Jan 23,2023 09:56

         పెళ్లి వేడుకల్లో వధూవరులు ప్రత్యేక వస్త్రాలు, ఆభరణాలు ధరించి అందరి కన్నా ఆకర్షణగా నిలుస్తారు. జీవితంలో చేసుకునే ముఖ్యమైన వేడుక అంటూ వాటికోసం భారీ మొత్తంలో ఖర్చుపెడతారు. మరి అంత డిమాండ్‌ ఉన్న ఆ వస్త్రాలను, ఆభరణాలను డిజైన్‌ చేయాలంటే ఆ కోర్సులో శిక్షణ, అనుభవం ఉండాలి. ఇవేమి చేయకుండానే రాధేశర్మ మంచి డిజైనర్‌గా గుర్తింపు పొందారు. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. 90 ఏళ్ల వయసులోనూ కష్టపడుతూ ఆమె అందరికీ ప్రేరణగా నిలుస్తున్నారు.
         మణిపూర్‌లోని తౌబల్‌ జిల్లాలోని వాంగ్‌జింగ్‌ గ్రామానికి చెందిన హంజాబామ్‌ ఒంగ్బీ రాధే శర్మ పేద కుటుంబంలో పుట్టింది. తండ్రి ఆలయ పూజారి. తల్లి గృహిణి. ఐదుగురు పిల్లల్లో తాను మూడో సంతానం. పెద్ద కుటుంబం కావడంతో ఆమెను పెద్దగా చదివించలేదు. 13 ఏళ్లకే పెళ్లిచేసి పంపారు. రాధే భర్త వంటపుట్టు. శుభకార్యాలు జరుగుతున్నప్పుడే ఆయనకు ఉపాధి దొరుకుతుంది. మిగిలిన రోజుల్లో ఇల్లు గడవడం కష్టమయ్యేది. ఆ క్రమంలో ఆమె ఇంటి ముందు కొట్టుపెట్టి టీ అమ్మింది. ఐదుగురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు పుట్టారు. పిల్లలను పోషించేందుకు భర్త తెచ్చె ఆదాయం సరిపోయేది కాదు. తినీ తినక బిడ్డలకు అన్నం పెట్టుకునేది. అందరినీ చదివించాలంటే కష్టమనిపించింది. తాను చదువుకోకపోయినా పిల్లల్ని మాత్రం చదివించాలని, కడుపునిండా అన్నం పెట్టాలన్న కోరికతో మరో ఉపాధి మార్గం వెతికింది.
 

                                                                      ఇష్టంగా నేర్చుకుని

రాధే ఇంటికి దగ్గర్లో సంప్రాదాయ కళాకారులు ఉన్నారు. వారి దగ్గర పొట్లోరు సెట్పిలో శిక్షణ తీసుకున్నారు. వస్త్రాలపై డిజైనింగ్‌. చేతివృత్తి పనికావడంతో మొదట్లో బాగా కష్టపడ్డారు. కళ్లు మంటలు, తల నొప్పి వచ్చేవి. భరిస్తూనే వస్త్రాలపై డిజైన్‌ చేసేవారు. అక్కడే రోజువారీ కూలిపనికి వెళ్లింది. వచ్చిన డబ్బుతో పిల్లలను కుటుంబాన్ని పోషించింది. పండగవేళల్లో పిల్లల కోసం నిద్రపోకుండా మరింత కష్టపడింది.
          ఈ క్రమంలో బ్రైడల్‌ డ్రెస్‌ల డిజైన్‌ పై ఆసక్తి పెంచుకుని శిక్షణ పొందింది. డిమాండ్‌ ఉన్న మణిపూర్‌ మెయిటీ కమ్యూనిటీ సాంప్రదాయ పెళ్లి దుస్తులు, అభరణాల తయారీలో కొత్త మెలకువలు నేర్చుకుంది. పెళ్లిళ్ల సీజనులో క్షణం తీరిక లేకుండా బాగా శ్రమించేవారు. అప్పట్లో రోజంతా కష్టపడితే రూ.10 కూలి ఇచ్చేవారు. ఐదేళ్ల తర్వాత స్వయంగా వ్యాపారం ప్రారంభించింది. మొదట భర్త బిజినెస్‌ వద్దని వారించాడు. తల్లిదండ్రుల మద్దతుతో పెట్టుబడి పెట్టి ఆమె అడుగు ముందుకు వేసింది. రాధే సృజనాత్మకమైన డిజైన్లతో పెళ్లి దుస్తులు మరింత ఆకర్షణగా కుట్టి వినియోగదారుల ప్రశంసలు అందుకొంది. ఆమె పనితనం మెచ్చి చాలామంది ఆమె దగ్గరే పెళ్లిబట్టలు కొనుగోలు చేసేవారు. 15-20 రోజులు పట్టే దుస్తుల తయారీకి ఆ రోజుల్లో రూ.150 వచ్చేది. ప్రతిరోజూ వస్త్రాలను, అభరణాలను ఇంటిముందు వేసి, తయారీలో నిమగమవుతున్న రాధేను చూస్తూ పెరిగిన పిల్లలూ ఈ కళను నేర్చుకున్నారు.
 

