Jan 31,2023 18:47

పాప్‌ కింగ్‌ మైఖేల్‌ జాక్సన్‌ జీవితం ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. మైఖేల్‌ ప్రధాన పాత్రలో ఆయన మేనల్లుడు జాఫర్‌ నటిస్తున్నారు. ఈ విషయాన్ని జీకే స్టూడియోస్‌ తెలిపింది. ఈ చిత్రానికి ఆంటోయిన్‌ ఫుక్వా దర్శకత్వం వహించనున్నారు. గ్రాహం కింగ్‌ నిర్మాతగా వ్యవహరించనున్నారు. జాఫర్‌ చాలా కాలంగా మైఖేల్‌ పాత్ర కోసం సిద్ధమవుతున్నాడు. ఇందుకు సంబంధించి జాఫర్‌ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోను జీకే ఫిల్మ్స్‌ షేర్‌ చేసింది. మైఖేల్‌ జాక్సన్‌ ఎస్టేట్‌ కో ఎగ్జిక్యూటర్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ లాయర్‌ అయిన జాన్‌ బ్రాంకా.. మైఖేల్‌ బయోపిక్‌లో ప్రధాన పాత్రను ఆయన మేనల్లుడు జాఫర్‌ పోషిస్తున్నట్లు వెల్లడించే వీడియోను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. మైఖేల్‌ జాక్సన్‌తో జాఫర్‌కు ప్రత్యేక అనుబంధం ఉన్నదని ఆయన చెప్పారు. చిన్న వయసు నుంచే మైఖేల్‌ను ఫాలో అవుతున్నందున వాకింగ్‌ స్టైల్‌ ఒక్కటే కాకుండా వాయిస్‌ కూడా అచ్చం మైఖేల్‌ని పోలి ఉంటుందన్నారు. ఈ పాత్ర కోసం జాఫర్‌ గత 6 నెలలుగా కష్టపడుతున్నాడని బ్రాంకా ఆ వీడియోలో వెల్లడించారు.