానికి తగ్గించింది. ఈ తగ్గుదలతో పవర్‌లూమ్‌ వస్త్రాలు మార్కెట్లో తక్కువ ధరకు వస్తాయి. దానితో పోటీ పడలేక చేనేత రంగం పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నది. కనుక జి.ఎస్‌.టి. పూర్తిగా రద్దు చెయ్యాలి. పట్టు జరి, నూలు రంగులు, రసాయనాలను 2021 అక్టోబరు నాటి ధరలకు అందించాల్సిన అవసరం ఉన్నది. చేనేతకు కేటాయించిన 11 రకాల రిజర్వేషన్‌ వస్త్రాలను పవర్‌లూమ్‌ మగ్గాలపై తయారు చేయకుండా చర్యలు తీసుకోవాలి. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
ఆప్కో ద్వారా చేనేత సహకార సంఘాల వద్ద తయారయిన వస్త్రాలు కొనుగోలు చేయాల్సిన ఆప్కో చిత్తూరు జిల్లా నగరి పట్టణంలో పవర్‌లూమ్‌ వస్త్రాలు కొనుగోలు చేయటం చూస్తుంటే జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేనేతను పూర్తిగా ధ్వంసం చేయటానికి పూనుకొన్నట్లు అర్థమవుతుంది. జి.ఎస్‌.టి.ని పూర్తిగా రద్దుచేయాలి. పట్టు, జరీ నూలు రంగులు ధరలు తగ్గించాలని చేనేత పరిరక్షణకు తగు చర్యలు తీసుకోవాలని బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం రూ. 25 వేల కోట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం రూ.2500 కోట్లు కేటాయించాలని చేనేత కార్మిక సంఘాలు, మాస్టర్‌ వీవర్లు, చేనేత శ్రేయోభిలాషులు ఎన్నో సార్లు ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేకపోయింది. పైగా చేనేతను ధ్వంసం చేసేలా పవర్‌లూమ్‌ మగ్గాలను ప్రోత్సహిస్తున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా చేనేత రక్షణకు కేరళ రాష్ట్రం మాదిరిగా వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేసి సహకార రంగాన్ని పటిష్ట పర్చాలి. కార్మికులందరిని సహకార రంగంలోనికి తీసుకువచ్చి చేనేత రంగాన్ని రక్షించి, చేనేత కార్మికుల జీవితాల మెరుగుదలకు చర్యలు చేపట్టాలి.

 వ్యాసకర్త : ఎ.పి. చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ

సెల్‌ : 9490391865 /