Jun 22,2022 18:35

సీతారాంపల్లిలో సాగర్‌, అజయ్, రేవంత్‌ అనే ముగ్గురు మిత్రులు ఉండేవారు. సాగర్‌ చాలా పేదవాడు. అజయ్,  రేవంత్‌ మధ్య తరగతి కుటుంబానికి చెందినవారు. ఈ ముగ్గురు పదవ తరగతి చదువుతున్నారు. చదువులో ఎప్పుడూ ముందుండేవారు. చదువులో వీరి పట్టుదలను చూసి ఉపాధ్యాయులు కూడా మెచ్చుకునేవారు.

ఒక రోజు పదో తరగతి వార్షిక పరీక్షల కోసం ఫీజు చెల్లించాలని నోటీసు వచ్చింది. వారం రోజుల గడువు ఉందని, విద్యార్థులు సకాలంలో ఫీజు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతి ఉంటుందని ఉపాధ్యాయులు చెప్పారు. సాగర్‌ ఇంట్లో తల్లిదండ్రుల పరిస్థితి అర్థం చేసుకుని, ఫీజు గురించి చెప్పలేదు. అజయ్, రేవంత్‌ పరీక్ష ఫీజు చెల్లించారు. సాగర్‌ వరుసగా రెండు రోజులు పాఠశాలకు గైర్హాజయ్యాడు. అజయ్, రేవంత్‌లకు సాగర్‌ స్కూలుకు ఎందుకు రావడం లేదో అర్థం కాలేదు. కారణం తెలుసుకునేందుకు సాగర్‌ వాళ్ల ఇల్లు వెదుక్కుంటూ వెళ్లారు. ఇంట్లో సాగర్‌ ఒక్కడే మంచం మీద పడుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. సాగర్‌ను విషయం ఏమిటని అడగ్గా, పరీక్ష ఫీజు కట్టడానికి డబ్బులు లేవని, పరీక్షలు రాయలేనని విలపించాడు.

అప్పుడు ఇద్దరు మిత్రులు ' సాగర్‌ నువ్వు బాధ పడకు. మేమున్నాము కదా! మా అమ్మానాన్నలు మాకు అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బులు దాచి ఉంచాం. అవి దాదాపు వెయ్యి రూపాయలు ఉన్నాయి. వాటిని నీకు పరీక్ష ఫీజు కడతాం. పాఠశాలకి వెళ్దాం పదా' అని చెప్పారు. దాంతో సాగర్‌ వారిద్దరిని గట్టిగా సంతోషంగా ఆలింగనం చేసుకున్నాడు. స్కూలుకు వెళ్లి సాగర్‌ పరీక్ష ఫీజు కట్టారు. ముగ్గురు మిత్రులు పరీక్షలు రాసి, పదవ తరగతిలో మొదటి స్థానం సంపాదించి అందరి మన్ననలను పొందారు.

- కె.రేవతి,
10వ తరగతి,
జెడ్పి స్కూలు, రాయిలాపూర్‌,
రామాయంపేట, మెదక్‌ జిల్లా.