                                                                            భర్త మరణం...

పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఆమె భర్త మరణించాడు. దాంతో ఆమె మానసికంగా కుంగిపోయింది. పిల్లల ముఖం చూస్తూ ఏడ్వని రోజంటూ లేదు. వారి కోసం ధైర్యం తెచ్చుకుని మళ్లీ వ్యాపారం కొనసాగించింది. కాని ఆ సమయంలో ఆమెను పెళ్లి వస్త్రాలు తయారీ చేయొద్దని చుట్టుపక్కల వారు, తోటి వ్యాపారులు సూచించారు. మరొక పని వెతుక్కోమని సలహాలూ ఇచ్చారు. అయినా రాధే ఎంతో ఇష్టంగా నేర్చుకున్న విద్యను వదులుకోలేదు. మణిపూర్‌ సంస్కృతి ఉట్టిపడేలా తన బట్టలను మరింతగా డిజైన్‌ చేసేవారు. అంతేకాదు.. తనలాంటి ఒంటరి మహిళలకూ, అనేక మంది యువతకు శిక్షణ ఇచ్చి వారి కుటుంబాల ఆదాయానికి కారణమయ్యారు. డిజైనింగ్‌లో ఆమె ప్రతిభను గుర్తించిన అధికారులు ప్రభుత్వ కార్యక్రమాలకు ఏకరూప దుస్తుల తయారీకి పురమాయించేవారు.
           దాంతో పెళ్లి దుస్తులతో పాటు, రాస్‌ లీలా శాస్త్రీయ నృత్యం కోసం, మణిపూర్‌లో జరుపుకునే వివిధ పండుగలకు కూడా రాధే దుస్తులు డిజైన్‌ చేశారు. మారుతున్న జనరేషన్‌కు తగ్గట్టుగా, సంప్రదాయ దుస్తుల డిజైన్లను ఆకర్షణీయంగా ఆమె మార్చేది. కుటుంబంలో కీలకంగా నిలబడి పిల్లలను మంచిగా చదివించి, వారి ఎదుగుదలకు కృషిచేశారు. ప్రాచీన సంస్క ృతి మరుగున పడకూడదన్న సంకల్పంతో కళను యువతకు నేర్పిస్తూ, మహిళలకు ఉపాధి కల్పిస్తున్న రాధేకు అధికారులు గత ఏడాది పద్మశ్రీ అవార్డు అందజేశారు.

                                                                          వృద్ధాప్యంలోనూ...

రాధేకు వయస్సు పెరుగుతున్న కొద్ది చూపు మందగించింది. దాంతో ఇంటికి వచ్చిన కోడళ్లు ఆమె వారసత్వంగా వ్యాపారాన్ని బాధ్యతగా కొనసాగిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం పెద్దకొడుకు అనారోగ్యంతో చనిపోయాడు. దాంతో కొడుకు కుటుంబానికి అండగా నిలిచి వారి పిల్లల పెళ్లిళ్లు చేశారు. ఇప్పుడు ఆమెకు తోడుగా పిల్లలతో పాటు 24 మంది మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. ఇప్పుడు రాధేకు 90 ఏళ్లు. అయినా ఇప్పటికీ డిజైన్ల విషయంలో కోడళ్లకు, తోటి డిజైనర్లకు సలహాలు ఇస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.