Sep 29,2022 19:00
  •  ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో సాగిన రైతుల యాత్ర

ప్రజాశక్తి - ఏలూరు టౌన్‌ : దేశమంతా గుర్తించిన అమరావతిని కాదని, మూడు రాజధానుల ఏర్పాటు అనడం వైసిపి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అమరావతి జెఎసి నాయకులు, టిడిపి నేతలు, ప్రజాప్రతినిధులు విమర్శించారు. వైసిపి ప్రభుత్వాన్ని సాగనంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వారు హెచ్చరించారు. ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన 'అమరావతి టు అరసవెల్లి' మహాపాదయాత్ర గురువారం ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో సాగింది. స్థానిక రైతులు, టిడిపి, సిపిఎం, సిపిఐ, జనసేన, ఆప్‌ పార్టీల శ్రేణులు, కార్మిక, కర్షక సంఘాలు, వివిధ ప్రజాసంఘాల నాయకులు, అభిమానులు యాత్రకు ఘన స్వాగతం పలికారు. యాత్రకు మహిళలు అడుగడుగునా హారతులిచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎంపి మాగంటి బాబు మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా అమరావతే తమ రాజధానిగా ఉంటుందని తెలిపారు. మూడు రాజధానుల పేరిట జగన్‌, విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ విశాఖలో వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, ఏలూరు తెదేపా కన్వీనర్‌ బడేటి చంటి మాట్లాడుతూ.. రైతుల ఆవేదన అర్ధం చేసుకోకుండా, అర్ధంలేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. దెందలూరు మండలం కొవ్వలి మట్టపర్తి భవన్‌ నుంచి ప్రారంభమైన యాత్ర జోగన్నపాలెం అడ్డరోడ్డు మీదుగా శ్రీరామవరం, మేదినరావుపాలెం, తిమ్మరాయగూడెం, చల్ల చింతలపూడి మీదుగా పెరుగుగూడెం చేరుకుంది. శుక్రవారం పెరుగుగూడెం నుంచి యాత్ర మొదలై సూర్యచంద్రరావుపేట, తిమ్మాపురం మీదుగా ద్వారక తిరుమల చేరుకోనుంది.