Jan 24,2023 11:03

న్యూఢిల్లీ : మీడియా ప్రచురించే ఏదైనా ఒక వార్తను పిఐబి నిజనిర్ధారణ విభాగం లేదా ప్రభుత్వానికి చెందిన మరే అధీకత సంస్థ 'ఫేక్‌న్యూస్‌' అని చెబితే దాన్ని సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాల్సిందేనంటూ ఇటీవల కేంద్ర ఎలక్ట్రానిక్స్‌/ఐటీ శాఖ ప్రతిపాదించిన సవరణపై న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ అండ్‌ డిజిటల్‌ అసోసియేషన్‌ (ఎన్‌బిడిఎ) తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఈ ప్రతిపాదిత సవరణ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1)(ఎ) ప్రకారం మీడియా వాక్‌ స్వాతంత్య్రం, భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని పేర్కొంది. ఈ మేరకు ఎన్‌బిడిఎ ప్రధాన కార్యదర్శి అన్నీ జోసెఫ్‌ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్‌ అండ్‌ డిజిటల్‌ మీడియా ఎథిక్స్‌) రూల్స్‌, 2021కు సవరణల్నిప్రతిపాదిస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ ఈ నెల 17న సవరణ ముసాయిదాను జారీ చేసింది. ఈ సవరణలను ఎన్‌బీడీఏ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ ప్రతిపాదిత సవరణతో ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతూ ప్రచురితమయ్యే కథనాలను 'నిజనిర్ధారణ' పేరుతో ఆన్‌లైన్‌ నుంచి తొలగించే ప్రమాదం ఉందని ఎన్‌బీడీఏ ఆందోళన వ్యక్తం చేసింది. ఎలాంటి పరిశీలన లేకుండానే డిజిటల్‌ వార్తల కంటెంట్‌ను నియంత్రించేలా పిఐబి అపరిమితమైన అధికారాలు కట్టబెట్టడమంటే.. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉన్న మీడియా గొంతు నొక్కడమేనని అభివర్ణించింది. ఇలాంటి చర్యలు మీడియాపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపింది.
           మీడియాకు ఉన్న భావప్రకటనా స్వేచ్ఛలో ప్రభుత్వ జోక్యాన్ని పెంచేలా ఈ సవరణ అపరిమితమైన అధికారాలు కల్పిస్తుందని ఎన్‌బిడిఎ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అధికారాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వార్తల్ని సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా నకిలీవిగా పేర్కొంటూ పిఐబి లేదా ఇతర ఏజెన్సీలు ఆ కంటెంట్‌ను బలవంతంగా తొలగించాలని మధ్యవర్తులు/సోషల్‌ మీడియా సంస్థల్ని ఆదేశించే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ సవరణ ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు, విమర్శలు రాకుండా నిరోధించేలా వార్తా ప్రసార మాధ్యమాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. వార్తా ప్రసార మాధ్యమాలను నియంత్రించేందుకు ఇప్పటికే తగినన్ని చట్టాలు, నిబంధనలు, చట్టబద్ధమైన సంస్థలు ఉన్నాయని ఎన్‌బీడీఏ ఈ సందర్భంగా గుర్తు చేసింది. అందువల్ల, మీడియాపై ప్రభుత్వం అధిక నియంత్రణ ఆమోదయోగ్యం కాదని తెలిపింది. ఈ రకమైన సెన్షార్‌షిప్‌ను రాజ్యాంగకర్తలు ఊహించలేదని పేర్కొంది. అసోసియేషన్‌ వ్యక్తం చేసిన ఆందోళనల దష్ట్యా పైన పేర్కొన్న సవరణను ఉపసంహరించుకోవాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీశాఖను ఎన్‌బీడీఏ విజ్ఞప్తి చేసింది.