Nov 23,2022 07:53

చరిత తొమ్మిదవ తరగతి చదువుతోంది. ప్రతి రోజూ అమ్మా నాన్నల దగ్గర గొడవ చేసి డబ్బులు తీసుకొని పాఠశాలకు వెళ్ళేది. తండ్రి సీతయ్య వ్యవసాయ కూలీ. రోజూ కూతురికి డబ్బులు ఇవ్వడం కష్టంగా అనిపించేది. పుస్తకాలు కొనాలి, పరీక్ష ఫీజు కట్టాలంటూ డబ్బులు తీసుకునేది. ఆ డబ్బులతో ఫ్రెండ్స్‌తో కలిసి దుబారా ఖర్చు చేస్తూ ఉండేది.
చరిత పాఠశాల బయట ఓ మర్రి చెట్టు కింద 70 ఏళ్ల వృద్ధుడు పొద్దస్తమానం పుస్తకాలు చదువుతూనే ఉండేవాడు. సాయంత్రం కాగానే పిల్లలకు పాఠాలు చెప్పేవాడు. ఇది గమనించిన చరిత ఒకరోజు పాఠశాలకు వెళ్తూ ఆ వృద్ధుడు దగ్గర ఆగింది. 'తాతా.. ఈ వయసులో కూడా మీరు పుస్తకాలు చదువుతారు ఎందుకు?' అని అడిగింది.
అమ్మా! నేను నీ వయసులో ఉన్నప్పుడు చదువు విలువ తెలియక చదువును నిర్లక్ష్యం చేశాను. స్నేహితులతో కలిసి పొలాల వెంట తిరిగాను. పెద్దయ్యాక ఊర్లోనే కూలీనాలీ చేసుకుంటూ బతికాను. కష్టాలు పడి నా పిల్లలను చదివించాను. వాళ్ళు జీవితంలో స్థిరపడ్డారు. చదువ విలువ తెలుసొచ్చింది. అందుకే ఇప్పుడు చదువుతున్నా. అర్థం చేసుకున్న విషయాలను పిల్లలకు బోధిస్తున్నా.' అన్నాడు.
తన తప్పును తెలుసుకున్న చరిత ఆ రోజు నుంచి తండ్రిని డబ్బులు అడగడం మానేసింది.ప్రతి రోజూ పాఠశాలకు వెళ్లి బాగా చదువుకుంది. కూతురిలో వచ్చిన మార్పుకు సీతయ్య చాలా సంతోషించారు.

- ఖర్జూరపు సరిత , 9వ తరగతి, మేళ్ళచెరువు,సూర్యాపేట,
63053 93291.