May 26,2023 10:34

ప్రజాశక్తి - తిరుమల : మారుతున్న కాలానుగణంగా సరికొత్త పరిజ్ఞానాన్ని ఉపయోగించు కుంటూ తిరుమల శ్రీవారి ఆలయ భద్రతను పటిష్టం చేసేలా టిటిడి ఏర్పాట్లు చేస్తోంది. భౌతిక,సైబర్‌ సెక్యూరిటీపై కేంద్ర రాష్ట్ర భద్రత అధికారులు ద్వారా టిటిడి అధ్యయనం చేయిస్తోంది. భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కొంటూ, ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతను తిరుమలలో ఉండేలా టిటిడి చర్యలు చేపట్టింది. వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు నిత్యం 60 వేల నుంచి 75 వేల వరకు భక్తులు వస్తుంటారు. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమల పుణ్య క్షేత్రంలో మూడంచెల భద్రత ఉన్న ఎక్కడో ఒకచోట లోపం జరుగుతూనే ఉంది. దర్శన టికెట్ల అమలు నుంచి భద్రత పరమైన అంశాల వరకు ఏదో రకంగా వార్తల్లో నిలుస్తోంది. మారుతున్న కాలానుగుణంగా టిటిడి అనుసరిస్తున్న వర్చువల్‌ విధానం అత్యంత పటిష్ఠమైన సైబర్‌ నేరగాళ్లు ఏదో రకంగా నకిలీ టికెట్లను రూపొందించి మరి భక్తులను మోసగించిన సంఘటనలు చాలా వరకు వెలుగులోకి వచ్చాయి. మూడంచెల భద్రత తిరుమలలో ఉందనీ చెప్పుకునే అధికారులు గంజాయి, మద్యం వంటివి తరలివస్తున్న నియంత్రించలేకపోతున్నారు. మొన్నటికి మొన్న శ్రీవారి ఆలయంలోకి ఓ యువకుడు మొబైల్‌ ఫోన్‌ తీసుకొని వెళ్ళి మరి ఆనంద నిలయాన్ని చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడం, ఉగ్రవాదులు తిరుమలలో సంచరిస్తున్నట్లు నకిలీ మెయిల్‌ రావడం, సిఎంవో స్టిక్కర్‌ గల వాహనం మాడ వీధుల్లో రావడం వంటివి భద్రత గూర్చి పలు అనుమానాలు కోట్లాది మంది భక్తులలో ఆందోళనలు కలిగిస్తున్నాయి. తిరుమలలో మూడంచెల భద్రతను పటిష్టం చేసేందుకు టిటిడి అడుగు ముందుకు వేసింది. తిరుమల భద్రతపై ముఖ్య అధికారిగా రాష్ట్ర హౌం ప్రిన్సిపాల్‌ సెక్రెటరీ హరీష్‌ కుమార్‌ గుప్తాను ప్రభుత్వం నియమించింది. రెండు రోజులగా స్థానిక అన్నమయ్య భవనంలో టిటిడి భద్రత అధికారులు, ఇంటెలిజెన్స్‌, పోలీస్‌ ఉన్నత అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.స్థానిక అన్నమయ్య భవనంలో తిరుమలలో భద్రత ఏర్పాట్లుపై సెక్యూరిటీ ఆడిట్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టిటిడి భద్రత విభాగంతో పాటు రాష్ట్రం నుంచి పలువురు ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ఆధునిక టెక్నాలజి సాయంతో తిరుమలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడతామన్నారు. సీసీటీవీ కంట్రోల్‌ రూమ్‌ లో కత్రిమ మేధను ఎలా వినియోగించాలి, ఎలాంటి సాప్ట్‌ వేర్‌ ను వాడాలి అనే అంశాలపై అధ్యయనం చేస్తామన్నారు. అదేవిధంగా యాంటీ డ్రోన్‌ టెక్నాలజీ, బాడీ స్కానర్స్‌ వినియోగంపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని రాష్ట్ర హౌం ప్రిన్సిపాల్‌ సెక్రటరీ హరీష్‌ గుప్తా తెలిపారు. తిరుమలలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపడానికి ఎస్పీ లేదా ఏఏస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఏడు కమిటీలు ఏర్పాటు చేశామని అనంతపురం రేంజ్‌ డీఐజీ అమ్మిరెడ్డి అన్నారు..ఈ కమిటీల్లోని అధికారులు 15 రోజుల పాటు పరిశీలన జరిపి నివేదిక సిద్ధం చేస్తారని, మరోసారి సమావేశమై సమీక్షిస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తర్వాత కమిటీలు చేసిన సూచనలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తామని డీఐజీ తెలిపారు.