Nov 25,2022 09:25
  • నేటి తరానికి స్ఫూర్తి సుర్జీత్‌ స్కూలు
  • వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పసితనంలో జాతీయోద్యమ స్ఫూర్తితో ఉద్యమాల్లో అడుగుపెట్టిన హరికిషన్‌సింగ్‌ సుర్జీత్‌ను బహిష్కరించిన పాఠశాల నేడు ఆయన పేరుతో నడుస్తోంది. పంజాబ్‌ రాష్ట్రం జలంధర్‌ జిల్లా బండాల గ్రామంలో స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఒక పాఠశాల ఉండేది. సుర్జీత్‌ విద్యాభ్యాసం చేసిన ఆ పాఠశాలను వ్యవసాయ కార్మిక సంఘం అఖిలభారత బృందం, సిపిఎం నాయకులు తాజాగా సందర్శించారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటున్నారని సుర్జీత్‌ను బండాలా స్కూలు బహిష్కరించింది. నేడు అదే స్కూలుకు ఆయన నామకరణం చేసి ఆయన జ్ఞాపకాలన్నిటినీ నేటి విద్యార్థి లోకానికి తెలియజేసి, స్ఫూర్తిని రగిలింపజేయడం సంతోషకరమైన విషయమని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌ అన్నారు.
        జాతీయ ఉద్యమంలోకి విద్యార్థులందరినీ సమీకరించేందుకు ఆ స్కూల్‌ బెల్లును సుర్జీత్‌ వినియోగించేవారని చెప్పారు. భగత్‌ సింగ్‌ స్ఫూర్తితో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పని చేశారని గుర్తు చేశారు. 1982లో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఏర్పడేందుకు చొరవ తీసుకున్నారని, చివరి వరకు ఆ సంఘం జాతీయ కమిటీలో పని చేశారని తెలిపారు. స్వాతంత్య్రం అంటే స్వదేశీయుల పాలనతోపాటు అందరికీ సమానత్వం, సామాజిక న్యాయం, సమాన హక్కులు సాధించబడాలని కోరుకున్నారని చెప్పారు. వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం కావాలని ఆయన పార్లమెంట్లో ప్రైవేట్‌ బిల్లును పెట్టారని, నేటికీ పాలకులు చట్టం చేయకపోవడం విచారకరమని అన్నారు. జాతీయ ఉద్యమం పిలుపు మేరకు భగత్‌ సింగ్‌ మొదటి వర్ధంతిని జరిపిన తొలి వ్యక్తిగా సుర్జీత్‌ చరిత్రపుటల్లో నిలుస్తారని తెలిపారు. బండాల స్కూలు విద్యార్థుల్లో సుర్జీత్‌తోపాటు పంజాబ్‌ సిఎంగా పనిచేసిన సర్దార్‌ దర్శన్‌ సింగ్‌ తదితరులు ఉన్నారని, వారి పేర్లు స్కూలు గోడపై చెక్కారని చెప్పారు. గత ఏడాది సుర్జీత్‌ పేరుతో ఆ రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. పంజాబ్‌ పర్యటనలో భాగంగా సుర్జీత్‌ సొంత గ్రామంలో పర్యటించడం గొప్ప అనుభూతినిచ్చిందని వెంకట్‌ అన్నారు. వ్యవసాయ కార్మిక ఉద్యమాన్ని మరింత అభివృద్ధి చేయడం, హిందుత్వ కార్పొరేట్‌ శక్తులను ఓడించడమే సుర్జీత్‌కు అర్పించే నివాళి అని అన్నారు. ప్రమాదానికి గురైన సుర్జీత్‌ కుమారుడు గురు చరణ్‌ సింగ్‌ బాచిని పరామర్శించినట్లు వెంకట్‌ తెలిపారు.