
జనవరి 18 ఉదయం.. హర్యానా జౌన్ గ్రామం.. ఇంకా చలి దుప్పటి కప్పుకునే ఉంది. అప్పుడే నిద్రలేచాడు అజయ్ కుమార్. తన ఇద్దరు బిడ్డలను లేపి సిద్ధం చేసి, స్కూటర్‌పై ఎక్కించుకుని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఖజాన్ సింగ్ అఖాడా(కుస్తీపోటీ) కేంద్రానికి తీసుకెళ్లాడు. పిల్లల శిక్షణ పూర్తయ్యేవరకు అక్కడే ఉండి ఆ తరువాత వాళ్లను స్కూలులో దింపాడు. ఆ తరువాత అతనికున్న కాస్త వ్యవసాయ భూమిలో పొలం పనులకు వెళ్లాడు.. పనులు ముగించుకుని సాయంత్రం కాగానే స్కూలు నుండి బిడ్డలను తీసుకుని ఇంటికి చేరుకున్నాడు. రోజూ అతని దినచర్య ఇదే.. కాని ఆ రోజు మాత్రం టీవీలో వస్తున్న ఓ వార్త అతనిని కుదురుగా కూర్చోనీయలేదు. అది.. కొన్ని రోజులుగా దేశరాజధాని ఢిల్లీ నగరంలో తమపై అధ్యక్షుడు లైంగిక దాడులకు పాల్పడ్డాడని.. తమ ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని రెజ్లర్ల బృందం చేస్తున్న నిరసన.. ఆ వార్త అతన్ని ఎందుకంత కలవరపెట్టింది..? ఒక్కసారిగా కుమార్ ఎందుకంత నిరుత్సాహపడిపోయాడు..?

కుమార్ కూతురు 9 ఏళ్ల ఖుషీ ఐదేళ్ల క్రితమే అఖాడాలో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఖుషీ వయసు 14. ఈ ఐదేళ్లలో అండర్ 15 విభాగంలో ఎన్నో కుస్తీ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. వెండిపతకం కూడా ఆ జాబితాలో ఉంది. ఇంతటి విజయం వెనుక ఆమె ఎంతో శ్రమించింది. ఆ శ్రమ శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా.. పోటీలకెళ్లిన ప్రతిసారీ మహిళా అథ్లెట్లకు ప్రత్యేక మరుగుదొడ్లు లేని కారణంగా ఎన్ని గంటలైనా సరే ఇంటికి వచ్చాకే 'ఆ' అవసరం తీర్చుకునేది. అంతేనా.. 'మగ పిల్లల ఆట ఈ పిల్లకెందుకు?' అన్న ఇరుగుపొరుగు వాళ్ల సూటిపోటీ మాటలు చెవినపడేవి. అదేకాదు.. గ్రామస్థాయి క్రీడాకారులను ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథక సాయం కూడా ఆమెకు అందలేదు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా మొక్కవోనిధైర్యంతో ఖుషి పోటీలకు సిద్ధమవ్వడం వెనుక ఆ ప్రాంతం నుండి అంతర్జాతీయ స్థాయికి వెళ్లిన మహిళా రెజ్లర్ల ప్రభావం ఎంతోఉంది.
ఇప్పుడు ఆ రెజ్లర్లకు ఎదురైన పరిస్థితే ఆ తండ్రిని అంత కలవరం పెడుతోంది. 'ఖుషీ అఖాడాలోకి ప్రవేశించే నాటికి అక్కడ 50 నుండి 55 మంది పురుషులు శిక్షణ తీసుకుంటున్నారు. నేను ఖుషీని, ఆమె తమ్ముడిని అక్కడికి తీసుకెళ్లినప్పుడు ఆ కేంద్రంలో ఒక్క అమ్మాయే ఉంది. ఖుషీతో ఆ సంఖ్య ఇద్దరైంది' అంటూ ఆనాటి సంఘటనను గుర్తుచేసుకుంటున్న కుమార్ 'ప్రపంచ ఛాంపియన్లే నడిరోడ్డు మీద నిలబడి తమకు న్యాయం చేయమని పోరాడుతున్నారు. వాళ్ల మాటలే వినిపించుకోని అధికారులు రేపు నాలాంటి పేదరైతు కూతురు మాట వినిపించుకుంటారా?' అంటూ ఆవేదన చెందుతున్నాడు. అతను ఇంకా ఇలా అంటున్నాడు.. 'శిక్షణకైతే నేను తీసుకెళ్తాను. కానీ పోటీలకు తల్లిదండ్రులకు ప్రవేశం లేదు. ఎంత దూరమైనా కోచ్ ఆధ్వర్యంలోనే వెళ్లాలి. ఆ కోచ్ వాళ్లపై ఏ దాడి చేసినా అక్కడ తిరగబడే వీలుంటుందా? ప్రస్తుత పరిణామంలో మనకు తెలుస్తున్నదేంటి? అని ప్రశ్నిస్తున్నాడు.
ఆడపిల్లలకు రక్షణ లేదు..
