Aug 08,2022 20:50

సింధు, లక్ష్యసేన్‌తోపాటు పురుషుల డబుల్స్‌లోనూ పసిడి
టేబుల్‌ టెన్నిలో శరత్‌ కమల్‌కు కూడా..
- కామన్వెల్త్‌ గేమ్స్‌

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఆఖరిరోజు భారత్‌కు నాలుగు స్వర్ణ, ఒక్కో రజత, కాంస్య పతకాలు దక్కాయి. బ్యాడ్మింటన్‌లో మూడు, టేబుల్‌ టెన్నిస్‌(టిటి)లో ఒక స్వర్ణ పతకం లభించగా.. పురుషుల హాకీజట్టు ఫైనల్లో ఓడి రజత పతకానికే పరిమితం కాగా.. పారా టిటి సొనాల్‌బెన్‌ పటేల్‌ కాంస్య పతకం సాధించింది. దీంతో భారత్‌ 22స్వర్ణ, 16రజత, 23కాంస్యాలతో పతకాల పట్టికలో నాల్గోస్థానానికి ఎగబాకింది.
బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో పివి సింధు 21-15, 21-13తో మిఛ్చెలె లీ(కెనడా)పై వరుససెట్లలో గెలుపొందింది. దీంతో కామన్వెల్త్‌ క్రీడల్లో సింధు తొలిసారి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అంతకుముందు 2014లో కాంస్యం, 2018లో రజత పతకాలు సాధించిన సింధు.. ఈసారి ఏకంగా స్వర్ణ పతకాన్నే ముద్దాడింది. సింధు సాధించిన స్వర్ణ పతకంతో భారత్‌కు కామన్వెల్త్‌ క్రీడల్లో 200 స్వర్ణ పతకాలు దక్కినట్లైంది. ఇక పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ 19-21, 21-9, 21-16తో ఎన్‌జి టి యంగ్‌(మలేషియా)పై చెమటోడ్చి నెగ్గాడు. తొలి గేమ్‌ను చేజార్చుకున్న లక్ష్యసేన్‌.. రెండోగేమ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. మూడో గేమ్‌లో లక్ష్యసేన్‌ అర్ధభాగానికి 11-9తో ఉన్నా క్రమంలో పుంజుకొని 21-16తో ముగించాడు. దీంతో 2014లో పారుపల్లి కశ్యప్‌ తర్వాత 8ఏళ్లకు బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో మరో స్వర్ణాన్ని లక్ష్యసేన్‌ సంపాదించిపెట్టాడు.

gold

పురుషుల డబుల్స్‌ ఫైనల్లో రంకిరెడ్డి-చిరాగ్‌శెట్టి జోడీ 21-15, 21-13తో ఇంగ్లండ్‌ జోడీని వరుససెట్లలో ఓడించి బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో భారత్‌ కామన్వెల్త్‌ బ్యాడ్మింటన్‌ విభాగంలో 3స్వర్ణ, ఒక రజత, మరో రెండు కాంస్య పతకాలను సాధించినట్లైంది.
------
2022 : లక్ష్య సేన్‌
2014 : పారుపల్లి కశ్యప్‌
1982 : సయ్యద్‌ మోడీ
1978 : ప్రకాశ్‌ పదుకొనే

టేబుల్‌ టెన్నిలో

tt


టేబుల్‌ టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో 40ఏళ్ల ఆచంట శరత్‌ కమల్‌ స్వర్ణ పతకాన్ని గెలిచాడు. ఫైనల్లో శరత్‌ 4-1(11-13, 11-7, 11-2, 11-6, 11-9)తో ఇంగ్లండ్‌కు చెందిన లిమ్‌ పిచ్‌ఫోర్డ్‌ను చిత్తుచేశాడు. 4వ సీడ్‌గా బరిలోకి దిగిన శరత్‌ కమల్‌ తొలి సెట్‌ను చేజార్చుకున్నా.. ఆ తర్వాత వరుసగా నాలుగు గేమ్‌లను సొంతం చేసుకొని మ్యాచ్‌ను ముగించాడు. దీంతో 2006తర్వాత కామన్వెల్త్‌ క్రీడల్లో శరత్‌ కమల్‌ మరో మారు బంగారు పతకాన్ని సాధించినట్లైంది.
హాకీలో రజతమే..

hockey


పురుషుల హాకీజట్టు ఫైనల్లో ఆశించినస్థాయిలో రాణించలేకపోయింది. సోమవారం జరిగిన ఫైనల్లో భారత్‌ 0-7గోల్స్‌ తేడాతో పటిష్ట ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడింది. దీంతో ఈసారి కామన్వెల్త్‌ క్రీడల్లో పురుషుల హాకీ జట్టు రజత పకానికే పరిమితమైంది.