May 26,2023 08:40
  • సబ్సిడీ సీడ్‌ కొనుగోలు అప్పుడే
  • ఖరీఫ్‌ పెట్టుబడుల్లేని సీమ రైతాంగం

 

  • వేరుశనగ రిజిస్ట్రేషన్లు పది శాతం లోపే
  • సేకరణలో కొనసాగుతున్న జాప్యం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ఖరీఫ్‌ ముంగిట ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా కిస్తు బ్యాంక్‌ అకౌంట్‌లో జమ పడితేనేగాని సబ్సిడీ వేరుశనగ విత్తనాలను కొనుగోలు చేయలేని పరిస్థితి రాయలసీమ రైతాంగానిది. ఈ తడవ 'భరోసా' ఆలస్యమవుతుండటంతో రాయితీ విత్తనాలకు రైతులు ముందస్తు రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు ముందుకురావట్లేదు. సబ్సిడీ విత్తనాల కోసం రైతు భరోసా (ఆర్‌బికె) కేంద్రాల్లో డి-క్రిషి యాప్‌లో ఈ నెల 15 నుంచి నమోదుల ప్రక్రియ ప్రారంభించగా ఇప్పటికి 5 నుంచి 10 శాతం లోపు రైతులే తమ పేర్లను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. సబ్సిడీ విత్తనాలు పొందాలంటే రైతులు ముందు సబ్సిడీయేతర అమౌంట్‌ను ఆర్‌బికెలలో చెల్లించాలి. ప్రభుత్వం నిర్ణయించిన అమ్మకపు ధరలో 40 శాతం సర్కారు రాయితీ ఇస్తుండగా మిగతా 60 శాతాన్నీ రైతులు ముందే చెల్లించాలి. విత్తనాల పంపిణీ మొదలయ్యాక విత్తనాలను రైతులకు చేరుస్తారు. విత్తనం అందడానికి వారం, రెండు వారాల ముందే సబ్సిడీయేతర పైకం చెల్లించాల్సి రావడంతో రైతులు రిజిస్ట్రేషన్ల జోలికి పోవట్లేదు. చేతిలో డబ్బుల్లేక ప్రభుత్వం ఇచ్చే భరోసా సొమ్ము జమ పడ్డప్పుడు చూసుకుందాం అన్నట్లున్నారు. యంత్రాంగం కూడా ప్రభుత్వం ఎప్పుడు 'భరోసా' విడుదల చేస్తుందా ఎప్పుడెప్పుడు రాయితీ విత్తనాలు సేల్‌ చేద్దామా అని ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా ఖరీఫ్‌ ముందు ఇచ్చే భరోసాను మే మూడు, నాలుగు వారాల్లో ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఈమారు కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. జూన్‌ మొదటి వారంలో జమ చేయొచ్చని అంచనా వేస్తున్నారు.
 

                                                                         పక్కాగానే...

ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్‌ పెట్టుబడుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తొలి కిస్తు కింద రైతులకు రూ.5,500 జమ చేస్తోంది. రైతులకు ఈ ఏడాది గరిష్టంగా మూడు మూటల ( మూట 30 కిలోల వంతున 90 కిలోలు) వేరుశనగ విత్తనం సబ్సిడీపై అందించాలని నిర్ణయించింది. సర్కారీ రాయితీ పోను మూడు మూటలకూ కలిపి రైతులు రూ.5,022 చెల్లించాలి. ప్రభుత్వం ఇచ్చే భరోసా కిస్తు, రైతు విత్తనం కోసం చెల్లించే సబ్సిడీయేతర సొమ్ము దాదాపు సరిపోతుంది. సబ్సిడీ విత్తనాలు రైతులు పొందేందుకు అనుగుణంగా సర్కారు డిజైన్‌ చేసిందని, భరోసా జమ పడిన వెంటనే సబ్సిడీ విత్తనాల రిజిస్ట్రేషన్లు ఊపందుకుంటాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. వేరుశనగ సాగు పట్ల రైతుల్లో అనాసక్తి ఉన్నా భరోసా జమ పడితే సబ్సిడీ విత్తనాల అమ్మకాలు పెరుగుతాయంటున్నారు.
 

                                                                   నెమ్మదిగా ప్రొక్యూర్‌మెంట్‌

వేరుశనగ విత్తన సేకరణలో జాప్యం కొనసాగుతూనే ఉంది. రైతుల రిజస్ట్రేషన్లు ఊపందుకోనందున సేకరణ కూడా మందకొడిగా జరుగుతోంది. సేకరణ లక్ష్యం 2.92 లక్షల క్వింటాళ్లు. టార్గెట్‌లో ఇప్పటికి 50 శాతం వరకు సేకరించారని, అందులోనూ ప్రాసెసింగ్‌ దశలోనే ఎక్కువుందని సమాచారం. ఉమ్మడి అనంతపురం జిల్లాకు 1.88 లక్షల క్వింటాళ్లకుగాను అతికష్టం మీద లక్ష క్వింటాళ్లు సేకరించారు. మిగతా జిల్లాల్లో సేకరణ ఇంకా నెమ్మదిగా ఉంది.