'స్కూలైనా.. క్రీడలైనా ఆడపిల్లలకు రక్షణ లేదు.. ఇంత తెలిసినా మేము మా పిల్లకు కుస్తీపోటీ నేర్పించాం. రోజూ బట్టల నిండా మురికి, బురద ఉండేది. పోటీలో తనకంటే పెద్ద వారితో కూడా తలపడేది. ఒళ్లు హూనం చేసుకుని మరీ కష్టపడేది. పిల్లకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఎంతో ఆశపడ్డాం. కాని ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తుంటే మా అమ్మాయిని ముందుకు పంపాలా? లేక ఆమె ఇన్నాళ్ల కలలను చెరిపేసి ఇంట్లోనే ఉంచాలా? అయోమయంగా ఉంది' అంటూ ఖుషీ తల్లి కన్నీళ్లుపెట్టుకుంటోంది.
సాంప్రదాయంగా..
హర్యానా వ్యాప్తంగా ఎన్నో గ్రామాల్లో కుస్తీపోటీలు ఓ సాంప్రదాయ క్రీడల్లాగా నిర్వహిస్తున్నారు. దంగల్ పేరుతో నిర్వహించే ఈ పోటీలలో మొదట ఆడపిల్లల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. ఐదేళ్ల క్రితం నుండే ఎక్కువగా ఈ క్రీడవైపు ఆకర్షితులౌతున్నారు. ముఖ్యంగా 'పేదింటి అమ్మాయిలు ఈ క్రీడ వైపు రావడానికి ఏకైక కారణం ఆర్థికంగా తమను ఆదుకుంటుందని..' అని చెబుతారు పుర్ఖాన్ గ్రామ దంగల్ నిర్వాహకుడు గులియా. 'సాధారణంగా ఈ దంగల్ నిర్వాహకులలో ఎక్కువమంది మాజీ రెజ్లర్‌లే ఉంటారు. తమ ప్రతిభను పదిమందికీ పంచడమే కాక ప్రభుత్వ సాయం అందని కుటుంబాల పిల్లలకు ఆర్థికంగా చేయూతనివ్వడం కోసం స్థానిక నాయకులను, వ్యాపారుల నుండి కూడా నిధులు సేకరించి దంగల్ నిర్వహిస్తుంటారు. బహుమతి సొమ్ము వేల రూపాయల నుండి లక్షల రూపాయల వరకు ఉంటుంది. 'ఆ సొమ్మే పేద క్రీడాకారులను ఎంతో ఆదుకుంటుంది. అందుకే ఈ పోటీలు వర్షాకాలం మినహా రాష్ట్రమంతటా మార్చి నుండి జులై వరకు సగటున రోజుకు ఒకటి చొప్పున నిర్వహిస్తుంటార'ని చెబుతారు గులియా. ఈ మాటలను బట్టి ఆ కుస్తీపోటీలు కేవలం వినోదం కోసం ఏర్పాటుచేసినవి కాదని అర్థం చేసుకోవచ్చు.
2010లో గీతా ఫొగట్ ఢిల్లీ కామన్‌వెల్త్ పోటీల్లో పతకం గెలుచుకున్నప్పటి నుండే దంగల్ పోటీల్లో అమ్మాయిల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. హర్యానాకు చెందిన మహిళా రెజ్లర్లు ఇప్పటికి పదికి పైగా అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ఎనిమిది స్వర్ణాలతో సహా 26 పతకాలు సాధించారు. మూడు ఒలింపిక్, నాలుగు ఆసియా క్రీడలు, ఐదు కామన్వెల్త్ గేమ్స్‌లో తమ ప్రతిభ చూపారు.
వివక్షకు గురవుతున్నారు
ఇంతటి ప్రతిభ వెనుక వారు ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ పోటీల్లో పాల్గొనే ఆడపిల్లలకు బహుమతి సొమ్ములో సగం మాత్రమే ముట్టజెబుతారు. కొన్నిసార్లు కొన్ని నిర్వాహక సంస్థలు మహిళలు పోటీల్లో పాల్గొనడానికి అభ్యంతరం వ్యక్తం చేస్తాయి. మరికొన్ని మహిళలకు ప్రత్యేకంగా రెజ్లింగ్ మ్యాట్స్, టారులెట్స్, దుస్తులు మార్చుకునే గదులు ఏర్పాటుచేయడానికి నిరాకరిస్తాయి.
ఇంటి మూలలు కదలిపోతాయి
'నా బిడ్డ లాంటి వాళ్లు ఈ పోటీల్లో పాల్గొనాలంటే వారి ఇంటి నాలుగు మూలలు కదిలిపోతాయి. మొత్తం కుటుంబమంతా ఆర్థికంగా, సామాజికంగా, శారీరకంగా, మానసికంగా కుంగిపోతుంది. ఇప్పుడు ఎందురైన పరిస్థితి ఇంటి కంటే దారుణమైంది. ఈ పరిస్థితి వారిని ఇంకా వణికిస్తోంది. పురుషాధిక్య భావజాలంతో కూరుకుపోయిన ఈ వ్యవస్థలో నిత్యం అన్యాయానికి గురౌతున్న వారు ఎన్నాళ్లు పోరాడాలి?' అంటూ ఖుషీ తల్లి ప్రశ్నిస్తోంది. ఈ ప్రశ్న ఆమె ఒక్కదానిదే కాదు.. క్రీడాపోటీల్లో పాల్గొనే ప్రతి క్రీడాకారిణి తల్లిది..