Jan 31,2023 22:05

ప్రజాశక్తి -సత్తెనపల్లి రూరల్‌ (పల్నాడు జిల్లా) : ఆహార కల్తీ జరిగి పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో గురుకుల పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలో ముగ్గురు ఉద్యోగులను జిల్లా కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ సి.హెచ్‌. జయలక్ష్మి, వార్డెన్‌ జోస్నా, హెల్త్‌ సూపర్‌వైజర్‌ వరలక్ష్మిని సస్పెండ్‌ చేసినట్లు గురుకుల విద్యాలయాల జిల్లా కో-ఆర్డినేటర్‌ శాంతి విశాల తెలిపారు. ఆహార కల్తీ నేపధ్యంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు మంగళవారం గురుకుల పాఠశాలలో విచారణ చేపట్టారు. సరుకులు, కోడిగుడ్లు, ఆహారపదార్థాలను పరిశీలించారు. నాసిరకం కందిపప్పు సరఫరా చేసినట్లు, అందులో బఠాని పప్పు కల్తీ, వంటగది పక్కనే టాయిలెట్‌ ఉండటాన్ని గుర్తించారు. పాఠశాలలో డ్రెయినేజీ నుంచి వస్తున్న దుర్గంధంపై ప్రిన్సిపల్‌ను ప్రశ్నించారు. పరీక్షల నిమిత్తం వాటర్‌, సరుకులు, కోడిగుడ్ల నమూనాలను సేకరించారు. దర్యాప్తు నివేదిక వచ్చిన తరువాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రులు విడదల రజనీ, అంబటి రాంబాబు ఈ సందర్భంగా ప్రకటించారు.