
ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్ కోనసీమ) : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి విజయం సాధించడం వైసీపీకి చెంప పెట్టని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. శనివారం జోగేశ్వరరావు మాట్లాడుతూ ... వైసిపి ప్రభుత్వం పతనానికి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నాందని టిడిపి ముందంజపై హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన వేపాడ చిరంజీవిరావు, తూర్పు రాయలసీమ నియోజకవర్గంలో కంచర్ల శ్రీకాంత్ లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిల గెలుపునకు కఅషి చేసిన ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఎన్నికల ఫలితాలు విజయం వైపు అడుగులు వేయడం, ప్రజలు మార్పు కోరుకోవడం స్పష్టమవుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్ని అరాచకాలు సృష్టించి, దొంగ ఓట్లు వేయించినా, భారీ మెజారిటీతో విజయం సాధించడం ప్రజాస్వామ్య విజయమేనని వేగుళ్ళ అన్నారు. ప్రజలు కూడా అవకాశం కోసం ఎదురుచూస్తున్నారని, విద్యావంతులైన పట్టభద్రులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, యువత ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు.