Jan 31,2023 20:45
  •  విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖపట్నం) : వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, టిటిడి చైర్మన్‌ వైవి.సుబ్బారెడ్డి ఉక్కు ప్రజా గర్జన సభ వేదికపై చెప్పిన మాటలను రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కోరింది. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో తలపెట్టిన రిలే దీక్షలు మంగళవారానికి 719వ రోజుకు చేరాయి. దీక్షల్లో స్టీల్‌ ఇఎస్‌, సేఫ్టీ, టెక్‌, సెల్‌ విభాగాల కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ, కో-కన్వీనర్‌ అయోధ్యరామ్‌, నాయకులు వరసాల శ్రీనివాసరావు, డి.శ్రీనివాస్‌ మాట్లాడారు. ఉక్కు ప్రజా గర్జన సభను విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ అంశాన్ని వైసిపి పార్లమెంట్‌ అంశాల అజెండాలో పెట్టాలని కోరారు. ఈ బడ్జెట్‌ సమావేశాల్లో విశాఖ ఉక్కుపై చర్చ జరగాలని డిమాండ్‌ చేశారు. ప్లాంట్‌ పరిరక్షణ విషయమై దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకూ, ఉభయ సభల్లో ఉన్న పార్లమెంట్‌ సభ్యులకూ మరోమారు పోరాట కమిటీ తరుపున విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. పోరాటానికి మరింత పదును పెట్టేందుకు త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. దీక్షల్లో నాయకులు వి.అప్పారావు ఆర్‌.రామారావు, వి.వెంకటేష్‌, కె.శ్రీనివాసరావు, ఎంఆర్‌కె.ప్రసాద్‌, సుధాకర్‌ పాల్గొన్నారు.