
- ఇప్పుడు లోకేష్ టార్గెట్ అంట
- - తాటాకు చప్పుళ్లకు భయపడను
- 96 శాతం హామీలు అమలు చేస్తే జనాలకు ఈ కష్టాలు ఎందుకో
- 'ఇదేం ఖర్మ రాష్ట్రానికి' ప్రారంభోత్సవ కార్యక్రమంలో టిడిపి అధినేత చంద్రబాబు
ప్రజాశక్తిా ఏలూరు ప్రతినిధి : 'మేము తలుచుకుంటే మొద్దు శ్రీనుతో చంద్రబాబును చంపించే వాళ్లమని చెబుతున్నారు. నన్ను చంపడం బాబాయ్ ని చంపినంతా సులువు కాదు. ఇప్పుడు లోకేష్‌ను టార్గెట్ చేసుకున్నారంట. వీళ్ల తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు. నేను అనుకుంటే జగన్ బయటకు వచ్చేవాడు కాదు' అంటూ టిడిపి అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. 'నీకు పోలీసుల అండ ఉంటే నాకు ప్రజల అండ ఉందని వ్యాఖ్యానించారు. 'ఇదేం ఖర్మ రాష్ట్రానికి' కార్యక్రమం ప్రారంభోత్సవంలో భాగంగా బుధవారం ఆయన ఏలూరు జిల్లాలో పర్యటించారు. కలపర్రు టోల్గేట్ వద్ద చంద్రబాబుకు టిడిపి నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో పెదవేగి మండలం విజయరాయి చేరుకున్నారు. జానంపేట వంటి పలు చోట్ల చంద్రబాబుకు హారతులతో మహిళలు స్వాగతం పలికారు. విజయరాయిలో కొంతమంది ఇళ్లకు వెళ్లి ప్రస్తుత పాలనలో ఎదుర్కొంటున్న సమస్యలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక సెంటర్లో వాహనంపై నుంచి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. పోలవరాన్ని గోదావరిలో ముంచేశారు. పోలవరం ప్రాజెక్టుకు అన్ని ఆటంకాలూ తొలగించి 72 శాతం పనులు పూర్తి చేస్తే జగన్ అధికారంలోకొచ్చి రివర్స్ టెండరింగ్ పేరుతో నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీగానీ, డయాఫ్రంవాల్గానీ, కాఫర్డ్యాంగానీ ఏఒక్కటీ పూర్తి చేయకుండా ప్రాజెక్టును గోదావరిలో ముంచేశారని చంద్రబాబు అన్నారు. కొత్తగా వచ్చిన మంత్రికి డయాఫ్రంవాల్ ఎక్కడ ఉంటుందో తెలీదంటూ ఎద్దేవా చేశారు. స్థానిక ఎంఎల్ఎ కొఠారు అబ్బాయి చౌదరిని లండన్ బాబూ అంటూ విమర్శలు గుప్పిస్తూ 'మళ్లీ లండన్ పంపిస్తా'... ఎవరితో పెట్టుకుంటున్నావో మరిచిపోకు అంటూ హెచ్చరించారు. వివేకా హత్య కేసును సుప్రీంకోర్టు తెలంగాణకు అప్పగించడం జగన్‌కు చెంపపెట్టు అన్నారు. విద్యుత్తు బిల్లులు, ఆర్టిసి ఛార్జీలు, నిత్యావసరాలు, వంట నూనె, పెట్రోలు, డీజిల్, మద్యం వంటి ధరలు పెరిగిపోయి జనం ఇదే ఖర్మ అంటూ తీవ్ర ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో ఆనాడే తాను చెప్పానన్నారు. ఇసుక, పోలవరం కాలువ గట్లు మాయం చేస్తున్నారని ఆరోపించారు. 96 శాతం హామీలు అమలు చేస్తే ప్రజలకు ఈ కష్టాలు ఎందుకని ప్రశ్నించారు. ఊరికో సైకోను తయారు చేశారని విమర్శించారు. దేనికి నవ్వాలో కూడా తెలియకుండా ప్రతిదానికీ జగన్ నవ్వుతాడంటూ ఎద్దేవా చేశారు. ధాన్యాగారంగా పేరొందిన జిల్లాలో పంటకు గిట్టుబాటు ధర లేకుండా చేశారన్నారు. పామాయిల్ రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చింతలపూడి ప్రాజెక్టును వదిలేశారని విమర్శించారు. ఆక్వా కల్చర్‌ను దెబ్బతీశారన్నారు. ఇప్పుడు ప్రజలు కళ్లు తెరవాలని, లేదంటే రాష్ట్రానికి ఇదే చివరి అవకాశమని పేర్కొన్నారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి, క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ అందరితో నినాదాలు చేయించారు. విజయరాయి నుంచి వలసపల్లి క్రాస్ రోడ్డు, ధర్మాజీగూడెం కార్నర్, మట్టలగూడెం, లింగపాలెం మీదుగా చింతలపూడి చేరుకుని అక్కడ బహిరంగ సభలో ప్రసంగించారు. రాత్రికి కొయ్యలగూడెం మండలం సరసన్నపాలెం సమీపంలోని దొండపూడి ఫంక్షన్ హాలులో బస చేశారు.