Nov 29,2022 10:20

ఎలా మరచిపోతాం
మట్టి పొరల్లోంచి తొంగి చూస్తున్న
ప్రతి మొక్క హృది భాగంలో
గుండెగా ఒదిగిపోయి వున్నాడు
చిగురు చిగురు పరిపక్వత వెనకాల
మెతుకు మెతుకుగా విప్పార్చుతూ
ప్రతి ఉదరపు పేగుల తిత్తుల్లో
ప్రాణవాయువులా పదిలమైనాడు
ఎవరో రైతు లేడంటే ఎలా
మేఘాల్లో తాను సగమైపోతూ
చినుకు చుక్కల సాక్షిగా
రైతు పైరులా ఊగిపోతున్నాడు
గింజ గింజగా పోగైపోతూ
రాశిగా నిండు హృదయంతో
ఓర్పుతో బతుకు వెళ్ళదీస్తున్నాడు
ఎవరు పట్టించుకోకపోయినా
అందరి కోసం తాను
భారాన్ని తలపై మోస్తూనే
మట్టి కుండలో బియ్యంలా
తాను ఉడికిపోతూనే ముద్దగా
చేతిలో ఇమిడిపోతున్నాడు
కోరు భూమి కోతల మధ్య
రేటుకు రాని విత్తుల పిప్పి మధ్య
బిక్కుబిక్కుమంటూ తొంగిచూస్తూ
అక్కడక్కడే తచ్చాడుతున్నాడు
రైతు లేడని ఎవరన్నారు
చీడ తొలిచిన వేర్లు నడుమన
ఎరువుల అధిక ధరల మధ్యన
గిట్టుబాటు కాని
ఎద్దుల గిట్టల నడిమధ్యన
ఇరుక్కుపోయి ఎరక్కపోయాడు
రైతున్నాడు సుమీ.

- నరెద్దుల రాజారెడ్డి
సెల్‌: 9666016636